YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
YSRCP Leader Roja: ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయిందని మాజీ మంత్రి రోజా కామెంట్స్ చేశారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకొని కేసులు పెడుతున్నారని ఆరోపించారు.

YSRCP Leader Roja: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విమర్శలు ఎప్పుడు కూడా చాలా హాట్‌హాట్‌గానే ఉంటాయి. అలాంటి హాట్ డిస్కషన్‌లో రోజాలాంటి ఫైర్ బ్రాండ్ విమర్శలు చేస్తే అవి కచ్చితంగా డిబేట్‌కు ఆస్కారం ఇస్తాయి. ఇప్పుడు ఇదే చేశారు మాజీ మంత్రి రోజా నెల్లూరు జిల్లా జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డిని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారామె. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఖాకీ చొక్కాలా? పచ్చ చొక్కాలా?
జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే మీడియాతో మాట్లాడిన రోజా...ప్రస్తుతం పోలీసు వ్యవస్థ తీరు చాలా అసహ్యంగా ఉందని అన్నారు. పోలీసులు ఖాకీ చొక్కాలు వదిలేసి పచ్చ చొక్కాలు ధరిస్తున్నారని అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారులందరూ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌కు భజన బ్యాచ్‌గా తయారైందని ఆరోపించారు.
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఏ స్థాయిలో ఉందో ఏపీ పోలీసులకు వచ్చిన 36వ ర్యాంకే నిదర్శనమని అన్నారు. దీనికైనా సిగ్గు తెచ్చుకోవాలని లేదంటే నీళ్లు లేని బావిలో దూకి చావాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోర్టు ఆదేశాలను సైతం ఖాతు చేయకుండా జైలులో ఉన్న ఖైదీలకు కనీస భోజనం కూడా సరిగా పెట్టడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. " గుర్తుంచుకోండి... మా ప్రభుత్వం మళ్లీ వస్తుంది. అప్పుడు ఈ అధికారులు పదింతలు చెల్లించుకోవాల్సి ఉంటుంది." అని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.
పిన్నెల్లి సోదరులై కక్ష సాధింపు
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడిపై ప్రభుత్వం కక్ష గట్టి వేధిస్తోందని రోజా ఆరోపించారు. టీడీపీ నేతలు బహిరంగంగా హత్యలు, గంజాయి స్మగ్లింగ్, మహిళలపై దాడులు చేస్తున్నా పట్టించుకోని పోలీసులు ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆమె విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం హత్యా రాజకీయం నడుస్తోందని దీనికి టీడీపీనే మూల కారణమని ఆమె విమర్శించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పిన్నెల్లి కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు.
రాయలసీమకు వెన్నుపోటు
రాయలసీమ నీటి ప్రాజెక్టుల విషయంలో కూడా చంద్రబాబు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సీమ వాసులకు వెన్నుపోటు పొడిచారని ఆమె ఆరోపించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ హైదరాబాద్‌లో తన ఆస్తులు కాపాడుకోవడానికి చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. " రాయలసీమకు ఇంత అన్యాయం జరుగుతుంటే పవన్ కల్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారు." అని రోజా ప్రశ్నించారు. అభివృద్ధి శూన్యం అని, కేవలం అప్పులు చేయడంలోనే ఈ ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోందని ఇప్పటి వరకు 3 లక్షల కోట్లు అప్పులు చేసిందని ఆమె లెక్కలు చెప్పారు.
బోగాపురం ఘనత వైఎస్ జగన్‌దే
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తీరుపై కూడా రోజా మండిపడ్డారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి సంబంధించిన క్రెడిట్‌ను దొంగిలించటానికి టీడీపీ ప్రయత్నిస్తోందని రోజా ఆరోపించారు. వాస్తవానికి వైఎస్ జగన్ హయాంలోనే ఎయిర్‌పోర్టు నిర్మాణం వేగంగా జరిగిందని స్వయంగా జీఎంఆర్ కంపెనీయే తెలిపిందని ఆమె గుర్తు చేశారు. 2019లో కుప్పలో చంద్రబాబు వేసిన ఎయిర్‌పోర్టు శిలాఫలకం ఏమైందని ప్రశ్నించారు. రామ్మోహన్ మైకులు ముందు హీరోగా నటిస్తున్నారని , కానీ ఆయన చేసేంది జీరో అని విమర్శించారు.





















