Vijay Deverakonda: ఇల్లీగల్ ప్రచారం చేయలేదు... ఇప్పుడు ఆ కంపెనీతో సంబంధం లేదు... బెట్టింగ్ యాప్స్ కేసుపై విజయ్ దేవరకొండ టీమ్
Betting Apps Case: బెట్టింగ్ యాప్స్ కేసులో విజయ్ దేవరకొండ పేరు రావడంతో ఆయన టీం స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. చట్ట ప్రకారం నిర్వహిస్తున్న స్కిల్ బేస్డ్ గేమ్స్‌కు తమ హీరో ప్రచారం చేశారని పేర్కొంది.

బెట్టింగ్ యాప్స్ కేసు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోంది. యువతలో క్రేజ్ ఉన్న హీరో హీరోయిన్లు మ్యాచో స్టార్ రానా దగ్గుబాటి, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నిధీ అగర్వాల్ సహా మొత్తం పాతిక మంది మీద కేసులు పెట్టారు తెలంగాణ పోలీసులు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండకు చెందిన టీం ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది.
విజయ్ ఇల్లీగల్ యాప్స్ కోసం ప్రచారం చేయలేదు!
బెట్టింగ్ యాప్స్ కోసం విజయ్ దేవరకొండ ఎప్పుడు ప్రచారం చేయలేదు అని ఆయనకు చెందిన పీఆర్ టీం పేర్కొంది. చట్ట ప్రకారం వ్యవహరించే కంపెనీలకు మాత్రమే ఆయన ప్రచారం చేశారని, అది కూడా అనుమతి ఉన్న ప్రాంతాలలో ఆన్ లైన్ స్కిల్ బెస్ట్ గేమ్స్ యాప్ కోసం మాత్రమే ప్రచారం చేశారని వివరించింది.
ఏ 23 అనే సంస్థకు చెందిన రమ్మీ గేమ్ యాప్ కోసం విజయ్ దేవరకొండ ప్రచారం చేశారు. అయితే ఆ సంస్థతో చేసుకున్న ఒప్పందం గత ఏడాదితో ముగిసిందని ఆయన టీం తెలియజేసింది. ప్రస్తుతం ఆ సంస్థతో విజయ్ దేవరకొండకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.
చట్ట ప్రకారం నిర్వహిస్తున్నారా? లేదా? వెరిఫై చేశాక!
విజయ్ దేవరకొండ ఏ సంస్థకు ప్రచారం చేసినా, ఎటువంటి వాణిజ్య ప్రకటనలు చేసినా... సదరు సంస్థను చట్ట ప్రకారం నిర్వహిస్తున్నారా లేదా అనేది క్షుణ్ణంగా పరిశీలిస్తామని ఆయన టీం వివరించింది. రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని గతంలో సుప్రీంకోర్టు పలుమార్లు తెలియజేసినట్లు విజయ్ దేవరకొండ టీం గుర్తు చేసింది.
అనుమతి ఉన్న కంపెనీ కనుక ఏ 23 సంస్థకు విజయ్ దేవరకొండ ప్రచారకర్తగా పనిచేశారని, బెట్టింగ్ యాప్స్ కోసం విజయ్ దేవరకొండ ప్రచారం చేశాడన్నది పూర్తిగా అవాస్తవం అని, పలు పుకార్ల షికార్ల చేస్తున్న నేపథ్యంలో తాము ఈ వివరణ ఇవ్వవలసి వచ్చిందని విజయ్ దేవరకొండ టీం పేర్కొంది. తమ హీరో ప్రచారం చేసిన యాప్స్ చట్ట ప్రకారం నిర్వహించినవేనని తెలియజేసింది. సామాజిక మాధ్యమాలతో పాటు కొన్ని మీడియా సంస్థల్లో ప్రసారం అవుతున్న వార్తలలో ఎటువంటి నిజం లేదని, విజయ్ దేవరకొండ చట్ట ప్రకారం కాకుండా అనైతికంగా పనిచేస్తున్న ఏ సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరించలేదని వివరించింది.
Press Release
— Suresh PRO (@SureshPRO_) March 20, 2025
This is to inform the public and all concerned parties that Mr. Vijay Deverakonda had officially entered into a contract with a company solely for the limited purpose of serving as a brand ambassador for skill-based games. His endorsement was strictly confined to…
తెలంగాణ పోలీసులు బెట్టింగ్ యాప్స్ కేసు విచారణను వేగవంతం చేశారు. పాతిక మంది సెలబ్రిటీల మీద కేసులు నమోదు చేయడంతో పాటు సదరు తారలను విచారణకు పిలుస్తున్నారు. యాంకర్ కం ఆర్టిస్ట్ విష్ణు ప్రియ భీమనేని ఈ రోజు (మార్చి 20, గురువారం) విచారణకు హాజరైంది. రాబోయే రోజుల్లో మరింత మంది విచారణకు హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
Also Read: ప్రకాష్ రాజ్... శ్యామల... బెట్టింగ్ యాప్స్ కేసులో జనసైనికుల టార్గెట్ వీళ్ళిద్దరే!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

