2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
ఇండియా-పాక్ మ్యాచ్ అంటే చాలు ఫ్యాన్స్ అంతా టీవీలకు అతుక్కుపోతారు. గ్రౌండ్‌లో రెండు టీమ్స్ మధ్య జరిగే మ్యాచ్ కూడా యుద్దంలా జరుగుతుంది. సోషల్ మీడియాలో అయితే మహా సంగ్రామమే జరుగుతుంది. భారత్‌పై పాక్ ఉగ్రదాడుల నేపథ్యంలో చాలా కాలం నుంచి రెండు దేశాలు బైలాటరల్ సిరీస్‌లు ఆడకుండా కేవలం ఐసీసీ టోర్నీల్లోనే తలపడుతున్నాయి. కొత్త ఏడాదిలోనూ భారత్, పాకిస్థాన్ చాలా మ్యాచ్‌ల్లో ఎదురుపడనున్నాయి. అండర్ 19 ప్రపంచకప్‌తో పాటు పురుషుల, మహిళల టీ20 ప్రపంచకప్‌లు దాయాదీ మ్యాచ్‌లకు వేదిక కానున్నాయి.
ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా శ్రీలంక, కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా ఫిబ్రవరి 15 భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. రెండు జట్లు టోర్నీ అద్భుతంగా ఆడితే.. సెమీఫైనల్, ఫైనల్లో కూడ తలపడే ఛాన్స్ ఉంది. అంతకుముందే జనవరి 15 నుంచి ప్రారంభమయ్యే అండర్ 19 ఐసీసీ పురుషుల ప్రపంచకప్‌లోనూ భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. కానీ ఇంతకుముందులా రెండు టీమ్స్ ఒకే గ్రూప్‌లో కాకుండా.. వేరు వేరు గ్రూపుల్లో ఉండటంతో ఈ రెండు టీమ్స్ మధ్య లీగ్ దశలో మ్యాచ్‌లు లేవు. వేరే వేరే టీమ్స్ గ్రూపుల్లో ఉండటంతో సూపర్-6లో కూడా తలపడే ఛాన్స్ లేదు. అయితే మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జూన్ 14న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. రెండు టీమ్స్ బాగా ఆడితే ఆ టోర్నీలో కూడా సెమీఫైనల్, ఫైనల్లో తలపడొచ్చు.





















