Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Minister Ponguleti: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ చేస్తామని మంత్రి పొంగులేటి అసెంబ్లీలో ప్రకటించారు. గత ప్రభుత్వం మ్యాజిక్ నెంబర్ కోసమే అస్తవ్యస్థంగా జిల్లాల విభజన చేసిందన్నారు.

Telangana districts will reorganized: తెలంగాణలో గత ప్రభుత్వం చేపట్టిన జిల్లాల విభజన అశాస్త్రీయంగా ఉందని, దీనివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం, కొందరిని సంతృప్తి పరచడం కోసమే గతంలో జిల్లాల విభజన జరిగిందని ఆయన ఆరోపించారు. ఒకే నియోజకవర్గంలోని మండలాలు వేర్వేరు జిల్లాల్లో కలవడం వల్ల అటు పాలనాపరంగా, ఇటు ప్రజలకు సేవలందడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని, ఈ లోపాలను సరిదిద్దాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్ఘాటించారు.
గత ప్రభుత్వ అశాస్త్రీయ విభజన వల్ల ప్రజలకు సమస్యలు
అశాస్త్రీయ విభజన వల్ల ప్రజలు, అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఉదాహరణకు, ఒకే నియోజకవర్గంలోని మండలాలు మూడు, నాలుగు వేర్వేరు జిల్లాల్లో కలిసి ఉండటం వల్ల అటు ఎమ్మెల్యేలకు, ఇటు సామాన్య ప్రజలకు పాలన దూరమైందని వివరించారు.అందుకే జిల్లాల సరిహద్దులను, రెవెన్యూ డివిజన్లను పునర్ వ్యవస్థీకరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని మంత్రి ప్రకటించారు. పాలనను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా, భౌగోళిక పరిస్థితులు , ప్రజల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు ఉంటాయని వివరించారు. ముఖ్యంగా మండల కేంద్రాలకు దూరంగా ఉన్న గ్రామాలను సమీపంలోని మండలాల్లో కలపడం, అలాగే అవసరమైన చోట కొత్త రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయడం ద్వారా పాలనా యంత్రాంగాన్ని బలోపేతం చేస్తామన్నారు.
అందరితో చర్చించిన తర్వాతే మార్పులు
ఈ పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియ అంతా పారదర్శకంగా జరుగుతుందని, ఎవరిపై కూడా ఏకపక్ష నిర్ణయాలు రుద్దబోమని పొంగులేటి హామీ ఇచ్చారు. అధికారుల నుంచి వచ్చిన క్షేత్రస్థాయి నివేదికలను పరిశీలించిన అనంతరం, వాటన్నింటినీ అసెంబ్లీలో చర్చకు పెడతామని తెలిపారు. అన్ని పార్టీల ప్రజాప్రతినిధుల సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తుది నోటిఫికేషన్ విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే ఈ నిర్ణయం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన చోట కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లను కూడా ఏర్పాటు చేస్తామని, ఇప్పటికే కొన్ని డివిజన్లకు సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్లు ఇచ్చామని తెలిపారు.
లక్కీ నెంబర్స్ కాదు.. శాస్త్రీయంగా విభజన
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కేవలం అంకెలకు ప్రాధాన్యత ఇవ్వకుండా, క్షేత్రస్థాయిలో సామాన్యుడికి పాలన అందేలా చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. ఇప్పటికే కొన్ని రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై ప్రాథమిక కసరత్తు పూర్తయిందని, త్వరలోనే పూర్తిస్థాయిలో రాష్ట్రవ్యాప్త మార్పులు అమల్లోకి వస్తాయని ఆయన సభకు వివరించారు. ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో తెలంగాణలో పాలనాపరమైన చిక్కులు తొలిగిపోయి, అభివృద్ధి వేగవంతం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.





















