KCR About Chandrababu: హైప్ ఆద్యుడు చంద్రబాబు, బిజినెస్ మీట్స్‌లో వంటవాళ్లతో MOUలు చేసుకున్నాడు: కేసీఆర్
KCR at Telangana Bhavan | హైప్ ఆద్యుడు చంద్రబాబు అని పెట్టుబడుల కోసం విశాఖలో బిజినెస్ మీట్స్ పెట్టి వంటవాళ్లతో MOUలు చేసుకున్నాడని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎద్దేవా చేశారు.

హైదరాబాద్: తెలంగాణలో గత రెండేళ్లుగా రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా తప్పా ఏమీ లేదని మాజీ సీఎం కేసీఆర్ విమర్శించారు. హైప్ ఆద్యుడు ఏపీ సీఎం చంద్రబాబు అని, విశాఖలో జరిగిన సదస్సులో వంటవాళ్లతో ఎంఓయూలపై సంతకాలు చేయించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చెప్పే లెక్కలు నిజమైతే ఇప్పటికే ఏపీలో 20 లక్షలకు పైగా కోట్లు పెట్టుబడులు ఉండేవన్నారు. కేసీఆర్ తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. ‘గతంలో తొలి ప్రధాని నెహ్రూ హయాంలో కొన్ని రాష్ట్రాల్లో ఐడీపీఎల్ పెట్టారు. మనకు హైదరాబాద్‌లో ఐడీపీఎల్ వచ్చింది. డాక్టర్ అంజిరెడ్డి కూడా అక్కడి ఉద్యోగే. తరువాత కాలంలో హైదరాబాద్ ఫార్మా హబ్ అయింది. ప్రపంచంలో మూడింటి ఒకటో వంతు హైదరాబాద్ జినోమ్ వ్యాలీ నుంచి వ్యాక్సిన్ సరఫరా అవుతుంది. 400 ఏళ్ల చరిత్ర ఉన్న నగరం ఇది. కాలక్రమేణా పలు రంగాల్లో అభివృద్ధి చెందింది.
సీఎస్ శాంతికుమారి నేతృత్వంలో ఐఏఎస్ అధికారులను ప్రపంచ వ్యాప్తంగా పంపించి మందుల వేస్టేజ్ ను డిస్పోజ్ చేయడంపై అధ్యయనం చేశాం. మన దేశంలో పొగ, దుమ్ము, వ్యర్థాలు వస్తాయి. హైదరాబాద్ ను ఫార్మా లేకుండా చూడలేం. ఆ ఎకో సిస్టమ్ కాపాడాలి. జీరో లిక్విడ్ అయ్యేలా చర్యలు చేపట్టాం. అమెరికా, యూరప్ దేశాల్లో ఇదే చేస్తున్నారు. దాంతో ముచ్చర్ల వద్ద ఉన్న ఫార్మా సిటీ కోసం హెలికాప్టర్లో తీసుకుని వెళ్లి చూపించి ఫిక్స్ చేశాం. 14 వేల ఎకరాలను ఫార్మా సిటీ కోసం సిద్ధం చేశాం. జీడిమెట్ల, ఐడీపీఎల్ ప్రాంతాల్లోని కంపెనీలు సైతం ఫార్మా సిటీకి వస్తామని అంగీకరించాయి. అన్ని మౌలిక వసతులు కల్పించేలా తీర్చిదిద్దే ప్రయత్నం చేసి, వాటి పక్కనే మెడికల్ కాలేజీ కూడా పర్మిషన్ ఇచ్చాం.
నేడు రియల్ ఎస్టేట్ చేస్తూ అన్నీ అమ్ముకుంటున్నారు. ఫ్యూచర్ సిటీ లేదు. తొక్కసిటీ లేదు. ఎవడికి కావాలి ఇది. హైదరాబాద్ శతాబ్దాల చరిత్ర ఉన్న నగరం. నువ్వు ఈరోజు వచ్చి సిటీ చేస్తావా. కర్ణాటకకు బెంగళూరు, ముంబైకి మహారాష్ట్ర, బెంగాల్‌కు కోల్‌కతా, తమిళనాడుకు మద్రాస్ ఉంది. దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఇలాంటి నగరాలు ఎందుకు సాధ్యం కాలేదు. దిక్కుమాలిన పాలసీలు. రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ తప్ప చేసిందేమీ లేదు.
గురుకులాల్లో 120 మంది విద్యార్థులు చనిపోయారు. తేలివి లేదా. నియంత్రణ లేదా, చర్యలు తీసుకోవడం చేత కాదా మీకు. ఫార్మా సిటీ అంటే దానికి మాత్రమే భూములు వాడాలి. 3000 ఎకరాలతో జూపార్క్ అక్కడ పెడతారా. జూపార్క్ భూములు అమ్మే కుట్ర జరుగుతోంది. మేం అధికారంలో ఉన్నప్పుడు ఇంత చిల్లరపనులు చేయలేదు.

వంటవాళ్లతో ఎంఓయూలు చేసుకున్న చంద్రబాబు..
బిజినెస్ మీట్ ఏ ప్రభుత్వమైనా పెట్టాలి. కానీ లెక్కపత్రం లేని అడ్డగోలు ఒప్పందాలతో నాటకాలు చేస్తారు. లేనిపోని హైప్ తీసుకొస్తారా. దీనికి ఆద్యుడు ఆయన గురువు చంద్రబాబు. ఏపీ సీఎం చెప్పే ఎంఓయూల లెక్కలు నిజమైతే ఆ రాష్ట్రానికి ఇప్పటికే వచ్చిన పెట్టుబడుల విలువ రూ.20 లక్షల కోట్లు దాటిపోతాయి. ఫస్ట్ టైం నవ్యాంధ్ర సీఎంగా చంద్రబాబు విశాఖలో సీఐఐ సమ్మిట్ నిర్వహిస్తే ఎంఓయూలు చేసుకున్నది స్టార్ హోటల్స్ లో పనిచేసే వంటవాళ్లు. హోటల్ సప్లయర్లు వచ్చి సంతకాలు పెట్టారు. ఆ పెట్టుబడులు ఎక్కడికిపోయాయి. పది లక్షల కోట్లు అని ప్రచారం చేసుకుంటాడు.

మధ్యప్రదేశ్ సీఎంగా శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నప్పుడు భోపాల్ లో సమ్మిట్ కు రావాలని కోరితే వెళ్లాను. పరిశ్రమలశాఖ మంత్రి వచ్చి మీ అబ్బాయి హడావుడి చేస్తున్నాడు ఒప్పందాలు చేసుకుంటున్నారని చెప్పారు. మీరు కూడా బాగా చేయండన్నాను. ఆమె వసుంధర రాజే చెల్లెలు. 2, 3 నెలల ముందే మోదీ వచ్చి 14 లక్షల కోట్లు వచ్చాయన్నారు. మీకేం ఇబ్బంది అని అడిగితే అదంతా గ్యాస్, బోగస్ సార్ అని ఆమె చెప్పారు. ఆ ఇన్వెస్టిమెంట్స్ నిజంగా వస్తే పరిశ్రమలు వస్తాయి. రాష్ట్ర జీడీపీ పెరిగి అభివృద్ధి జరుగుతుంది. మొన్న తెలంగాణలో 5.7 లక్షల కోట్లు అని చెప్పి ప్రజలను ఎంతకాలం మోసం చేస్తారు.
సాఫ్ట్‌వేర్ ఎగుమతులు భారీగా పెంచాం..
మేం అధికారంలోకి వచ్చినప్పుడు హైదరాబాద్ నుంచి సాఫ్ట్ వేర్ ఎగుమతులు 57 వేల కోట్లు ఉంటే మేం దాన్ని 2.47 లక్షల కోట్లకు పెంచాం. గాల్లో మాటలు చెప్పలేదు, బిజినెట్ మీట్స్ కూడా పెట్టలేదు. వాస్తవాలు చెబితే నమ్మకంగా వ్యాపారవేత్తలు వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు. ఫాక్స్‌కాన్ కంపెనీని హైదరాబాద్‌కు తీసుకొస్తే మా పాలసీ బాగుందని మెచ్చుకున్నారు. మహారాష్ట్ర వాళ్లు వచ్చి 3000 కోట్లు ఎదురిస్తామని చెప్పి వాళ్లు ఫాక్స్ కాన్ తీసుకుపోయారు.
రియల్ ఎఫర్ట్ పెడితే కంపెనీలు కొన్నయనా వస్తాయి. హైప్ చేసి ప్రజలను మోసం చేస్తే ఆత్మవంతన తప్ప ఏం ఉండదు. మహళలకు ఇస్తామన్న రూ.2500 ఇవ్వలేదు. కానీ కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తారా మీరు. మేం చేసిన అభివృద్ధిలో ఇప్పుడు సగం కూడా లేదు. మేం ఎప్పుడూ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచలేదు. వాళ్లనే రిటర్న్ పిలిచి మీకు ఏం కావాలని అడిగాను’ అని కేసీఆర్ తెలిపారు.






















