సినిమాను మించిన ట్రాజెడీ... చిరు, నాగ్, పవన్... స్టార్ హీరోలతో నటించినా... దిక్కులేని చావు... కుళ్లిన స్థితిలో మృతదేహం
Actor : 300లకు పైగా సినిమాలు చేసిన ఈ నటుడి స్టోరీ వింటే కన్నీళ్ళు ఆగవు. ఆర్థిక సమస్యలతో సతమతం అయ్యి, చివరకు కొడుకు కోసం ఎదురు చూసిన ఆయన లైఫ్ హృదయ విదారకంగా ముగిసింది. ఆ నటుడు ఎవరంటే ?

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ గా రాణించిన ఎంతో మంది నటీనటులు చివరి దశలో మాత్రం చాలా కష్టాలను ఎదుర్కొన్నారు. మహానటి సావిత్రి వంటి దిగ్గజ నటి జీవితం ఎంతటి బాధాకరంగా ముగిసిందో చూశాం మనం. అలాగే మరో నటుడు కూడా తన జీవితంలో ఇలాంటి దారుణమైన కష్టాలను ఎదుర్కొన్నాడు. 300 సినిమాలలో నటించిన ఈ నటుడు చివరికి దిక్కులేని చావుతో తన అభిమానులను కన్నీరు పెట్టించాడు. కన్న కొడుకును తనివి తీరా కౌగిలించుకోవాలని ఎంతగానో కోరుకున్నాడు. కానీ చివరి కోరిక తీరకుండానే మందు బాటిల్ పక్కన పెట్టుకొని, చనిపోయి కనిపించాడు. ఆ నటుడు మరెవరో కాదు మహేష్ ఆనంద్.
చివరి కోరిక తీరాకుండానే తిరిగిరాని లోకాలకు
బాలీవుడ్ లో విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన మహేష్ ఆనంద్ టాలీవుడ్ లో కూడా చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగార్జున లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించాడు. తెలుగు, హిందీలో మాత్రమే కాదు మలయాళ, కన్నడ సినిమాల్లో కూడా నటించి నటుడిగా తనదైన ముద్ర వేసుకున్నాడు. 80 - 90లలో మోస్ట్ వాంటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న మహేష్ ఆనంద్ విలన్ గా ఎన్నో చిరస్మరణీయ పాత్రల్లో నటించాడు. ఇంతటి కీర్తి, ప్రతిష్టలు ఉన్న మహేష్ ఆనంద్ జీవితం చివరికి విషాదకరమైన మలుపు తీసుకుంది.
18 సంవత్సరాలు పేదరికంలో గడిపిన ఆయన ఒకానొక టైంలో కనీసం చెప్పుకోవడానికి నా అన్నవాళ్ళు లేకుండా బ్రతికారు. అప్పట్లోనే ఫేస్ బుక్ పోస్ట్ లతో సంచలనం సృష్టించారు. వాటిలో "నా స్నేహితులు అందరూ నన్ను తాగుబోతు అని పిలుస్తారు. నాకు ఫ్యామిలీ లేదు. నా సవతి సోదరుడు 6 కోట్లకు మోసం చేశాడు. 300 కోట్లకు పైగా సినిమాలు చేసిన నా దగ్గర ఇప్పుడు కనీసం తాగడానికి నీళ్లు కొనే స్తోమత కూడా లేదు. ప్రపంచంలో నాకు ఒక్క స్నేహితుడు కూడా లేదు. ఇది చాలా బాధాకరం" అని రాశాడు. అంతేకాకుండా చివరి రోజుల్లో తాను ఎంత ఒంటరితనాన్ని, బాధను అనుభవిస్తున్నాడో ఈ ఫేస్ బుక్ ద్వారానే తెలియజేసే ప్రయత్నం చేశారు. అందులో ఎక్కువగా తన కొడుకు త్రిశూల్ గురించి ఆయన ఆవేదనను వ్యక్తం చేసేవారు. అతని పేరు ఆంథోనీ వోహ్రా అని మార్చారని ఓ పోస్టులో వెల్లడించాడు.
అంతేకాకుండా కొడుకుని ఎంతగా ప్రేమిస్తున్నాడో చెబుతూ తనను చనిపోయేలోగా కనీసం ఒక్కసారి కౌగిలించుకోమని ప్రాధేయపడేవారు. కానీ చివరికి ఆ కోరిక తీరకుండానే ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. 2019 ఫిబ్రవరిలో మహేష్ ఆనంద్ హృదయ విదారకర పరిస్థితుల్లో చనిపోయి కనిపించారు. ఆయన పని మనిషి ఎన్నిసార్లు డోర్ కొట్టినా తీయకపోవడంతో, చుట్టుపక్కల వాళ్ళని పిలిచింది. అందరూ కలిసి డోర్ బద్దలు కొట్టి చూసేసరికి సోఫాలో టేబుల్ మీద పక్కన మద్యం బాటిల్ పెట్టుకుని చనిపోయి కనిపించాడు. 57 ఏళ్ల వయసులో కుళ్లిపోయిన స్థితిలో ఆయన మృతదేహం లభ్యమయింది. ఆయన భార్య మాస్కోలో ఉండడంతో ఆనంద్ అప్పటికే రెండు రోజుల క్రితం మరణించినా ఎవ్వరికీ తెలియ రాలేదు.
మహేష్ ఆనంద్ తెలుగు సినిమాలు
Mahesh Anand Telugu Movies: మహేష్ కేవలం నటుడు మాత్రమే కాదు కరాటే లో బ్లాక్ బెల్ట్ పొందాడు. అలాగే అప్పట్లోనే మోడలింగ్లో శిక్షణ తీసుకున్నాడు. మంచి డాన్సర్ కూడా. 1984లో 'కరిష్మా' అనే మూవీతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆయన ఆ తర్వాత లంకేశ్వరుడు, ఎస్పీ పరశురామ్, టాప్ హీరో, బొబ్బిలి సింహం, అల్లుడా మజాకా, ఘరానా బుల్లోడు, ఆటో డ్రైవర్, బాలు లాంటి సినిమాలలో నటించాడు. చివరిసారిగా 2019లో రిలీజ్ అయిన 'రంగీలా రాజా' అనే సినిమాలో కనిపించాడు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

