CM Chandrababu: తిరుమలలో సీఎం చంద్రబాబు పర్యటన, వైసీపీ నేత భూమన అభినయ్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
Chandrababu Tirumala Tour | ఏపీ సీఎం చంద్రబాబు తిరుమల పర్యటనలో ఏ అవాంతరాలు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. వైసీపీ నేత భూమన అభినయ్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

Bhuman Abhinay Reddy house arrest | తిరుపతి: తిరుపతి నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి (Bhumana Abhinay Reddy)ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తిరుపతి పద్మావతి పురంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద అభినయ్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. విషయం తెలియడంతో వైసీపీ శ్రేణులు భారీ సంఖ్యలో అభినయ్ రెడ్డి నివాసానికి చేరుకుంటున్నారు. పద్మావతీ పురంలోని భూమన నివాసం వద్దకు వైసీపీ నేతలు, కార్యకర్తలు చేరుకుని అభినయ్ రెడ్డికి మద్దతు తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు (Chandrabbu) తిరుమల పర్యటన నేపథ్యంలో వైసీపీ ఇంఛార్జ్ భూమన అభినయ్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు.
హామీల అమలుపై ప్రశ్నిస్తే అరెస్టులా..
చంద్రబాబు నాయుడు తిరుపతి పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ నేత భూమన అభినయ్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఎన్నికల హామీలను నెరవేర్చాలని అడిగే ప్రయత్నం చేస్తున్న ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడం సబబు కాదని వైసీపీ నేతలు అంటున్నారు. చంద్రబాబు చెప్పిన సూపర్ సిక్స్ అమలు చేయాలని కోరితే అరెస్ట్ చేయడం దారుణం. మహిళలకు ఉచిత బస్సు ఇవ్వాలని అడిగితే వారిని కూడా అరెస్టు చేస్తారా అని భూమన మండిపడ్డారు. ఏపీ వార్షిక బడ్జెట్ 2025లో సూపర్ సిక్స్ (Super Six) కు నిధులు కేటాయించకపోవడం ప్రజల్ని మోసం చేయడమే అన్నారు. సీఎం చంద్రబాబుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాంతియుతంగా వినతిపత్రం అందచేయాలని చూస్తుంటే అభినయ్ రెడ్డిని హౌస్ అరెస్టు చేశారని తెలిపారు.
తిరుమలకు చేరుకున్న చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, కుమారుడు మంత్రి నారా లోకేశ్‌తో కలిసి గురువారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. రాత్రి 11.30 గంటలకు తిరుమలలోని శ్రీపద్మావతి గెస్ట్ హౌస్‌కు చంద్రబాబు చేరుకున్నారు. గెస్ట్ హౌస్ వద్ద సీఎం చంద్రబాబుకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్యచౌదరిలు పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు. అంతకుముందు తిరుపతి ఎయిర్‌పోర్టులో ముఖ్యమంత్రి చంద్రబాబుకి ప్రజాప్రతినిధులు, నేతలు, అధికారులు స్వాగతం పలికారు. సీఎం సతీమణి నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి, దేవాన్ష్‌లు గురువారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. నేడు (మార్చి 21న) లోకేష్, బ్రాహ్మణిల ఏకైక కుమారుడు దేవాన్ష్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా చంద్రబాబు కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకోనుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

