Telangana IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు- యువతకు ప్రాధాన్యత ఇస్తూ కీలక శాఖల్లో మార్పులు!
Telangana IAS Transfers: తెలంగాణలో పాలన మరింత పరుగులు పెట్టించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కీలకమైన శాఖలతోపాటు జిల్లా కలెక్టర్లుగా యువతకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది.

Telangana IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 45 మంది అధికారులకు ట్రాన్స్‌ఫర్ చేస్తూ రాత్రి ఆదేశాలు జారీ చేసింది. అర్థరాత్రి దాటిన తర్వాత ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు.
కీలక శాఖల్లో మార్పులు
ప్రభుత్వం జిల్లా యంత్రాంగంలో మార్పులతోపాటు కీలక శాఖల్లో ఉన్న అధికారులను కూడా ట్రాన్స్‌ఫర్ చేసింది ప్రభుత్వం. ఇప్పటి వరకు పరిశ్రమల, ఐటీ శాఖ స్పెషల్ సెక్రటరీగా ఉన్న సంజయ్‌కుమార్‌ను పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు మార్చారు. పంచాయతీ రాజ్ శాఖలో ఉన్న శ్రీధర్‌ను ఐటీ, పరిశ్రమల ప్రిన్సిపల్ సెక్రటరీగా తీసుకొచ్చారు. దీంతోపాటు మైనింగ్, జియాలజీ శాఖ బాధ్యతలను ఆయనకు అదనంగా కేటాయించారు. రాహుల్‌బొజ్జాను సాగునీటి శాఖనుంచి సాధారణ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేశారు. ఆయనకు బీసీ సంక్షేమ శాక అదనపు బాధ్యతలను అప్పగించారు. ఆ శాఖ బాధ్యతలు చూస్తున్న ఈ శ్రీధర్‌ను సాగునీటి పారుదల శాఖకు మార్చారు.
ఆర్థిక, విద్యుత్ శాఖల్లో మార్పులు
ప్రభుత్వానికి అత్యంత కీలకమైన ఆర్థిక శాఖలో కూడా మార్పులు చేపట్టారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కోఆర్డినేషన్ సెక్రటరీగా ఉన్న గౌరవ్ ఉప్పల్‌ను ఆర్థిక, ప్రణాళిక శాఖ సెక్రటరీగా బదిలీ చేశారు. ఆయనకు తెలంగాణ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. విద్యుత్ రంగంలో సంస్కరణల్లో భాగంగా ముషార్ అలీ ఫరూఖీని కొత్తగా ఏర్పాటు చేయనున్న మూడో డిస్కిమ్‌కు సీఎండీగా నియమించారు. జితేష్ వి. పాటిల్‌ను టీజీఎస్పీడీసీఎల్ సీఎండీగా నియమించారు.
జిల్లా కలెక్టర్లకు స్థాన చలనం
ప్రభుత్వంలోని కీలక శాఖల్లోనే కాకుండా జిల్లా కలెక్టర్లను కూడా ప్రభుత్వం మార్చింది. పది జిల్లాలకుపైగా కలెక్టర్లకు ట్రాన్స్‌ఫర్ చేసింది. జిల్లా యంత్రాంగంలో యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌గా విజియేంద్ర స్థానంలో కుష్బూ గుప్తాను నియమించింది. కరీంనగర్‌కు పమేలా సత్పతి స్థానంలో కొత్త కలెక్టర్‌గా చిత్రా మిశ్రాకు బాధ్యతలు అప్పగించారు. యాదాద్రి భువనగిరికి హనుమంతురావు స్థానంలో అనురాగ్ జయంతిని తీసుకొచ్చారు. మెదక్ జిల్లాకు రాహుల్ రాజ్ స్థానంలో ప్రతిమ సింగ్‌ను తెచ్చారు. హన్మకొండ జిల్లా కలెక్టర్‌గా స్నేహ శబరీష్‌ను బదిలీ చేసి చాహత్ బాజ్‌పాయ్‌కి ఛాన్స్ ఇచ్చారు. వికారాబాద్‌లో ప్రతీక్ జైన్ స్థానంలో దీపక్ తివారీని నియమించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌గా అంకిత్‌ను జితేష్ వి పాటిల్ స్థానంలో తెచ్చారు. నారాయణపేట జిల్లాకు సిక్తా పట్నాయక్ స్థానంలో ప్రతీక్‌జైన్‌ను బదిలీ చేశారు.
ప్రజావాణికి యువ అధికారులు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే ప్రజావాణి కార్యక్రమానికి స్టేట్ నోడల్ ఆఫీసర్‌గా డి. దివ్యను నియమించారు. అదనపు నోడల్ ఆఫీసర్‌గా ఎం సురేందర్ బాధ్యతలు నిర్వర్తిస్తారు. గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా సంతోష్‌బిఎంను దేవాదాయ శాఖ డైరెక్టర్‌గా ఎం. హనుమంత రావును ప్రభుత్వం నియమించింది. ఆయనకు గోదావరి పుష్కరాల స్పెషల్ ఆఫీసర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది.























