Lovers Suicide: ప్రేమను పెద్దలు అంగీకరించరనే భయంతో ప్రేమ జంట ఆత్మహత్య, రైలు కింద పడి సూసైడ్
Karimnagar Crime News | డిగ్రీ కాలేజీ విద్యార్థిని, ఓ కంపెనీలో పనిచేసే యువకుడికి సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. పెద్దలు ప్రేమను ఒప్పుకోరనే భయంతో ఆత్మహత్య చేసుకున్నారు.

కరీంనగర్: ఈ రోజుల్లో ప్రతి విషయానికి కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. క్షణికావేశంలో వీళ్లు తీసుకుంటున్న నిర్ణయాలు ఆయా కుటుంబాలలో తీవ్ర విషాదం నింపుతున్నాయి. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనీ కొందరు, నచ్చిన బైక్ కొనివ్వలేదని, ఫోన్ కొనివ్వలేదనీ, ప్రేమలో విఫలమయ్యామని, ఆఖరికి తల్లిదండ్రులు మందలించారని సైతం సూసైడ్ చేసుకుంటున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లాలో ఇలాంటి ఘటన జరిగింది. తమ ప్రేమను పెద్దలు అంగీకరించరనే భయంతో యువతీ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.
అసలేం జరిగిందంటే..
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం ఎర్ర చింతలకు చెందిన గోలేటి శ్వేత కరీంనగర్‌లోని ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఇల్లందకుంట మండలం రాచపల్లి గ్రామానికి చెందిన ఎం రాహుల్ ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. సోషల్ మీడియాలో రాహుల్, శ్వేతకు కొన్ని నెలల కిందట పరిచయం ఏర్పడింది. చాటింగ్ ద్వారా వీరి పరిచయం ప్రేమగా మారింది. అయితే శ్వేత వయసు 20 ఏళ్లు కాగా, రాహుల్ దాదాపు రెండేళ్లు చిన్నవాడు. మరోవైపు శ్వేత డిగ్రీ స్టూడెంట్ కావడం, రాహుల్ టీనేజ్ లోనే చదువు మానేసి, కంపెనీలో పని చేయడం మొదలుపెట్టాడు.
తమ ప్రేమ విషయం పెద్దలకు తెలిస్తే అంగీకరించరేమోనని ఆందోళనకు గురయ్యారు. కలిసి జీవించే అవకాశం లేదని, కలిసి చనిపోదామని భావించి.. ఈ కారణాలతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ రైల్వే స్టేషన్ సమీపంలోని పాపయ్య పల్లె గేటు వద్ద శనివారం రాత్రి రాహుల్ శ్వేత గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీరి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని రైల్వే పోలీసులు తెలిపారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

