JPC Report On Waqf Bill : ప్రతిపక్షాల ఆందోళన మధ్య వక్ఫ్ బిల్లుపై జేపీసీ రిపోర్ట్‌కు రాజ్యసభ ఆమోదం
Rajya Sabha: ప్రతిపక్షాల ఆందోళనల మధ్య వక్ఫ్ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఇచ్చిన నివేదికను రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ నివేదికను "నకిలీ" అని అభివర్ణించిన ఖర్గే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

Rajya Sabha Accepted JPC Report On Waqf Bill: విపక్షాల నుంచి తీవ్ర నిరసనలు, విమర్శలు ఎదుర్కొంటున్న 2024 వక్ఫ్ (సవరణ) బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ నివేదికను గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోదించారు. ఈ నివేదికపై వస్తున్న ఆరోపణలను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తోసిపుచ్చారు.
వక్ఫ్ (సవరణ) బిల్లుపై నివేదికను ప్యానెల్ సభ్యురాలు బిజెపి ఎంపీ మేధా విశ్రామ్ కులకర్ణి ప్రవేశపెట్టారు. తాము ఇచ్చిన సలహాలను నివేదిక నుంచి తీసేశారని ప్రతిపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
14 నిబంధనల్లో 25 సవరణలు చేసినట్టు జెపిసి చైర్మన్ సభలో వివరించారు. ఈ నివేదికను రాజ్యసభలో పెట్టే ముందు కమిటీ దేశవ్యాప్తంగా పర్యటించిందని తెలిపారు.
బిజెపి ఎంపీ మేధా విశ్రామ్ కులకర్ణి ఆరు నెలల సంప్రదింపుల తర్వాత వక్ఫ్ బిల్లుపై జెపిసి నివేదికను ప్రవేశపెట్టారు. వక్ఫ్‌పై ప్యానెల్‌కు ఇచ్చిన ఆధారాల రికార్డు కాపీని కూడా సభ ముందు ఉంచారు.
నివేదిక ప్రవేశపెట్టిన తర్వాత సభలో గందరగోళం మొదలైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందేశాన్ని చదివి వినిపించడానికి చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ ప్రయత్నించినప్పటికీ సభ్యులు శాంతించలేదు. "భారత రాష్ట్రపతిని అగౌరవపరచవద్దు" అని ధన్‌ఖర్ పదే పదే విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులను తమ స్థానాల్లో కూర్చొనేలా చెప్పాలని ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గేను కోరారు.
ఈ గందరగోళం మధ్యే సభ ఉదయం 11:20 గంటల వరకు వాయిదా పడింది. తిరిగి సమావేశమైన తర్వాత చైర్మన్ అధ్యక్షుడి సందేశాన్ని చదివి వినిపించారు. జనవరి 31న పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి తాను చేసిన ప్రసంగానికి రాజ్యసభ సభ్యుల కృతజ్ఞత సందేశం అందినట్టు చెప్పారు.
సభా ప్రక్రియను కొనసాగించేందు ధన్‌ఖర్ ప్రయత్నిస్తే ప్రతిపక్ష సభ్యులు తమ నిరసన మళ్లీ చేపట్టారు. కొంతమంది ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లారు. రాష్ట్రపతి సందేశాన్ని చదివి వినిపిస్తున్నప్పుడు సభా సంప్రదాయాలను పాటించలేదని సభా నాయకుడు జెపి నడ్డా ఆరోపించారు.
ఆ తర్వాత చైర్మన్ ధన్‌ఖర్ మాట్లాడుతూ నదిముల్ హక్, సమిరుల్ ఇస్లాం, ఎం మొహమ్మద్ అబ్దుల్లా గందరగోళం సృష్టించారని, సభకు అంతరాయం కలిగించారని అన్నారు.
Also Read: పార్లమెంటులోకి వచ్చిన కొత్త ఆదాయ పన్ను బిల్లు - కీలక మార్పులు ఇవే
కాంగ్రెస్ చీఫ్ ఖర్గే సభలో మాట్లాడుతూ వక్ఫ్ బిల్లుపై జెపిసి నివేదికలోని ప్రతిపక్ష ఎంపిల అసమ్మతి నోట్లను తొలగించారని అన్నారు."వక్ఫ్‌పై పార్లమెంటు సంయుక్త కమిటీకి అనేక మంది సభ్యులు తమ అసమ్మతి నోట్ ఇచ్చారు. మెజారిటీ సభ్యుల అభిప్రాయాలను మాత్రమే ఉంచడం ద్వారా నివేదికను బుల్డోజ్ చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇది ఖండించదగినది, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం" అని ఖర్గే అన్నారు.
జేపీసీ నివేదికను "నకిలీ" నివేదికగా పేర్కొన్న ఖర్గే దానిని ఉపసంహరించుకుని తిరిగి కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు. "ఎంపీలు వ్యక్తిగత కారణాల వల్ల కాదు, ఒక సమాజానికి జరుగుతున్న అన్యాయం కారణంగా నిరసన తెలుపుతున్నాం. ఇది ఏ వ్యక్తి గురించి కాదు. ఎంపిలు తమ స్వార్థం కోసం నిరసన తెలుపడం లేదు, అన్యాయం జరుగుతున్న సమాజం కోసం నిరసన తెలుపుతున్నారు" అని ఖర్గే అన్నారు.
ఈ వాదనలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రిజిజు తిరస్కరించారు. ప్రతిపక్ష సభ్యులు సభను తప్పుదారి పట్టించవద్దని కోరారు. "నివేదికలోని ఏ భాగాన్ని తొలగించడం లేదు. సభను తప్పుదారి పట్టించవద్దు. ప్రతిపక్ష సభ్యులు అనవసరమైన అంశాలను లేవనెత్తుతున్నారు. ఆ ఆరోపణ అబద్ధం" అని ఆయన అన్నారు.
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపక్షాలు సభను తప్పుదారి పట్టించాయని ఆరోపించారు. దీంతో మరోసారి సభలో తీవ్ర వాగ్వాదం జరిగింది. JPC నివేదికలో అన్ని ఉన్నాయని, ఏదీ తీసేయలేదని రిజిజు పునరుద్ఘాటించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ప్రతిపక్ష ఎంపీలు వాకౌట్ చేశారు. అనంతరం సభలో ప్రశ్నోత్తరాల సమయం కొనసాగింది.
Also Read: తాగుబోతు పైగా అప్పుల అప్పారావు - భార్య ఇచ్చిన షాక్‌తో ఒంటరైపోయాడు !
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

