Telangana డిప్యూటీ సీఎం భట్టి కుమారుడి పెళ్లి వేడుక.. అధికార హోదా ఉన్నా.. ఆత్మీయతకే పెద్దపీట!
Bhatti Vikaramarkas son wedding | తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహంలో ఆదిలాబాద్ పీపుల్స్ మార్చ్ పాదయాత్ర' బంధువుల సందడి కనిపించింది.

శంషాబాద్: రాజకీయ హోదాలు, అధికార దర్పం కంటే మనుషుల మధ్య ఉండే అనుబంధాలే గొప్పవని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నిరూపించారు. తన కుమారుడి వివాహ వేడుకను కేవలం ప్రముఖుల కలయికగా మార్చకుండా, కష్టకాలంలో తనకు తోడుగా నిలిచిన సామాన్యులను ఆహ్వానించి గౌరవించడం ద్వారా ఆయన తన సంస్కారాన్ని చాటుకున్నారు.
ఆత్మీయ బంధువుల రాక
తెలంగాణ వ్యాప్తంగా భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఆయనకు అండగా నిలిచిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల ప్రజలు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జైనూర్ మండలం బూసిమెట్టకు చెందిన వాలే లక్ష్మిబాయి, డాకూరే రుక్మబాయి.. అలాగే ఉట్నూరు మండలం దేవగూడకు చెందిన మరప గంగుబాయి, సిడం లక్ష్మీబాయి, నాగజ్యోతి ఈ మహిళలు శంషాబాద్ లోని జీఎంఆర్ ఎరీనాలో జరిగిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య, సాక్షి ల వివాహానికి హాజరై సందడి చేశారు.

కొడుకు, కోడలికి 'కన్నతల్లి' పరిచయం పాదయాత్ర సమయంలో ఎండనక, వాననక అడుగులు వేస్తున్నప్పుడు తనను కన్నబిడ్డలా ఆదరించి, ఆకలి తీర్చిన తీరును భట్టి విక్రమార్క స్వయంగా తన కుమారుడు, కోడలికి వివరించారు. "వీరే నన్ను ఆనాడు కంటికి రెప్పలా చూసుకున్న నా ఆత్మీయులు" అని ఆయన పరిచయం చేస్తుంటే అక్కడ ఒక భావోద్వేగ వాతావరణం నెలకొంది. పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం ఈ వేడుకలో మరో ముఖ్య ఘట్టం అందరినీ ఆకట్టుకుంది. కేవలం అతిథులుగా వారిని ఆహ్వానించడమే కాకుండా, ఆ పెద్దమ్మల పాదాలకు నూతన వధూవరులు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.

అధికార హోదాలో ఉన్నా కూడా
సామాన్యుల పట్ల చూపిన ఈ వినమ్రతపై అతిథులు ప్రశంసలు కురిపించారు. వధూవరులు నూరేళ్ల పాటు చల్లగా ఉండాలని ఆ గ్రామీణ మహిళలు మనస్ఫూర్తిగా దీవించారు. కష్టకాలంలో తోడున్న వారిని గుర్తుపెట్టుకోవడం, వారికి సముచిత గౌరవం ఇవ్వడం గొప్ప సంస్కారం" అని వేడుకకు హాజరైన వారు చర్చించుకోవడం కనిపించింది.

టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు



















