Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
Hilt Policy : హిల్ట్ పాలసీపై ప్రతిపక్షాలకు ఎలాంటి అనుమానాలు వద్దని, ప్రభుత్వానికి లేఖ రాస్తే 2014 నుంచి నేటి హిల్ట్ పాలసీ వరకూ ఎలాంటి విచారణకైనా ప్రభుత్వం సిద్దమన్నారు డిప్యూటీ సీఎం భట్టి.

Hilt Policy : పారదర్శకంగా అందరికీ ఒకే నిబంధనలు వర్తించేలా ఆరు నెలల కాలవ్యవధిలో అమలులోకి తీసుకువచ్చే విధంగా హిల్ట్ (హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ ఫర్మేషన్ పాలసీ)ని ప్రభుత్వం తీసుకువచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో తెలిపారు. హిల్ట్ పాలసీ లేకపోతే ఎకరానికి రూ.12 లక్షలు మాత్రమే ఆదాయం వచ్చేది. కానీ ఈ రోజు కొత్త పాలసీ ద్వారా ఎకరాకు రూ.7 కోట్ల ఆదాయం రాబోతోందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన ఫ్రీ హోల్డ్, గ్రిడ్ పాలసీ ద్వారా రూ.574 కోట్ల ఆదాయం వచ్చే చోట రూ.10,776 కోట్ల ఆదాయం రాష్ట్ర ఖజానాకు వచ్చేలా హిల్ట్ పాలసీని రూపొందించామని ఆయన చెప్పారు. రాష్ట్రానికి ఆదాయం తెచ్చే పాలసీపై అడ్డగోలుగా మాట్లాడుతూ విషం కక్కవద్దని ప్రతిపక్షాలకు డిప్యూటీ సీఎం విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షాలకు ఎలాంటి అనుమానాలు ఉన్నా నివృత్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అనుమానాలు ఉన్న సభ్యులు ఎవరైనా ప్రభుత్వానికి లేఖ రాస్తే 2014 నుంచి నేటి హిల్ట్ పాలసీ వరకూ ఏ ఏజెన్సీ ద్వారా అయినా ఎలాంటి విచారణకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ఒక పక్క కాలుష్యకారక పరిశ్రమలను రింగ్ రోడ్ బయటకు తరలిస్తూ నగరంలో డీజిల్ బస్సులను దశల వారీగా హైదరాబాద్ అవతలికి తరలిస్తూ.. ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నామన్నారు.
ఎస్టీపీల ద్వారా డ్రైనేజీ కాలువల నీటిని శుద్ధి చేస్తున్నామని, ఈ నగరాన్ని మాత్రమే కాకుండా రాష్ట్రాన్ని కాపాడేందుకు హిల్ట్ పాలసీ తీసుకువచ్చామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. హిల్ట్ పాలసీ రాగానే రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం 5 లక్షల కోట్ల కుంభకోణం జరుగుతోందని ప్రకటించారని , మరొకరు 9 వేల ఎకరాలను అమ్మకానికి పెట్టి అంతకన్నా ఎక్కువ స్థాయిలో కుంభకోణం అని ప్రకటించారని భట్టి అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు మర్చిపోయి బీఆర్ఎస్ నేతలు ప్రకటనలు చేయడం దారుణమన్నారు భట్టి. గుడ్డ కాల్చి పక్కవాడి మీద వేసి మసి తుడుచుకోమన్నట్లు మాట్లాడుతున్నారని, రాష్ట్ర ప్రయోజనాల కన్నా.. వ్యక్తిగత ప్రయోజనాలే వారికి ముఖ్యం అని డిప్యూటీ సీఎం దుయ్యబట్టారు.
హైదరాబాద్ మహానగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని, పరిశ్రమలు రావడంతో.. నగరం విస్తృత స్థాయిలో ముందుకు సాగుతూన్నారు. రాచరికం నుంచి ప్రజాస్వామ్య ప్రభుత్వాల వరకు హైదరాబాద్ ను అభివృద్ధి చేశారు. 1927లో నిజాం కమిటీని వేసి 136 ఎకరా లభూమిని పరిశ్రమల కోసం కేటాయించారని తెలిపారు. పరిశ్రమల భూముల్లో లీజులు, ప్రభుత్వం అమ్మిన భూములు.. వ్యక్తిగత భూములపై పరిశ్రమలు పెట్టారు. పరిశ్రమల భూములపై హక్కులన్నీ పరిశ్రమల యాజమాన్యం వారిదే. వాటిపైన ప్రభుత్వానికి ఎటువంటి హక్కులు లేవన్నారు. విభజన తరువాత ఈ భూములపై 3 రకాల విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని, దీనివల్ల రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం లేదన్నారు భట్టి. కానీ ప్రజా ప్రభుత్వం తీసుకువచ్చిన హిల్ట్ పాలసీ వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందని, గత ప్రభుత్వం ప్రయివేటు వ్యక్తులకు లీజుల భూములపై యాజమాన్య హక్కులు కల్పించారని, ప్రభుత్వ భూమిని సబ్ రిజస్ట్రార్ రేటు ప్రకారం గత ప్రభుత్వం లీజు భూములను యాజమాన్య హక్కులు కల్పించినట్లు తెలిపారు. ప్రభుత్వం అనేది నిరంతర వ్యవస్థ.
నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి హైటెక్ సిటీకి శంకుస్థాపన చేశారు. తరువాత వచ్చిన చంద్రబాబు నాయుడు దానిని ముందుకు తీసుకువెళ్లారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్డు వంటి కార్యక్రమాలతో అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లారు. గత ప్రభుత్వం ప్రభుత్వ భూములను ప్రయివేటు వ్యక్తులకు ధారదత్తం చేస్తే.. మా ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు యాజమాన్య హక్కులు ఉన్నా.. వారి నుంచి కూడా ప్రభుత్వానికి ఆర్థిక లాభం చేకూరేలా నిర్ణయం చేశామన్నారు భట్టి. మా ప్రభుత్వం రూపాయి రూపాయి కూడబెట్టి ప్రజలకు అందిస్తున్నామని, హైదరాబాద్ నగరంలో వాతావరణ కాలుష్యం తీవ్రస్థాయిలో ఉన్నందువల్ల., పరిశ్రమలను నగరం నుంచి బయటకు తీసుకువెళ్లాలని 2012లోనే నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కమిటీ వేసినట్లు తెలిపారు. ఆ కమిటీ 2013లో ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చిందని, గత ప్రభుత్వం పారిశ్రామిక పార్కులను ఐటీ పార్కులుగా మార్చాలని నిర్ణయం తీసుకుట్లు గుర్తుచేశారు. అందులో భాగంగా 50 శాతం ఐటీ పార్కుల కోసం కేటాయించి.. మిగిలిన 50 శాతం భూమిని కమర్షియల్‌గా మార్చుకునేలా అవకాశం కల్పించినట్లు తెలిపారు. గత ప్రభుత్వమే ఎస్ఆర్ఓ ధరపైన 30 శాతం అదనంగా కట్టి, భూమిని కన్వర్ట్ చేసుకునే అవకాశం ఇచ్చినా ఎవరూ ముందుకు రాకపోవడం వల్ల మా ప్రభుత్వం హిల్ట్ పాలసీ తీసుకువచ్చింది తెలిపారు.
హైదరాబాద్ మహానగరంగా మారుతోంది. జనాభా కోటి కే 30 లక్షలు దాటుతోంది. ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకోకపోతే రేపటి తరాలకు అన్యాయం చేసిన వాళ్లం అవుతామన్నారు డిప్యూటీ సీఎం. హిల్ట్ పాలసీ రాక ముందు కన్వర్షన్ కు ఎకరానికి రూ. 12 లక్షలు కడితే సరిపోయేది. హిల్ట్ పాలసీ తీసుకురావడం వల్ల ప్రభుత్వానికి అదనంగా ఎకరాకు 7 కోట్లు రూపాయలు ఖజానాకు వస్తుందన్నారు. పరిశ్రమలు, వాహనాల వల్ల దేశంలో వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరుగుతోందని, దేశరాజధానిలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర పరిస్థితిలో ఉందన్నారు. హైదరాబాద్ కూడా అదే స్థాయిలోకి వెళ్లే రోజులు ఎంతో దూరంలో లేవన్న భట్టి, హైదరాబద్ లో ప్రస్తుతం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 230 వరకూ వెళుతోందని గుర్తుచేశారు. ఇది ప్రమాదకర ఘంటికలు మోగిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్ తరాలకు క్లీన్ సిటీని ఇవ్వాలనే లక్ష్యంతోనే హిల్ట్ పాలసీని మా ప్రభుత్వం తీసుకువచ్చిందన్న భట్టి, ప్రజల గురించి, ఆర్థిక పరిస్థితి గురించి బీఆర్ఎస్ నేతలకు ఎటువంటి ఆలోచన లేదన్నారు. హైదరాబాద్ మహా నగరాన్ని నివాసయోగ్యమైన నగరంగా మార్చడంలో మా ప్రభుత్వం కృత నిశ్చయంతో ముందుకు వెళుతోందని తెలిపారు. వికసిత్ భారత్ 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఎకానీమీ కావచ్చ, తెలంగాణ మాత్రం 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ ఎందుకు కాదు.? మేము ఎదిగేతేనే దేశం ఎదుగుతందన్నారు. రాష్ట్రాల సమాహారమే.. దేశం. క్యూర్, ప్యూర్, రేర్ విధానాలతో మేము ముందుకు వెళతామని, 2047 నాటికి లక్ష్యం చేరుకుంటామని అసెంబ్లీలో ధీమా వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.





















