Tirumala Sevas: తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు - ఈ సేవలో పాల్గొంటే మీ జన్మ ధన్యమే!
12 Sevas in Tirumala: తిరుమల శ్రీ వేంకటేశ్వరుడిని సేవా టికెట్లు విడుదలైన క్షణంలో భక్తులు పోటీపడి బుక్ చేసేసుకుంటారు. మరి మీరు వెళ్లే సేవ గురించి మీకు తెలుసా..

Best Seva at Thirumala for Having a Darshan: తిరుమల శ్రీవారి దర్శనం కోసం తపించని భక్తులుండరు. బంగారువాకిలి నుంచి స్వామిని చూసిన క్షణం..ఇక చాలు ఈ జన్మకు అనే భావనతో బయటకు వస్తారు. కానీ మళ్లీ మళ్లీ అలాంటి దర్శనం కోసం తపించిపోతారు. ఇందులో భాగంగా స్వామివారి సేవల్లో పాల్గొంటే ఇంకొంచెం సేపు శ్రీవారిని చూసి తరించవచ్చనే ఉద్దేశంతో సేవా టికెట్లు బుక్ చేసుకుంటారు.
తిరుమల శ్రీవారికి మొత్తం 12 సేవలు ఉంటాయి. వాటిలో ఏం సేవలో ఏం చేస్తారు?
ఏ సేవా టికెట్లు ఈజీగా దొరుకుతాయి?
ఏ సేవకు వెళ్లే అవకాశం దొరికితే అదృష్టం?
సుప్రభాత సేవ
సుప్రభాత సేవ తెల్లవారుజామున జరుగుతుంది. బంగారువాకిలిలో ఉన్న జయ విజయుల దగ్గర భక్తులు నిల్చుంటారు. సన్నిధి గొల్ల వంశానికి చెందినవారికి మొదటి దర్శనం జరుగుతుంది. ఆ తర్వాత అన్నమాచార్యుల వంశీయులు..అర్చక స్వాములు.. ఆ తర్వాత భక్తులు స్వామిని దర్శించుకుంటారు
తోమాల సేవ
తోళ్ మాల అంటే భుజాలపైనుంచి కిందకు వచ్చే మాల అని అర్థం. మూలవిరాట్ కి తులసిమాలలు, పూలమాలలతో అలంకరించే సేవ. తిరుమలలో ఉండే జీయర స్వామి పర్యవేక్షణలో మాలలు అమర్చుతారు. వారంలో మూడు రోజులు మాత్రమే ఈసేవకు భక్తులను అనుమతిస్తారు
అర్చన సేవ
అర్చన సేవ దొరికిందంటే అంతకన్నా అదృష్టం మరొకరికి ఉండదు. అరగంట పాటూ వేంకటేశ్వరుడికి సహస్రనామాలతో షోడసోపచార పూజ చేస్తారు. ఈ అరగంట భక్తులను కూర్చోబెడతారు. గోత్రనామాలు చెబుతారు. ముందుగా వెళితే గుమ్మం మొదట్లో కూర్చోవచ్చు.
సహస్ర కలశాభిషేకం
మూలవిరాట్ పాదాల దగ్గర జీవ స్థానం ఉంటుంది. అక్కడ ఉండే వెండి మూర్తిని భోగశ్రీనివాసుడు అంటారు. భోగశ్రీనివాసుడి పాదానికి తాడు కట్టి దాన్ని స్వామివారి కటిహస్తానికి కట్టేస్తారు. సహస్రకలశాభిషకం చేసేటప్పుడు పంచసూక్తాలు చదువుతూ భోగ శ్రీనివాసుడికి అభిషేకం చేస్తారు. ఆఖర్లో బంగారు బిందె తీసుకెళ్లి ఆనందనిలయం చుట్టూ ప్రదక్షిణ చేసి మూలవిరాట్ కి అభిషేకం చేస్తారు
పూలంగి సేవ
గురువారం రోజు జరిగే సేవ ఇది. స్వామిని మొత్తం పూలతోనే అలంకరిస్తారు. కొండపై పూసే ప్రతి పూవూ స్వామివారికే
అభిషేక సేవ
అర్చన తర్వాత అభిషేక సేవ అత్యంత విశిష్టమైనది. నిజమైన మూలవిరాట్ ని దర్శించుకునే అవకాశం ఈ సేవకు వెళ్లే భక్తులకు లభిస్తుంది. స్వామి హృదయంపై ఉన్న లక్ష్మీదేవిని చూడొచ్చు. పునుగుపిల్లి నూనె తీసుకొచ్చి స్వామికి రాస్తారు.
నిజపాద దర్శనం
అభిషేకం పూర్తైన తర్వాత స్వామివారి పాదాలకు ఉండే కవచాన్ని తీసేసి..నిజమైన పాదాలు దర్శించుకునేలా చేస్తారు.
వస్త్రాలంకరణ సేవ
తిరుమలలో అత్యంత ఖరీదైన సేవ ఇది. భక్తులు సమర్పించే పొడవాటి వస్త్రాన్ని స్వామికి సమర్పిస్తారు.
అష్టదళ పాద పద్మారాధన సేవ
108 బంగారు పుష్పాలతో స్వామివారికి అష్టోత్తరం చేస్తారు. ఈ బంగారు పూలు ఇచ్చింది ఓ ముస్లిం
తిరుప్పావడ సేవ
గురువారం స్వామి నామాన్ని సడలిస్తారు..ఈ సమయంలో కళ్ల తీవ్రత తగ్గించేందుకు స్వామి చూపు పడే దగ్గర వెండి మంచంపై భారీ నైవేద్యాలు సమర్పిస్తారు. దీన్నే తిరుప్పావడ అంటారు. ఈ సేవకు వెళ్లిన వారు స్వామివారి విగ్రహంపైనే దృష్టి నిలిపి గమనిస్తే కళ్ల కదలికను గమనించవచ్చు... ( రాతి విగ్రహం కాదు స్వామి స్వయంగా అక్కడ నిల్చున్నారని చెప్పేందుకు ఇదే ఉదాహరణ)
ఊంజల్ సేవ
ఉయ్యాలలో చేసే సేవ ఇది. ఈ సేవ మిగిలిన సేవలకన్నా తేలిగ్గానే దొరుకుతుంది. అద్దాల మండపంలో ఉత్సవమూర్తులకు జరిగే ఉయ్యాల సేవ చూస్తే విశ్వం విష్ణుః అని మీకు అర్థమవుతుంది
కళ్యాణ సేవ
ఈ సేవలో పాల్గొన్న భక్తులు అందరితో గోత్రనామాలు చెప్పింది స్వామి అమ్మవార్లకు కళ్యాణం జరిపిస్తారు.
సహస్రదీపాలంకరణ సేవ
టికెట్ లేకపోయినా చూడగలిగే సేవ ఏదంటే సహస్రదీపాలంకరణ సేవ. స్వామి ఎదురుగా ఉన్న మండపంలో సహస్ర దీపాలు వెలిగించి అన్నమాచార్య కీర్తలను ఆలపిస్తారు
గమనిక: పండితులు చెప్పిన వివరాలు, కొన్ని పుస్తకాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రాసిన కథనం ఇది.
ఉగాది 2025: శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మీ రాశి ఫలితం తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

