Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Konaseema Gas Blowout : ఇరుసుమండలో ఓఎన్జీసీ పైప్‌లైన్ లీక్‌తో ఎగసిన మంటలు కాస్త తగ్గుముఖం పట్టాయి. త్వరలోనే పూర్తి స్థాయిలో అదుపులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు.

Konaseema Gas Blowout : కోనసీమ వాసులను నిదుర లేకుండా చేసిన ఇరుసుమండ ఓఎన్జీసీ గ్యాస్ బ్లోఔట్ అదుపులోకి వస్తోంది. మలికీపురం మండలంలోని ఇరుసుమండ గ్రామంలో సోమవారం మధ్యాహ్నం ప్రారంభమైన అగ్ని కీలలు స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. అయితే ఓఎన్జీసీ సిబ్బంది, ప్రభుత్వం యంత్రాంగం సమన్వయంతో చేసిన పోరాటం ఫలితంగా మంటలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి.
ఒక వైపు ఆకాశాన్ని అంటేలా ఎగిసిపడుతున్న మంటలు, మరోవైపు భూమి నుంచి వణికించే శబ్దాల మధ్య కోనసీమ వాసులు గడిపిన క్షణాలు వర్ణనాతీతం. ఈ సంక్షోభ సమయంలో ప్రభుత్వం తీసుకున్న తక్షణ నిర్ణయాలు, అత్యాధునిక సాంకేతికత వినియోగం ప్రాణ నష్టాన్ని నివారించడంలో కీలక పాత్ర పోషించాయి.
సాంకేతిక పోరాటం- వాటర్ అంబరిల్లాతో మంటలకు చెక్
మంటలను అదుపు చేసేందుకు ఓఎన్‌జీసీ అధికారులు అత్యంత క్లిష్టమైన వాటర్ అంబరిల్లా సాంకేతికతను వినియోగించారు. మంటలు వ్యాపించకుండా నాలుగు వైపుల నుంచి నీటి గొడుగు ఆకారంలో విరజిమ్మడం ద్వారా ఉష్ణోగ్రతలను తగ్గించే ప్రయత్నం చేశారు.
ఈ ఆపరేషన్ కోసం అవసరమైన భారీ యంత్ర సామగ్రి, పైప్‌లైన్‌లను యుద్ధ ప్రాతిపదికన నరసాపురం నుంచి తరలించారు. అదనంగా మరో పైప్‌ను అమర్చి, మంటలను మరింత త్వరగా ఆర్పివేసే ప్రక్రియను ముమ్మరం చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక నిపుణుల బృందం క్షేత్రస్థాయిలో ఉండి ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు.
ముఖ్యమంత్రి సమీక్ష- బాధితులకు భరోసా
ఈ ప్రమాద తీవ్రతను గమనించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. గ్యాస్ లీకేజీని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలను హోంమంత్రి అనిత, సీఎస్ విజయానంద్ ఆయనకు వివరించారు. ప్రజల రక్షణే ప్రథమ కర్తవ్యంగా ఉండాలని, ఎప్పటికప్పుడు వాస్తవ పరిస్థితులను వివరిస్తూ వారిలో ధైర్యం నింపాలని సీఎం ఆదేశించారు.
ప్రమాదం కారణంగా ఇళ్లు వదిలి వెళ్లిన వారు సమస్య పూర్తిగా తీరే వరకు ఇబ్బందులు పడకుండా చూడాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా మంటల వేడికి దెబ్బ తిన్న కొబ్బరి తోటలకు పరిహారం అందించాలని ఆయన ఆదేశించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాతీయ, అంతర్జాతీయ ఏజెన్సీల సహకారం తీసుకోవాలని, ఓఎన్జీసీతో త్వరలోనే ఒక ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
పునరావాస చర్యలు- క్షేత్రస్థాయి పరిస్థితి
ప్రమాదం జరిగిన వెంటనే సుమారు 500 కుటుంబాలను సురక్షిత ప్రాంతాల్లోకి పునరావాస కేంద్రాలకు తరలించారు. ఈ కేంద్రాల్లో బాధితులకు అవసరమైన ఆహారం, తాగు నీరు, వైద్య సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోంది. వృద్ధులు, గర్భిణులు, పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
పరిస్థితిని పర్యవేక్షిస్తున్న అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రతి నిమిషం అప్‌డేట్స్ తీసుకొంటున్నారని వెల్లడించారు. సోమవారం రాత్రి భద్రతా కారణాల దృష్ట్యా గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రజలకు చీకటిలో భయం భయంగా గడిపారు.
ఓఎన్‌జీసీపై స్థానికుల ఆగ్రహం
మంటలు తగ్గుతున్నప్పటికీ ఓఎన్‌జీసీ వ్యవహార శైలిపై స్థానిక ప్రజాప్రతినిధులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మాట్లాడుతూ... సహజ వాయువు వెలికి తీసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని కానీ ప్రమాదం జరిగినప్పుడు స్థానికులకు కనీసం సమాచారం ఇవ్వకపోవడం ఓఎన్‌జీసీ వైఫల్యమేనని విమర్శించారు. ఓఎన్‌జీసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ స్థాయి ప్రమాదం జరిగిందని ఆరోపించారు.
రైతులకు అపార నష్టం
ఈ బ్లౌఔట్ కారణంగా ఇరుసుమండ గ్రామంలోని వందల కొబ్బరి చెట్లు దగ్ధమయ్యాయి. అలాగే సాగుకు సిద్ధంగా ఉన్న వరి పొలాల్లోని నీరు మంటల వేడికి ఇంకిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పచ్చని కోనసీమలో ఈ నిప్పుల సెగ ఆర్థికంగా కూడా పెద్ద దెబ్బేనని చెప్పవచ్చు.





















