Betting Apps Case Scam: ప్రకాష్ రాజ్... శ్యామల... బెట్టింగ్ యాప్స్ కేసులో జనసైనికుల టార్గెట్ వీళ్ళిద్దరే!
తెలంగాణ పోలీసులు బెట్టింగ్ యాప్ కేసులో మరో ముందడుగు వేశారు. తెలుగు చిత్రసీమలోని పాతికమంది సెలబ్రిటీల మీద కేసు నమోదు చేశారు. అయితే... అందులో జన సైనికుల టార్గెట్ మాత్రం ఇద్దరే.

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రముఖుల మెడకు బెట్టింగ్ యాప్ కేసు (Betting Apps Case) బలంగా చుట్టుకుంటోంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి మొదలైన కేసు ఇప్పుడు సినిమా సెలబ్రిటీల వరకు వచ్చింది. హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్ లో పాతిక మంది సెలబ్రిటీల మీద తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే... ఆ 25 మందిలో జన సైనికుల టార్గెట్ మాత్రం ఇద్దరే.
ప్రకాష్ రాజ్... వైసీపీ శ్యామల...
ఇద్దరినీ ప్రశ్నిస్తున్న జన సైనికులు!
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించిన, ఆయనతో సంబంధం ఉన్న పలువురు తారలు బెట్టింగ్ యాప్ కేసులో ఉన్నారు.
'అత్తారింటికి దారేది' సినిమాలో బాపు బొమ్మగా అలరించిన ప్రణీతా సుభాష్, 'భీమ్లా నాయక్' సినిమాలో డానియల్ శేఖర్ పాత్రలో నటించిన రానా దగ్గుబాటితో పాటు 'వకీల్ సాబ్'లో ఒక క్యారెక్టర్ చేసిన అనన్యా నాగళ్ల, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా సెట్స్ మీద ఉన్న 'హరి హర వీరమల్లు' సినిమాలోని హీరోయిన్ నిధీ అగర్వాల్ మీద తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే... పవర్ స్టార్ అభిమానులు, జన సైనికుల టార్గెట్ మాత్రం ఇద్దరే. ఒకరు... విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj), మరొకరు... ఒకప్పటి యాంకర్, ప్రస్తుత వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల (Shyamala).
'బద్రి' నుంచి మొదలు పెడతే 'వకీల్ సాబ్' వరకు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన పలు సినిమాలలో ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. సినిమాల పరంగా వాళ్ళిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అయితే రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ వైఖరిని సోషల్ మీడియా వేదికగా ప్రకాష్ రాజ్ పదే పదే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల జనసేన ఆవిర్భావ దినోత్సవంలో పవన్ స్పీచ్ మీద కూడా విమర్శలు గుప్పించారు. హిందీ భాష మీద పవన్ మాట మార్చారని ఆయన ట్వీట్ చేశారు. దాంతో జన సైనికులకు ఆయన వ్యతిరేకిగా మారారు. తన అభిమాన కథానాయకుడు, తమ పార్టీ అధినేతను విమర్శిస్తున్న వ్యక్తిని సోషల్ మీడియా వేదికగా విమర్శించడం మొదలు పెట్టారు.
టీవీ షోలతో పాటు సినిమా వేడుకలకు యాంకరింగ్ చేసినప్పుడు, సినిమాలలో నటించినప్పుడు పవన్ కళ్యాణ్ మీద ప్రశంసల వర్షం కురిపించిన శ్యామల... వైసీపీ కండువా కప్పిన తర్వాత విమర్శల జడివానతో విరుచుకు పడుతున్నారు. అందుకే ప్రకాష్ రాజ్, శ్యామలను జన సైనికులు టార్గెట్ చేశారు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ద్వారా ప్రజలకు ప్రకాష్ రాజ్, శ్యామల ఏం సేవ చేశారని ప్రశ్నిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వ్యక్తులు నీతులు చెప్పడం సరి కాదని హితవు పలుకుతున్నారు. జనసేన తిరుపతి నాయకుడు కిరణ్ రాయల్ అయితే మరో అడుగు ముందుకు వేసి శ్యామలను వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బెట్టింగ్ యాప్స్ కేసు నుంచి ఎలా బయట పడాలని మిగతా సెలబ్రిటీలు ఆలోచిస్తుంటే... ప్రకాష్ రాజ్, శ్యామలకు మాత్రం ఈ విమర్శలను తిప్పి కొట్టాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది. దీన్ని వాళ్ళిద్దరూ ఎలా డీల్ చేస్తారో చూడాలి.
Also Read: నాన్నా... నిన్ను మిస్ అవుతున్నాం - మోహన్ బాబు బర్త్ డేకి మనోజ్ మంచు ఎమోషనల్ పోస్ట్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

