Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా సంస్థ యజమాని లక్ష్మీనారాయణ ప్రధాన సూత్రధారిగా సాగిన కుంభకోణంపై ఈడీ సుదీర్ఘ కాలంగా ఆరా తీస్తోంది. ఈ కేసులో అదనపు ఛార్జ్‌షీట్ వేసింది.

Sahiti Infra Scam: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రకంపనలు సృష్టించిన సాహితి ఇన్‌ఫ్రా కుంభకోణం కేసులో ఈడీ దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను ఆసరాగా చేసుకొని సాగించిన ఈ భారీ దోపిడీ విలువ అక్షరాలా రూ.800 కోట్లు అని ఈడీ తేల్చి చెప్పింది. ఈ మేరకు దర్యాప్తు సంస్థ కోర్టులో అదనపు ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తూ, సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది. రియల్ ఎస్టేట్ రూల్స్ తుంగలో తొక్కి సాగించిన ఒక వ్యవస్థీకృత నేరంగా కనిపిస్తోంది.
800 కోట్ల స్కామ్; ఈడీ దర్యాప్తులో విస్తుపోయే నిజాలు
సాహితి ఇన్‌ఫ్రా సంస్థ యజమాని లక్ష్మీనారాయణ ప్రధాన సూత్రధారిగా సాగిన కుంభకోణంపై ఈడీ సుదీర్ఘ కాలంగా ఆరా తీస్తోంది. తాజా ఛార్జ్‌షీట్ ప్రకారం, ఈ స్కామ్ విలువ గతంలో అంచనా వేసిన దాని కంటే చాలా ఎక్కువగా ఉంది.
నిందితులు ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో అమాయక ప్రజల నుంచి భారీగా నిధులను వసూలు చేశారు. అనుమతులు లేని ప్రాజెక్టులను చూపించి, తక్కువ ధరకే ఫ్లాట్లు ఇస్తామని నమ్మబలికి వందలాది మందిని నిలువునా ముంచేశారు.
ముఖ్యంగా అమీన్‌పూర్ పరిధిలోని శర్వాణీ ఎలైట్ అనే ప్రాజెక్టు పేరుతోనే నిందితులు సుమారు రూ. 360 కోట్లను వసూలు చేసినట్టు ఈడీ తన దర్యాప్తులో గుర్తించింది. ప్రాజెక్టు నిర్మాణం చేపట్టకుండా ఇంతటి భారీ మొత్తాన్ని వసూలు చేయడం నిందితుల పక్కా ప్లాన్ తెలియజేస్తోంది.
ED, Hyderabad Zonal Office has filed Supplementary Prosecution Complaint before the Hon’ble MSJ Court, Hyderabad against B. Lakshminarayana, Sandhu Purnachandra Rao, Ex-Director and Sales & Marketing Head of M/s Sahiti Infratec Ventures India Pvt. Ltd. (SIVIPL) under PMLA, 2002… pic.twitter.com/MhoQZOlsny
— ED (@dir_ed) January 6, 2026
విదేశాలకు నిధులు మళ్లింపు; హవాలా కోణం
సాహితి ఇన్‌ఫ్రా స్కామ్‌లో అత్యంత ఆందోళనకరమైన విషయం ఏంటంటే... వసూలు చేసిన నిధులు నిందితులు విదేశాలకు మళ్లించడం, బాధితుల నుంచి వసూలు చేసిన మొత్తంలో సుమారు 126 కోట్లును విదేశాలకు తరలించినట్టు ఈడీ ఆధారాలతో సహా ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది.
లక్ష్మీనారాయణతో కలిసి పూర్ణ చందర్ అనే వ్యక్తి ఈ నిధుల దుర్వినియోగంలో కీలక పాత్ర పోషించినట్టు సమాచారం. ఈ నిధులు ఏ దేశాలకు వెళ్ళాయి. ఏయే మార్గాల ద్వారా తరలించారు, అనే కోణంలో ఈడీ లోతుగా విచారిస్తోంది.
బినామీ ఆస్తులు - కుటుంబ సభ్యుల పేర్లపై పెట్టుబడులు
వసూలు చేసిన డబ్బుతో లక్ష్మీనారాయణ తన వ్యక్తిగత సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నట్టు దర్యాప్తులో తేలింది. సాహితి సంస్థ పేరుతోనే కాకుండా గ్రూప్ ఉద్యోగుల పేర్లపై కూడా భారీగా ఆస్తులను కొనుగోలు చేశారు. ఈడీ సమాచారం ప్రకారం.....
మొత్తం 21 ఆస్తులను లక్ష్మీనారాయణ వివిధ పేర్లతో కొనుగోలు చేశారు.
తన కుటుంబ సభ్యుల పేర్లపై కూడా భారీగా స్థిర ఆస్తులను వెనకేసినట్టు ఈడీ నిర్దారించింది.
సంస్థ నిధులను వ్యక్తిగత విలాసాలకు, బినామీ పెట్టుబడులకు మళ్లించడం ద్వారా ప్రాజెక్టులను అటకెక్కించారు.
ఈడీ కొరడా; ఆస్తుల సీజ్
ఈ కుంభకోణానికి సంబంధించి ఈడీ ఇప్పటికే కఠిన చర్యలు చేపట్టింది. నిందితులకు చెందిన సుమారు రూ. 169 కోట్లు విలువైన స్థిరా, చ ఆస్తులను దర్యాప్తు సంస్థ ఇప్పటికే ఫ్రీజ్ చేసింది. అదనపు ఛార్జ్‌షీట్ దాఖలు చేయడం ద్వారా కేసును మరింత బలోపేతం చేసిన ఈడీ నిందితులకు శిక్ష పడేలా, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు వేగవంతం చేస్తోంది.





















