UPI Payments: యూపీఐలో 'పేమెంట్ రిక్వెస్ట్' పద్ధతికి చెల్లుచీటీ! - ఆన్‌లైన్ మోసాలకు అడ్డుకట్ట
Unified Payments Interface: వ్యాపారులు, తమ కస్టమర్లకు చెల్లింపు అభ్యర్థన పంపి డబ్బు వసూలు చేసే విధానాన్ని రద్దు చేయాలని, తద్వారా మోసపూరిత లావాదేవీలను తగ్గించాలన్నది లక్ష్యం.

Collect or Pull Request Option In UPI: నానాటికీ పెరిగిపోతున్న ఆన్‌లైన్ మోసాలను అరికట్టడానికి 'యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్' (UPI)లో మార్పులు చేయాలని 'నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' (NPCI) భావిస్తోంది. వ్యాపారి చెల్లింపుల కోసం ఉపయోగించే 'కలెక్ట్ లేదా పుల్ రిక్వెస్ట్' (Collect or Pull Request) లావాదేవీలను దశలవారీగా నిలిపివేయాలని యోచిస్తోందని సమాచారం.
'కలెక్ట్ కాల్' లావాదేవీలను ఎందుకు రద్దు చేస్తున్నారు?
'కలెక్ట్ కాల్'ను 'పుల్ పేమెంట్' అని కూడా పిలుస్తారు. సాధారణంగా, ఏదైనా వస్తువు కొన్నప్పుడు వినియోదారుడు యూపీఐ యాప్‌లో మర్చంట్ ఫోన్ నంబర్ నమోదు చేసి గానీ, అక్కడ ఉన్న QR కోడ్‌ను స్కాన్ చేసి గానీ డబ్బు చెల్లిస్తుంటారు. దీనిని 'పుష్' లావాదేవీ అంటారు. దీనికి విరుద్ధంగా, కొన్నిసార్లు, వ్యాపారే తనకు రావలసిన మొత్తాన్ని తన యూపీఐ యాప్‌లో ఎంటర్ చేసి, దానిని ఒక లింక్ లేదా QR కోడ్ రూపంలో కస్టమర్‌కు పంపుతారు. ఆ లింక్‌పై క్లిక్ చేసినా లేదా ఆ QR కోడ్‌ను స్కాన్ చేసినా, నిర్దిష్ట మొత్తం వినియోగదారుడి బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అవుతుంది. ఈ పద్ధతిలో మర్చంట్ నుంచి పేమెంట్ రిక్వెస్ట్ వస్తుంది, దీనిని 'కలెక్ట్ కాల్'ను 'పుల్ పేమెంట్' అని పిలుస్తారు. అయితే, పుల్ రిక్వెస్ట్‌ల్లో ఉన్న వెసులుబాటును సైబర్ నేరగాళ్లు (Cyber criminals) ఉపయోగించుకుని, ప్రజలకు మోసపూరిత లింక్‌లు పంపి డబ్బు కాజేస్తున్నారు. పుల్ రిక్వెస్ట్‌ను మోసగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు కాబట్టి NPCI ఆ లావాదేవీ పద్ధతిని రద్దు చేసే యోజన చేస్తోంది.
'పుష్' లావాదేవీలు సురక్షితం
'పుల్' బదులు 'పుష్' లావాదేవీల వైపే NPCI మొగ్గు చూపుతోంది. ఈ పద్ధతిలో వినియోగదారులే స్వయంగా QR కోడ్‌లను స్కాన్ చేయడం ద్వారా ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయడం వంటి సురక్షిత పద్ధతులను ఉపయోగించి చెల్లింపులు చేస్తారు. ఇది భద్రతను పెంచుతుంది. వినియోగదారుల ఖాతాల నుంచి అన్యాయంగా డబ్బు గుంజాలన్న సైబర్ నేరస్తులు లేదా మోసపూరిత వ్యాపారుల కుతంత్రాలు పని చేయవు. ఫలితంగా UPI పుల్ రిక్వెస్ట్ మోసాలు గణనీయంగా తగ్గుతాయి.
డిజిటల్ చెల్లింపులలో పెరుగుతున్న మోసాలు
డిజిటల్ చెల్లింపుల్లో పెరుగుతున్న మోసం కేసుల వల్ల పుల్ లావాదేవీలను దశలవారీగా నిలిపివేయాలనే నిర్ణయం తీసుకోబోతున్నారు. 2024-25 (FY25) ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో, కార్డ్ & డిజిటల్ బ్యాంకింగ్‌లో 13,133 మోసం కేసులు నమోదయ్యాయని, ప్రజలు రూ. 514 కోట్ల నష్టపోయారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డేటా చూపిస్తోంది. FY24లో 29,000 పైగా డిజిటల్ బ్యాంకింగ్ స్కామ్ కేసులు నమోదయ్యాయి, మోసగాళ్ళు రూ. 1,457 కోట్లు దోచుకున్నారని RBI డేటా వెల్లడించింది.
ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషణ
పుల్ రిక్వెస్ట్‌ను రద్దు చేసినప్పటికీ, వ్యాపారులు అన్ని రకాల UPI చెల్లింపులను ఉపయోగించుకునేలా NPCI ప్రత్యామ్నాయ విధానాలను పరిశీలిస్తోంది. దీనికి, పేమెంట్ అగ్రిగేటర్లు & బ్యాంకుల వద్ద మరిన్ని ధృవీకరణలు అవసరం కావచ్చు. అయితే, ఈ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

