GATE-2025 ఫలితాల్లో తెలుగు సత్తా, ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఏపీ విద్యార్థి
GATE Toppers: దేశంలోని ఐఐటీలు సహా పలు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన గేట్ 2025 ఫలితాల్లో టాప్ ర్యాంకుతో తెలుగు విద్యార్థి సత్తా చాటాడు.

GATE 2025 Toppers: దేశవ్యాప్తంగా ఉన్న 7 ఐఐటీలతో పాటు బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్ ఆఫ్ సైన్స్, ఇతర ప్రభుత్వరంగ విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ, ఇతర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్దేశించిన గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE)-2025 పరీక్ష ఫలితాలు మార్చి 19 విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆమంచర్లకు చెందిన సాదినేని నిఖిల్ జాతీయస్థాయిలో టాపర్‌గా నిలిచాడు. డేటా సైన్స్, ఏఐ టెస్ట్ పేపర్‌లో 100కు పైగానూ 96.33 మార్కులతో నిఖిల్ ఈ ఘనత సాధించారు. గతంలో నీట్ పరీక్షలోనూ 57వ ర్యాంకు సాధించిన అతను ప్రస్తుతం నోయిడాలో ఎక్స్‌పర్ట్‌డాక్స్ అనే సంస్థలో పని చేస్తున్నారు. AIలో ఎంటెక్ చేయాలన్న తన కల సాకారం చేసుకునే లక్ష్యంతోనే కష్టపడి చదివినట్లు నిఖిల్ వివరించారు.
జాబ్ చేస్తూనే చదువు..
గేట్ 2025 ఫలితాల్లో టాపర్‌గా నిలిచిన నిఖిల్ చౌదరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)లో ఎంటెక్ చేయాలన్న గొప్ప ఆశయంతో ప్రిపేరేషన్ కొనసాగించాడు. ఈ ప్రయాణంలో ఉద్యోగాన్ని, తన వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాడు. ఆఫీస్ పని పూర్తయ్యాక రోజూ నాలుగైదు గంటలు చదివేవాడు. ఇక సెలవు రోజుల్లో అయితే 7-8 గంటలు కష్టపడి గేట్ పరీక్ష కోసం ప్రణాళికాబద్ధంగా ప్రిపరేషన్ కొనసాగించారు. గేట్‌లో అద్భుత విజయంతో ఏదైనా ప్రతిష్ఠాత్మక ఐఐటీలో ఎంటెక్ చేయాలన్న తన కలను సాకారం చేసుకున్నారు.
అప్పుడు నీట్‌లో.. ఇప్పుడు గేట్‌లో..
చిన్నప్పట్నుంచే చదువుల్లో ముందుండే సాదినేని నిఖిల్ టెన్త్, ఇంటర్ విద్యను హైదరాబాద్‌లో పూర్తిచేశాడు. పదోతరగతిలో 9.8 సీజీపీఏ, ఇంటర్‌లో 98.6 శాతం మార్కులతో మెరిశాడు. 2017లో నీట్ పరీక్షలో 57వ ర్యాంకుతో రాణించారు. ఎయిమ్స్ ఎంట్రన్స్ పరీక్షలో 22వ ర్యాంకు సాధించి సత్తా చాటాడు. ప్రతిష్ఠాత్మక ఢిల్లీ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ అభ్యసించిన ఆయన.. 2024లో ఐఐటీ మద్రాస్ నుంచి డేటా సైన్స్‌లో ఆన్‌లైన్‌లో డిగ్రీ సైతం పూర్తి చేశాడు. నిఖిల్ చౌదరి తండ్రి సాదినేని శ్రీనివాసులు కందుకూరులోని ప్రకాశం ఇంజినీరింగ్ కళాశాలలో పనిచేస్తుండగా.. తల్లి బిందు మాధవి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తుంది.
ఐఐటీ రూర్కీ ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహించింది. ఫిబ్రవరి 27వ తేదీన ప్రిలిమినరీ ఆన్సర్ కీని విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి ఫిబ్రవరి 27 నుంచి మార్చి 1వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించింది. ఈ పరీక్షలకు 80 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 80 శాతం అభ్యర్థులు హాజరయ్యారు. తాజాగా ఫలితాలతో పాటు తుది కీని కూడా విడుదల చేసింది.
గేట్ స్కోరు ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న 7 ఐఐటీల(బొంబయి, ఢిల్లీ, గువాహటి, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, రూర్కీ)తో పాటు బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్ ఆఫ్ సైన్స్, ఇతర ప్రభుత్వరంగ విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇతర ప్రైవేట్ యూనివర్సిటీలు, విద్యాసంస్థలు కూడా గేట్ స్కోరునే ప్రవేశాలకు ప్రామాణికంగా తీసుకుంటాయి. కొన్ని ప్రభుత్వ సంస్థలు గేట్ స్కోరు ద్వారా ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తున్నాయి. గేట్ ద్వారా ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలతో పాటు డాక్టోరల్ పోగ్రామ్స్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. విద్యార్థులు గేట్ పరీక్షలో సాధించిన స్కోరు ఫలితాల వెల్లడి నుంచి 3 సంవత్సరాల పాటు వర్తిస్తుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

