Sircilla Latest News: నిమ్మకాయల బాబా నిజస్వరూపం-కేటుగాడే కాదు ఆటగాడు కూడా...
Sircilla Latest News: పూజల పేరుతో మహిళలను వేధించే ఫేక్ బాబాను సిరిసిల్ల పోలీసులు అరెస్టు చేశారు. రిమాండ్‌కు తరలించారు. అతని వద్ద నుంచి బాధితుల వీడియోలు స్వాధీనం చేసుకున్నారు.

Sircilla Latest News: ఎన్ని మోసాలు జరుగుతున్నా ఎంతమంది మోసపోతున్నా బాబాలపై నమ్మకాలు చచ్చిపోవడం లేదు. అందుకే దీన్నే అవకాశంగా తీసుకుంటున్న కేటుగాళ్లు బాబాల అవతారంలో జనాలను నిలువు దోపిడీ చేస్తున్నారు. అలాంటి ఘటన సిరిసిల్లా జిల్లాలో వెలుగు చూసింది. నిమ్మకాయలతో ఆరోగ్యాలు బాగు చేస్తానని చెప్పే ఓ బాబా మోసాలకు పోలీసులు చెక్ పెట్టారు.
ఆర్థిక, వ్యక్తిగత, మానసిక, ఆరోగ్య సమస్యలు నయం చేస్తామంటూ వేములవాడకు చెందిన ఓ వ్యక్తి బాబా అవతారం ఎత్తాడు. బాపు స్వామి పేరుతో స్థానికంగా ప్రజలను తన వద్దకు రప్పించుకొని మోసాలకు పాల్పడేవాడు.
ఈ బాపు స్వామి నిజస్వరూపం తెలియని ప్రజలు అమాయకంగా నమ్మారు. ఆ నమ్మకాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్నాడు బాపు స్వామి. పూజలు చేసి సమస్యలు లేకుండా చేస్తామని చెప్పి మహిళలను లోబరుచుకుంటున్నాడు. మంత్రించిన నిమ్మకాయలు ఇస్తే అన్నీ నయం అవుతాయని నమ్మించి మోసాలకు పాల్పడ్డాడు.
ప్రత్యేక పూజలు పేరుతో నిమ్మకాయలను ఇచ్చేవాడు. అందులో ఎవరికీ తెలియకుండానే మత్తుమందు చల్లేవాడు. దాని వాసన పీల్చే మహిళలు స్పృహతప్పి పడిపోయేవాళ్లు. అలాంటి వాళ్లపై లైంగిక దాడులకు పాల్పడేవాడు ఈ బాబా.
ఆ దృశ్యాలను రికార్డు చేసి బాధితులను బ్లాక్ మెయిల్ చేసేవాడీ బాబా. చాలా మంది బాబా బాధితులు భయంతోనో వేర్వేరు కారణాలతో నోరు విప్పేందుకు భయపడేవాళ్లు. అయినా కొందరు పోలీసులు ఫిర్యాదు చేశారు.
బాధితుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిఘా పెట్టారు. దొంగబాబాను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతని వద్ద సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. అందులో వందల మంది మహిళల వీడియోలు ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో బాబాను అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్‌కు తరిలించారు. ఇలాంటి బాబాలను అసలు నమ్మొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

