CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Palamuru Rangareddy Lift Irrigation Project | తెలంగాణ ప్రయోజనాలే తన ఊపిరి అని, రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన ప్రతి చుక్క నీటి కోసం పోరాటం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.

Telangana Assembly Sessions | హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నీటి లభ్యత, వినియోగంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూరాల ప్రాజెక్టు నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున, మొత్తం 70 టీఎంసీల వరద జలాలను మళ్లించి, సాగునీటిని అందించేందుకు పాలమూరు ప్రాజెక్టు నిర్మించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం సర్వే నిర్వహించి, సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) సిద్ధం చేసే బాధ్యతను ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ESCI) కి అప్పగిస్తూ నాటి ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇది పాలమూరు జిల్లా ప్రజల చిరకాల స్వప్నానికి నాంది పలికింది.
తెలంగాణ అసెంబ్లీలో నీళ్లు- నిజాలు అంశంపై జరిగిన చర్చలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ ఉమ్మడి రాష్ట్రంలోనే అంకురార్పణ జరిగిన ఈ ప్రాజెక్టు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక కీలక మార్పులకు లోనైంది. నిపుణుల మద్దతు, ఉద్యమకారుల ఆకాంక్ష నాడు తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరంకు చెందిన నిపుణులు కూడా జూరాల నుంచే ఈ ప్రాజెక్టును నిర్మించాలని బలంగా సూచించారు. జూరాల వద్ద నీటి లభ్యత, భౌగోళిక పరిస్థితులను బేరీజు వేసిన నిపుణులు, అక్కడి నుంచే నీటిని ఎత్తిపోయడం వల్ల తక్కువ వ్యయంతో ఎక్కువ ప్రయోజనం ఉంటుందని’ అభిప్రాయపడ్డారు.
శ్రీశైలానికి నీటి లభ్యత మార్పు అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొద్ది కాలానికే ఈ ప్రాజెక్టు గమ్యం, గమనం మారింది. ప్రాజెక్టు మంజూరైన కేవలం 26 రోజుల వ్యవధిలోనే, ముఖ్యమంత్రి కేసీఆర్ తన వ్యూహానికి అనుగుణంగా ప్రాజెక్టు సోర్స్‌ను మార్చాలని ఆదేశించారు. జూరాల నుండి కాకుండా, శ్రీశైలం బ్యాక్ వాటర్ (నార్లాపూర్) నుంచి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నీటిని తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
జూరాల నుంచి శ్రీశైలంకు సోర్స్ మార్చడం వల్ల ప్రాజెక్టు పరిధి పెరిగినప్పటికీ, దీనివల్ల పర్యావరణ అనుమతుల్లో జాప్యం జరిగింది. ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగింది. ఏది ఏమైనప్పటికీ, పాలమూరు ఎడారిగా మారకూడదన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. చచ్చినా తెలంగాణ కోసం చస్తాం.. బ్రతికినా తెలంగాణ కోసం బ్రతుకుతాం.. ప్రాణమున్నంత వరకు ఈ గడ్డ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తాం అని’ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ ప్రయోజనాలే నా ఊపిరి: సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన
తెలంగాణ రాష్ట్ర నీటి హక్కులు, అభివృద్ధి మరియు ప్రజల ఆశయాల పరిరక్షణ విషయంలో తన ప్రభుత్వం వెనకడుగు వేయబోదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణకు రావాల్సిన ప్రతి చుక్క నీటి కోసం, మన హక్కుల కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతాం అని ముఖ్యమంత్రి ప్రకటించారు. కృష్ణా, గోదావరి జలాల పంపిణీలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకుంటామని, ఇందులో రాజకీయాలకు తావులేకుండా ప్రభుత్వం ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్తుందని ఆయన హామీ ఇచ్చారు.
తెలంగాణ ప్రజలకు మేలు చేయడమే తన ఏకైక లక్ష్యమని, దేవుడిపై ఆనగా తాను ఉన్నంత కాలం తెలంగాణ హక్కులకు భంగం కలగనివ్వనని సభ సాక్షిగా ప్రతిజ్ఞ చేశారు. అభివృద్ధిలో ఏకాభిప్రాయం రాష్ట్ర అభివృద్ధి విషయంలో పాలక, ప్రతిపక్షాలు కలిసి రావాలని, ప్రజల ప్రయోజనాలే పరమావధిగా పనిచేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మాటల గారడీలకు కాకుండా, వాస్తవాలకు లోబడి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటమే తమ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.






















