India Condoles Khamenei Death: ఖమేనీ మృతిపై తొలిసారి స్పందించిన భారత్.. సంతాపం తెలిపిన విదేశాంగ శాఖ
Ayatollah Ali Khamenei | ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతికి భారత ప్రభుత్వం సంతాపం తెలిపింది. విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ ఢిల్లీలోని ఇరాన్ ఎంబసీకి వెళ్లి తన సంతాపం ప్రకటించారు.

Iran Supreme Leader Khamenei | న్యూఢిల్లీ: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతిపై భారత ప్రభుత్వం తొలిసారి స్పందించింది. భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ ఢిల్లీలోని ఇరాన్ ఎంబసీకి వెళ్లి మరీ ఖమేనీ మృతిపై సంతాపం తెలిపారు. ఖమేనీ మృతిపై సంతాపం తెలుపుతూ ఓ లేఖ రాశారు. ఖమేనీ కుటుంబసభ్యులు, ఆయన మద్ధతుదారులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అమెరికా, ఇజ్రాయెల్ సైన్యం సంయుక్తంగా చేపట్టిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ హొస్సేనీ ఖమేనీ దుర్మరణం చెందారని తెలిసిందే. ఖమేనీతో పాటు కుమార్తె, అల్లుడు, మరికొందరు కుటుంబసభ్యులు ఈ దాడుల్లో చనిపోయారు. ఇరాన్ మీడియా సైతం ఈ విషయాన్ని నిర్ధారిస్తూ కీలక ప్రకటనలు చేసింది. ప్రస్తుతం ఖమేనీ అంత్యక్రియల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
#WATCH | Foreign Secretary Vikram Misri, on behalf of Government of India, signed the Condolence Book at the Embassy of Iran in New Delhi today, and offered condolences to the slain Supreme Leader of Iran Ayatollah Ali Khamenei. pic.twitter.com/A3IP2d0diX
— ANI (@ANI) March 5, 2026
చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి మూసివేత ముప్పుతో అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. ఇది ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. సుప్రీం లీడర్ ఖమేనీ మరణంతో ఇరాన్‌లో నాయకత్వ మార్పు ప్రక్రియ మొదలైంది. ఉత్కంఠ నెలకొంది. అంతర్గత అనిశ్చితి యుద్ధ పరిణామాలను మరింత క్లిష్టంగా మార్చింది.
ఖమేనీ అంత్యక్రియలు అక్కడే..
ఇరాన్‌లో 40 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించి పాటిస్తున్నారు. ఖమేనీ అంత్యక్రియలు మషాద్ నగరంలో జరగనున్నాయని, అందుకు ఏర్పాట్లు చేస్తున్నారని ఇరాన్ మీడియా పేర్కొంది. .ఇరాన్ లోని మషాద్‌లో ఖమేనీ జన్మించగా.. అది దేశంలో రెండో అతిపెద్ద నగరం. మషాద్‌లో ఉన్న ఇమామ్ రజా మసీదు వద్ద ఆయన తండ్రి సమాధి ఉండటంతో సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియలు కూడా ఇదే నగరంలో నిర్వహించడానికి ఇరాన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సుప్రీం లీడర్‌గా ఎన్నిక
1989లో అయతుల్లా ఖమేనీ తన రాజకీయ వారసుడిగా అయతుల్లా అలీ ఖమేనీ పేరు ప్రకటించాడు. అయితే గతంలో ఉన్న పదవులకు భిన్నంగా మరో అత్యున్నత పదవిని సృష్టించేందుకు రాజ్యాంగాన్ని సైతం సవరించాల్సి వచ్చింది. ఇరాన్ కొత్త సుప్రీం నాయకుడి పదవి క్రియేట్ చేసిన తరువాత 1989 జూన్ 4 న సభ ద్వారా కొత్త సుప్రీం లీడర్‌గా ఖమేనీ ఎన్నికయ్యారు. సుప్రీం లీడర్ పగ్గాలు చేపట్టి మూడున్నర దశాబ్దాల పాలనలో ఇరాన్‌లో తిరుగులేని నేతగా ఖమేనీ ఎదిగారు. కానీ దశాబ్దాల నుంచి అమెరికా, ఇజ్రాయెల్ తో ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పలుమార్లు చిన్న చిన్న దాడులు జరగడం.. ఇరు పక్షాల సైన్యం వెనక్కి తగ్గడం లాంటివి జరిగాయి. చివరికి ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్లో ఖమేనీ మృతిచెందారు.
ట్రెండింగ్ వార్తలు























