IPL 2025 Captains Meeting: 20న ఐపీఎల్ జట్ల కెప్టెన్లతో బోర్డు సమావేశం.. వివిధ కార్యక్రమాలతో ఫుల్లు జోష్.. 22 నుంచి మెగాటోర్నీ ప్రారంభం
ఈనెల 20న అన్ని జట్ల కెప్టెన్లతో సమావేశాన్ని బీసీసీఐ ఏర్పాటు చేయనుంది. ఈ సమావేశం బోర్డు హెడ్ క్వార్టర్ అయిన ముంబైలో జరుగుతుంది. క్రికెట్ సెంటర్లో నాలుగు గంటలపాటు ఈ కార్యక్రమం జరుగుతుంది.

IPL 2025 Latest Updates: ఐపీఎల్ వారంలోకి వచ్చేశాం. ఈనెల 22 నుంచి మెగాటోర్నీ ప్రారంభం కాబోతోంది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ తో ఐపీఎల్ 2025 అధికారికంగా ప్రారంభం కాబోతోంది. అయితే అంతకన్నా ముందే ఈనెల 20న అన్ని జట్ల కెప్టెన్లతో సమావేశాన్ని బీసీసీఐ ఏర్పాటు చేయనుంది. ఈ సమావేశం బోర్డు హెడ్ క్వార్టర్ అయిన ముంబైలో జరుగుతుంది. క్రికెట్ సెంటర్లో నాలుగు గంటలపాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. తొలి గంటలో ఈ సీజన్ లోని మార్పులు గురించి, ఆ తర్వాత స్పాన్సర్లకు సంబంధించిన కార్యక్రమాలు, ఆ తర్వాత కెప్టెన్లతో ఫొటో షూట్ నిర్వహించనున్నారు. ఇక ఈ టోర్నీలో ఇప్పటికే అన్ని జట్ల కెప్టెన్ల ప్రకటన కూడా పూర్తయ్యింది. చెన్న సూపర్ కింగ్స్ ( కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (రజత్ పాటిదార్), సన్ రైజర్స్ హైదరాబాద్ (పాట్ కమిన్స్), ముంబై ఇండియన్స్ (హార్దిక్ పాండ్యా), గుజరాత్ టైటాన్స్ (శుభమాన్ గిల్), కోల్ కతా నైట్ రైడర్స్ (అజింక్య రహానే), లక్నో సూపర్ జెయింట్స్ (రిషభ్ పంత్), ఢిల్లీ క్యాపిటల్స్ (అక్షర్ పటేల్), రాజస్థాన్ రాయల్స్ (సంజూ శాంసన్), పంజాబ్ కింగ్స్ (కెప్టెన్ శ్రేయస్ అయ్యర్) ఐపీఎల్ 2025లో పాల్గొంటున్నాయి.
12 డబుల్ హెడర్లు..
ఐపీఎల్ షెడ్యూల్ గతంలోనే ప్రకటించారు. ఈసారి 74 మ్యాచ్ లను ఆడనున్నారు. అందులో 12 డబుల్ హెడర్లు అంటే ఒకేరోజు రెండు మ్యాచ్ లు ఉండనున్నాయి. తొలి డబుల్ హెడర్ ఆదివారం జరుగుతుంది. తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్, రాజస్థాన్ మధ్య మ.3.30 గం.లకు మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత సా.7.30 గం.లకు చెన్నైతో ముంబై తలపడనుంది. ఆ తర్వాత వైజాగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో లక్నో సూపర్ జెయింట్స్ , మార్చి 25న అహ్మదాబాద్ లో గుజరాత్ తో పంజాబ్ ఆడనుంది.
నాకౌట్ మ్యాచ్ లు హైదరాబాద్ లో..
లీగ్ దశ ముగిశాక, ఫైనల్ కి వెళ్లే జట్లను నిర్ణయించే క్వాలిఫయర్-1, ఎలిమినేటర్ మ్యాచ్ లను ఈసారి హైదరాబాద్ లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ మైదానంలో నిర్వహిస్తున్నారు. మే20న క్వాలిఫయర్-1, తర్వాతిరోజు ఎలిమినేటర్ మ్యాచ్ లను నిర్వహిస్తారు. 23న కోల్ కతాలో క్వాలిఫయర్ -2ను నిర్వహిస్తారు. మే25న కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఫైనల్ మ్యాచ్ నిర్వహించున్నారు. చెన్నై, ముంబై చెరో ఐదు ట్రోఫీలతో లీగ్ లో అత్యంత విజయవంతమైన జట్లుగా నిలిచాయి. గతేడాది కప్పును కోల్ కతా నైట్ రైడర్స్ గెలుపొందింది. ఫైనల్లో సన్ రైజర్స్ ను ఓడించి మూడోసారి టైటిల్ ను కైవసం చేసుకుంది. ఇక 2016లో చివరిసారి కప్పు గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్.. 2018, 2024లో రెండుసార్లు తుదిమెట్టుపై బోల్తా పడింది. దీంతో ఈసారి ఎలాగైనా కప్పు సాధించాలని పట్టుదలగా ఉంది. ఈసారి బ్యాటింగ్ ను మరింత బలంగా మార్చడంతోపాటు, బౌలింగ్ నూ పటిష్ట పరిచింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

