AP Assembly: ఏపీ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం - మాట నిలబెట్టుకున్నామని చంద్రబాబు భావోద్వేగం
SC Categorization: ఎస్సీ కేటగిరైజేషన్ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మాట నిలబెట్టుకున్నామని చంద్రబాబు ప్రసంగించారు.

Ap Assembly Chandrababu: ఎస్సీ వర్గీకరణపై ఎన్నికల సమయంలో చెప్పినట్లుగానే ఆ మాటను నిలబెట్టుకున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎస్సీ ఉపకులాల్లో సమన్యాయం కోసం సుప్రీంకోర్టు తీర్పు మేరకు వర్గీకరణ చేశామని తెలిపారు. 1995లో తాను మొదట ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు సుధీర్ఘ కాలం పాటు సాగిన వర్గీకరణ అంశం మళ్లీ తన హయాంలోనే సాకారం చేయడం సంతృప్తిని ఇచ్చిందని అన్నారు. ఎస్సీ వర్గీకరణపై శాసనసభలో గురువారం సీఎం ప్రసంగించారు. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన రాష్ట్రం యూనిట్ గా అమలు చేయాలని నిర్ణయించామని, 2026 జనాభా గణన తర్వాత వర్గీకరణను జిల్లా యూనిట్‌గా అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. బడుగు, బలహీన వర్గాలను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పైకి తీసుకువచ్చేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. బుడగ జంగాలను కూడా ఎస్సీల్లో చేర్చాలని అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని కేంద్రానికి పంపుతామని సీఎం చంద్రబాబు తెలిపారు.
మాదిగ దండోరా పేరుతో మందకృష్ణ పోరాడారు
ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగ దండోరా అనే ఆర్గనైజేషన్ పెట్టి మందకృష్ణ పెద్ద ఉద్యమం చేశారని చంద్రబాబు తెలిపారు. నేను వారి సమస్యలను ప్రత్యక్షంగా చూశాను. వారు డిమాండ్లు సమంజసమని భావించి 10.09.1996లో జస్టిస్ రామచంద్రరావు కమిషన్ వేశాం. ఈ కమిషన్ రాష్ట్రమంతా తిరిగి అధ్యయనం చేసి 28.05.1997న నివేదిక ఇచ్చింది. సమాజంలో అసమానతలు తొలగి, పేదరికం లేని సమాజం లక్యంగా 1997, జూన్ 6న ఎస్సీ రిజర్వేషన్లను ఏ,బీ,సీ,డీలుగా వర్గీకరిస్తూ ఉత్వర్తులు ఇచ్చాం. నవంబర్ 30, 1999న నాటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ ఆమోదంతో వర్గీకరణ అమల్లోకి వచ్చింది. దీంతో మాదిగలు, ఉప కులాలకు 22 వేలకు పైగా ఉద్యోగాలు వచ్చాయి. అయితే వర్గీకరణ అంశం కోర్టుకు వెళ్లడంతో వర్గీకరణ చేసే అధికారం ఒక్క పార్లమెంటుకే ఉందని 2004, నవబంర్ 5న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో నాటి కేంద్ర ప్రభుత్వం వేసిన ఉషా మెహ్రా కమిషన్ వర్గీకరణ అమలైన 2000-2004 మధ్య మంచి ఫలితాలు వచ్చాయని స్పష్టం చేసింది. ఎస్సీ రిజర్వేషన్‌ల వర్గీకరణకు అనుకూలంగా గతేడాది ఆగస్టులో సుప్రీం తీర్పు ఇచ్చింది. జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యులతో కూడి ధర్మాసనం తీర్పును వెలువరించింది.
నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా
30 ఏళ్ల క్రితం ఎస్సీ వర్గీకరణకు నేను కమిటీ వేశాను. నాటి నుంచి వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేంత వరకూ ఈ సుధీర్ఘ ప్రయాణంలో నేను భాగస్వామిని కావడం అరుదైన అవకాశంగా, నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. సామాజిక న్యాయం కోసం నేను చేసిన ఆలోచన సబబు అని అత్యున్నత న్యాయస్థానం తీర్పు ద్వారా స్పష్టమైంది. ఎన్టీఆర్ సామాజిక న్యాయం కోసం అనునిత్యం తపించారు. దేశంలోనే మొదటిసారిగా ఎస్సీ, ఎస్టీలకు శాశ్వత గృహాలు నిర్మించిన వ్యక్తి ఎన్టీఆర్. దేశంలో మొదటిసారిగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చదువుకునేందుకు సోషల్ వెల్ఫేర్ స్కూలు పెట్టింది కూడా ఎన్టీఆరే. నాడు ముఖ్యమంత్రిగా ఎస్సీల పట్ల వివక్షను నేను స్వయంగా చూశాను. ఆ రోజుల్లో తెలంగాణలో అయితే బాన్చత్ నీ కాళ్లు మొక్కుతా అనేవారు. అంటరానితనాన్ని రూపుమాపేందుకు నాకు చాలా సమయం పట్టింది. ఆనాడు బోర్లు, బావుల దగ్గర నీరు తీసుకునేందుకు ఎస్సీలను రానిచ్చేవారు కాదు. వారు చెప్పులు లేకుండా ఊర్లో తిరగాలి. టీ స్టాల్ దగ్గర గ్లాస్ లు వేరే పెట్టేవారు. ఇవన్నీ చూశాక నేను జస్టిస్ పున్నయ్య కమిషన్ వేయగా బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చిత్తశుద్ధితో పనిచేశారు. రాష్ట్రంలో కుల వివక్ష ఉండకూడదనే ఉద్దేశంతో 25 మెమోలు, జీవోలు ఇచ్చానని చంద్రబాబు గుర్తు చేసుకునన్నారు.
మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ వేశాం
ఎస్సీ వర్గీకరణపై 15.11.2024లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రాతో ఏక సభ్య కమిషన్ వేశాం. వారు 13 ఉమ్మడి జిల్లాల్లో తిరిగి ప్రజల అభిప్రాయాలు తీసుకున్నారు. 10.03.2025న సమగ్ర నివేదిక ఇచ్చారు. 59 ఉపకులాలను 3 కేటగిరీలుగా విభజించి రిజర్వేషన్లు కేటాయించారు. రోస్టర్ విధానం ప్రకారం మొదట 100 పోస్టులు వస్తే 8 పోస్టులు మాల సామాజిక వర్గానికి వస్తాయి. మాదిగ సామాజిక వర్గానికి 6 శాతం, రెల్లి సామాజిక వర్గానికి ఒక శాతం వస్తాయి. మూడు కలిపితే 15 శాతమవుతుంది. 200 పోస్టులు వస్తే మాల సామాజికి వర్గానికి 15 , మాదిగ సామాజిక వర్గానికి 13 , రెల్లికి 2 పర్సంటేజ్ వస్తుంది. తద్వారా రోస్టర్‌లో అందరికీ న్యాయం జరుగుతుందన్నారు.
గత ప్రభుత్వం అన్యాయం చేసింది
గత ప్రభుత్వం ఐదేళ్లలో వెనుకబడిన కులాలకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. వారి సంక్షేమం పట్టించుకోలేదు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎన్డీఏ ప్రభుత్వం ఎస్సీల కోసం రూ.804 కోట్ల ఔట్‌లేతో రూ.240 కోట్ల ప్రభుత్వ గ్రాంట్ తో ఆదుకుంది. ఎస్సీ, ఎస్టీలకు 2014 -19 మధ్య సబ్ ప్లాన్ నిధులు అందించాం. మాల, మాదిక సామాజిక వర్గాలకు జనాభా దామాషా ప్రకారం ఆర్థిక వనరులు కేటాయించాం. మేము చేసిన ఎస్సీ వర్గీకరణ వల్ల 22 వేల మందికి లబ్ధి చేకూరింది. గత పాలకులు నేషనల్ ఫైనాన్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ నుంచి ఒక్క రూపాయి తేకపోగా పోతూ పోతూ బకాయిలు పెట్టిపోయారని విమర్శించారు. రాష్ట్రంలో పేదరికం ఉండకూడదనే లక్ష్యంతో పనిచేస్తున్న నాకు ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్ సహకరిస్తున్నారని చంద్రబాబు తెలిపారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

