Pawan Kalyan: చంద్రబాబు వరుసగా మూడు సార్లు సీఎం కావాలి - ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలి - పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
NDA: చంద్రబాబు వరుసగా మూడు సార్లు సీఎం కావాలని పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నారు.

Chandrababu CM for three consecutive terms: ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ఆయన వరుసగా మూడు సార్లు సీఎం అవ్వాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమాలు విజయవాడలోని ఎ కన్వెన్షన్‌లో జరిగాయి. ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థుతుల్లో చంద్రబాబు వరుసగా మూడు సార్లు సీఎంగా ఉంటేనే రాష్ట్రం గాడిన పడుతుందన్నారు. ప్రధాని మోదీ వరుసగా మూడు సార్లు ప్రధాని అయ్యారని అలాగే చంద్రబాబు కావాలన్నారు. తాను ఆయన నేతృత్వంలో పని చేయడానికి ఎప్పుడూ సిద్దమని స్పష్టం చేశారు.
వచ్చే ఏడాది తాను పార్టిసిపేట్ చేస్తానన్న పవన్
చంద్రబాబు ఈ రోజు నవ్వినంతగా గతంలో నవ్వడం తాను చూడలేదన్నారు. ఎమ్మెల్యేలు అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారన్నారు. రాష్ట్ర ప్రజల బాధ్యత మోస్తున్న చంద్రబాబు.. ఎప్పుడూ గంభీరంగా ఉంటారని.. ఇలా నవ్వే పరిస్థితి ఉండదని.. అంత ఒత్తిడి ఉంటుందన్నారు. అయినా చంద్రబాబును మనస్ఫూర్తిగా నవ్వించేలా చేశారని పవన్ కల్యాణ్ ప్రదర్శన ఇచ్చిన వారిని, స్కిట్లు ప్రదర్శించిన వారిని అభినందించారు. తాను కూడా ఎన్నో జ్ఞాపకాలతో వెళ్తున్నానని.. వచ్చే కొన్ని రోజుల పాటు తనకు ఇవి గుర్తుంటాయన్నారు. రాజకీయాలు అంటే ప్రజాసమస్యల పోరాటమే కాదని..వ్యక్తిగత కక్షలు కావని ఇలాంటి కార్యక్రమాల ద్వారా అనుబంధం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాలు చూసిన తర్వాత తనకూ పార్టిసిపేట్ చేయాలని అనిపించిందని వచ్చే ఏడాది ప్రయత్నం చేస్తానన్నారు.
ప్రజాసమస్యల వరకే ప్రతిపక్షం, అధికారపక్షం : చంద్రబాబు
తన రాజకీయ జీవితంలో చాలా ఈవెంట్స్ చూశాను కానీ ఇక్కడ చూసిన ప్రదర్శన అంత గొప్పగా ఎక్కడా లేదన్నారు. అందరూ అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారని అభినందించారు. రాజకీయాలు అంటే వ్యక్తిగత కక్షలు కాదన్నారు. ప్రజాసమస్యల వరకే అధికారపక్షం, ప్రతిపక్షమని.. వ్యక్తిగతం అంశానికి వస్తే అందరూ ఆప్యాయంగా పలకరించుకోవాలన్నారు. గతంలో ఇలాంటి పరిస్థితే ఉండేదని.. మర్రి చెన్నారెడ్డితో తనకు ఎదురైన ఓ జ్ఞాపకాన్ని చంద్రబాబు పంచుకున్నారు. ఇప్పుడు రాజకీయాలు కలుషితమైపోయాయని వ్యక్తిగత కక్షలను..రాజకీయంగా మార్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వెంకటేశ్వర స్వామి, కూచిపూడి మన వారసత్వాలు : చంద్రబాబు
ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసిన స్పీకర్ అయ్యన్నపాత్రుడుును సీఎం, డిప్యూటీ సీఎం ప్రశంసించారు. ఆయన వల్లే ఇలాంటివి జరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో కూచిపూడి ప్రదర్శించిన పిల్లలను చంద్రబాబు అభినందించారు. ప్రధానమంత్రి పర్యటనలో వారితో ప్రదర్శన ఉంటుందన్నారు. కూచిపూడి గ్రామాన్ని అభివృద్ధి చేసి తెలుగు వారసత్వంగా ప్రపంచానికి అందించాలన్నారు. మనకు రెండు వారసత్వాలు ఉన్నాయని ఒకటి వెంకటేశ్వరస్వామి..రెండు కూచిపూడి అన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

