Hyderabad Water Supply: హైదరాబాద్ ప్రజలకు అలర్ట్.. ఈ 27, 28న పలు ఏరియాలకు నీళ్లు బంద్
Hyderabad News | ప్రధాన పైప్‌లైన్ మరమ్మతు పనుల కారణంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో డిసెంబర్ 27 ఉదయం నుండి 36 గంటల పాటు నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది.

Water Cut in Hyderabad | హైదరాబాద్: తాగునీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని నగరవాసులకు అధికారులు సూచించారు. ప్రధాన పైప్‌లైన్‌లకు చేపట్టిన మరమ్మతు పనుల కారణంగా డిసెంబర్ 27 (శనివారం) ఉదయం 6 గంటల నుండి డిసెంబర్ 28వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్ (HMWSSB) తెలిపింది. సుమారు 36 గంటల పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదు.
కారణం ఇదే..
హైదరాబాద్ నగరానికి నీటిని సరఫరా చేసే కృష్ణా ఫేజ్-1 సర్జ్ ట్యాంక్ వద్ద ఉన్న 700 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన ఎంఎస్ పైప్‌లైన్ లీకేజీని అరికట్టేందుకు సంబంధిత అధికారులు మరమ్మతులు చేపట్టనున్నారు. కనుక నగరవాసులు జాగ్రత్తగా నీటిని వాడుకోవాలని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలిని కొన్ని ఏరియాల ప్రజలకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై బోర్డ్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
నీటిసరఫరా నిలిచిపోయే ప్రాంతాలివే..
పైప్‌లైన్ రిపేర్ పనుల కారణంగా నీటి సరఫరా నిలిచిపోయే ప్రాంతాలు మీర్ ఆలం, కిషన్ బాగ్, బాల్‌శెట్టి ఖేత్, మొఘల్‌పురా, జహానుమా, ఫలక్‌నుమా, బహదూర్‌పురా, మెహబూబ్ మాన్షన్, సంతోష్ నగర్, సైదాబాద్, చంచల్‌గూడ, వినయ్ నగర్, అస్మాన్‌గఢ్, యాకుత్‌పురా, బోగులకుంట, నారాయణగూడ, అడిక్‌మెట్ రిజర్వాయర్, శివం రిజర్వాయర్, చిలకలగూడ రిజర్వాయర్, అలీబాద్ రిజర్వాయర్, రియాసత్ నగర్ ట్యాంక్ పరిధిలోని ప్రాంతాలో డిసెంబర్ 27న ఉదయం 6 నుంచి 28న సాయంత్రం 6 గంటల వరకు నీటి సరఫరా నిలిచిపోనుంది.
ఈ ఏరియాలతో పాటు దిల్‌సుఖ్ నగర్ లోని కొన్ని ప్రాంతాలు, హార్డ్‌వేర్ పార్క్, జల్పల్లి, తుక్కుగూడ, ఫ్యాబ్ సిటీ, మన్నెగూడ వంటి ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని అధికారులు ఆ ప్రాంతాల వారిని అప్రమత్తం చేశారు. నీటి కొరత ప్రభావిత ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని అత్యంత పొదుపుగా వాడుకోవాలని జలమండలి అధికారులు విజ్ఞప్తి చేశారు.
జలమండలి హెల్ప్ లైన్ నెంబర్
నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ఉండేవారు లేదా అపార్ట్‌మెంట్లలో ఉంటున్నవారు HMWSSB మొబైల్ యాప్ ద్వారా లేదా వారి అధికారిక వెబ్‌సైట్ ద్వారా పెయిడ్ వాటర్ ట్యాంకర్ల (Paid Water Tankers) కోసం ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. అయితే, నీటి సరఫరా నిలిపివేత సమయంలో ట్యాంకర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కనుక సాధ్యమైనంత వరకు ముందే నీటిని నిల్వ చేసుకోవడం మంచిది. ఏవైనా అత్యవసర సమాచారం లేక ఫిర్యాదుల కోసం జలమండలి కస్టమర్ కేర్ నంబర్ 155313 కు కాల్ చేయవచ్చు. ఈ నంబర్‌తో పాటు 040 23300114 లేదా 66993000 నంబర్లకు కూడా కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.






















