New Income Tax Bill: 622 పేజీలు, 3.35 లక్షల పదాలతో కొత్త ఆదాయ పన్ను బిల్లు - మీరు కూడా ఈజీగా అర్ధం చేసుకోవచ్చు!
New Income Tax Bill Changes: ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, కొత్త ఆదాయ పన్ను బిల్లును గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సామాన్యులకు కూడా అర్ధమయ్యేలా ఇందులో మార్పులు చేశారు.

Changes In New Income Tax Bill 2025: ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, ఈ రోజు (గురువారం, 13 ఫిబ్రవరి 2025) లోక్‌సభలో కొత్త ఆదాయ పన్ను బిల్లు 2025ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ బిల్లు ఉద్దేశం ప్రస్తుత ఆదాయ పన్ను చట్టాన్ని సరళీకృతం చేయడం, తద్వారా సామాన్యుడు కూడా సులభంగా అర్థం చేసుకునేలా మార్చడం. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆదాయ పన్ను చట్టం 1961లో ఉన్న క్లిష్టమైన పదాలు ఉన్నాయి. వీటి స్థానంలో, కొత్త ఆదాయ పన్ను బిల్లు 2025లో ప్రజలు సులభంగా అర్ధం చేసుకునేలా పదాలను పొందుపరిచారు.
622 పేజీలలో కొత్త ఆదాయ పన్ను బిల్లు
కొత్త ఆదాయ బిల్లులో 30కి పైగా ఛాప్టర్లు, 500 పైగా సెక్షన్లు, 16 షెడ్యూళ్లు ఉన్నాయి, వీటిని కేవలం 622 పేజీలలో పొందుపరిచారు. కొత్త ఆదాయ పన్ను బిల్లు ఉద్దేశం కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టడం కాదు, కానీ ప్రస్తుత ఆదాయ పన్ను చట్టం 1961లోని భాషను సరళంగా మార్చడం. ఆరు దశాబ్దాల నాటి ప్రస్తుత చట్టంలో 23 ఛాప్టర్లు, 298 సెక్షన్లు, 14 షెడ్యూళ్లు ఉన్నాయి. ఈ చట్టంలో 880 పేజీలు, దాదాపు 9.80 లక్షల పదాలు ఉన్నాయి. దీనిని అర్ధం చేసుకోవడానికి ఎక్కువ శ్రమ, సమయం అవసరం. కొత్త ఆదాయ పన్ను బిల్లులో దాదాపు 3.35 లక్షల పదాలు మాత్రమే ఉన్నాయి. అంటే, పదాల సంఖ్య దాదాపు మూడో వంతుకు తగ్గింది. కొత్త ఆదాయ పన్ను చట్టం 01 ఏప్రిల్ 2026 నుంచి అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు.
కొత్త బిల్లులో చిన్న వాక్యాలు
కొత్త ఆదాయ పన్ను బిల్లులో పన్నుకు సంబంధించిన అనవసరమైన విభాగాలను తొలగించారు. కొత్త ఆదాయ పన్ను బిల్లులో సుదీర్ఘ వాక్యాలు, వివరణలు లేదా నిబంధనలు ఉండవు. చిన్న వాక్యాలను ఉపయోగించారు, వీటిని అర్థం చేసుకోవడం సులభం అవుతుంది. ఇంకా.. పట్టికలు & సూత్రాలను ఉపయోగించి మరింత సరళంగా మార్చారు. టీడీఎస్ (TDS), అంచనా పన్ను (Estimated tax), జీతం & మొండి బకాలయిలపై తగ్గింపులకు సంబంధించిన నిబంధనల కోసం పట్టికలు రూపొందించారు. పన్ను చెల్లింపుదారుల (Taxpayers) హక్కులు ఏమిటి, వారి బాధ్యతలు ఏమిటి అని వివరించే పన్ను చెల్లింపుదారుల చార్టర్‌ను కూడా కొత్త ఆదాయ పన్ను బిల్లులో చేర్చారు.
కొత్త బిల్లులో 'పన్ను సంవత్సరం' గురించి ప్రస్తావన
ఆదాయ పన్ను చట్టం 1961లో ఉపయోగించిన 'మునుపటి సంవత్సరం' (Previous Year) అనే పదాల స్థానంలో, కొత్త ప్రతిపాదిత చట్టంలో 'పన్ను సంవత్సరం' (Tax Year) పదాలను తీసుకొచ్చారు. అలాగే, పన్ను మదింపు సంవత్సరం (Tax Assessment Year) అనే భావన కూడా రద్దు చేశారు. ఉదాహరణకు, 2024-25 అసెస్‌మెంట్ ఇయర్‌లో 2023-24 ఆర్థిక సంవత్సరం ఆదాయంపై పన్ను చెల్లిస్తారని చెప్పుకుంటాం. ప్రతిపాదిత చట్టంలో ఈ పదాలకు ఆస్కారం లేదు, పన్ను సంవత్సరం అనే పదాలు మాత్రమే కనిపిస్తాయి & వినిపిస్తాయి.
గురువారం లోక్‌సభలో లోక్‌సభలో కొత్త ఆదాయ పన్ను బిల్లు 2025ను ప్రవేశపెట్టిన తర్వాత, తదుపరి చర్చల కోసం ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపుతారు.
మరో ఆసక్తికర కథనం: జనవరిలో 5 నెలల కనిష్ట స్థాయికి ద్రవ్యోల్బణం - ఫిబ్రవరిలో పరిస్థితి ఎలా ఉంటుంది?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

