Nara Lokesh: ఏపీలో మరిన్ని విదేశీ యూనివర్సిటీల క్యాంపస్‌లు ఏర్పాటు: నారా లోకేష్
Foreign universities in Andhra Pradesh | ఏపీలో విదేశీ యూనివర్సిటీల క్యాంపస్ లు ఏర్పాటు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో విదేశీ యూనివర్సిటీల క్యాంపస్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. కూటమి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ఏపీ ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన, క్రమబద్ధీకరణ చట్ట సవరణ బిల్లును మంగళవారం నాడు మంత్రి నారా లోకేష్ శాసనసభలో ప్రవేశపెట్టారు. అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం 2016లోనే ప్రైవేటు యూనివర్సిటీల చట్టం తీసుకొచ్చింది. అయితే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్న యోచనతో ప్రైవేటు యూనివర్సిటీల స్థాపనకు మేం గతంలోనే నిర్ణయం తీసుకున్నాం.
ఏపీలో ఫారిన్ యూనివర్సిటీ క్యాంపస్‌ల ఏర్పాటు కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది. గతంలో విశాఖపట్నంలో సెంచూరియన్ యూనివర్సిటీ ఏర్పాటైంది. ప్రైవేటు యూనివర్సిటీల సంస్థాగత మార్పులు తెచ్చేందుకు తాజాగా సవరణ బిల్లును తీసుకువచ్చాం. ప్రముఖ బిట్స్ పిలానీ సంస్థకు రాజధాని అమరావతిలో 70 ఎకరాలు కేటాయించాం. మరోవైపు టాటా లాంటి సంస్థలు ఏపీకి వస్తున్నాయి. మరికొన్ని సంస్థలు ఏపీకి రావడానికి ఆసక్తి చూపుతున్నాయి.
డీప్ టెక్ యూనివర్సిటీ ఏపీలో ఏర్పాటు చేయాలన్నది చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ లక్ష్యం. విశాఖపట్నంలో ఏఐ (AI), స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాల్సి ఉంది. విద్యా వ్యవస్థలో ఏపీని దేశంలో నెంబర్ వన్ గా నిలిపేందుకు ప్రపంచంలోని అత్యుత్తమ యూనివర్సిటీలు రాష్ట్రంలో క్యాంపస్‌లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని’ మంత్రి నారా లోకేష్ అన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

