YSRCP MLAs: అనర్హతా వేటు తప్పించుకోవడానికా? జీతం కోసమా ? - సీక్రెట్‌గా హాజరు పట్టీలో సంతకాలు పెట్టిన వైసీపీ ఎమ్మెల్యేలు
AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. వైసీపీ సభ్యులు కూడా హాజరయ్యారు. కానీ అది సంతకాలకే పరిమితం.

YSRCP AP Assembly: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ సమావేశాలను వైఎస్ఆర్‌సీపీ బహిష్కరించింది అనేది అందరికీ తెలిసిన విషయం. అయితే ఏడుగురు ఎమ్మెల్యేలు మాత్రం రహస్యంగా వచ్చి హాజరైనట్లుగా రిజిస్టర్ లో సంతకాలు చేసి వెళ్లారు. మొత్తంగా ఉన్నకొండు మంది ఎమ్మెల్యేల్లో జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం సంతకాలు చేయలేదు. అసెంబ్లీ చివరి రోజున ఈ విషయం స్పీకర్ అయ్యన్న పాత్రుడు దృష్టికి వచ్చింది. ఆయన సభలో ప్రకటించారు వైసీపీ ఎమ్మెల్యేలు దొంగల్లా వచ్చి రిజిస్టర్ లో సంతకాలు పెట్టి కోవాల్సిన అవసరం ఏముదంని ప్రశ్నించారు. ఆయన బయట పెట్టడంతో ఆ ఎమ్మెల్యేలు ఎవరో తెలిసిపోయింది.
సంతకాలు పెట్టి అసెంబ్లీకి హాజరు కాని వైసీపీ ఎమ్మెల్యేలు
స్కూలు, ఆఫీసుల్లో విద్యార్థులు, ఉద్యోగులు పంచ్ కొట్టి బయటకు వెళ్లిపోయినట్లుగా ఈ ఎమ్మెల్యేల వ్యవహారం ఉండటంతో ఎమ్మెల్యేల్లోనే కాదు..రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అసెంబ్లీకి వెళ్లకూడదని అనుకున్నప్పుడు వెళ్లకుండా ఉండాలి కానీ రహస్యంగా సంతకాలు పెట్టాల్సిన అవసరం ఏమిటన్నది చర్చనీయాంశం అయింది. అసెంబ్లీకి హాజరు కాకపోతే అనర్హతా వేటు పడుతుందని స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదే పదే చెబుతున్నారు. అందుకే వారు గవర్నర్ ప్రసంగం రోజున హాజరై కొంత సేపు ఉండి వెళ్లిపోయారు. అయితే తర్వాత ఆ రోజు వర్కింగ్ డే కాదని అసెంబ్లీ వర్గాలు చెప్పాయి. దాంతో మరో రోజు హాజరు కావాల్సిన అవసరం పడింది.
అనర్హతా వేటు తప్పించుకోవడానికేనా ?
అలా హాజరు కాకుండా.. ఎప్పుడు వచ్చారో కానీ.. నేరుగా అసెంబ్లీకి వచ్చి రిజిస్టర్ లో సంతకాలు పెట్టి వెళ్లిపోయారు. ఒక్క నిమిషం కూడా సభలోకి రాలేదు. ఈ సంతకాలు చెల్లుతాయా లేదా అన్నది స్పీకర్ రూలింగ్ ను బట్టి ఉంటుంది. చెల్లుబాటు అంశంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఎలాంటి ప్రకటన చేయలేదు. అదే సమయంలో అసెంబ్లీకీ హాజరైనప్పుడు ప్రత్యేకంగా జీతభత్యాలు వస్తాయి. వాటి కోసం సంతకాలు చేసి ఉంటారని అంటున్నారు. ఎమ్మెల్యేలకు జీతభత్యాలు లక్షల్లోనే ఉంటాయి. అసెంబ్లీకి హాజరు కాని కారణంగా వాటిని ఆపేస్తే.. సమస్యలు వస్తాయని వచ్చి సంతకాలు పెట్టి ఉంటారని భావిస్తున్నారు.
అసెంబ్లీకి రావాలని అనుకుంటున్నా అనుమతించని జగన్
ప్రజలు ఓట్లు వేసి పంపించింది..అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యలు చర్చించడానికి. అయితే ఎమ్మెల్యేలు జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్న కారణంగా అసెంబ్లీకి వెళ్లడం లేదు. జగన్ కు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తామంటున్నారు. వైసీపీకి ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలలో చాలా మంది కొత్త ఎమ్మెల్యేలు. అసెంబ్లీకి హాజరై అధ్యక్ష అని ప్రసంగించాలని అనుకుంటున్నారు. కానీ అధినేత అంగీకరించకపోవడంతో అసెంబ్లీకి వెళ్లలేకపోతున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

