Seethakka: బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుపై బీఆర్ఎస్ నేతలకు మంత్రి సీతక్క స్ట్రాంగ్ కౌంటర్, బీజేపీపై సంచలన ఆరోపణలు
BC Reservation Bill | బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుపై బీఆర్ఎస్ నేతలు పూటకో మాట మారుస్తున్నారని, బీజేపీ అయితే ఏకంగా ప్రభుత్వాలకు వెన్నుపోటు పొడుస్తుందని మంత్రి సీతక్క ఆరోపించారు.

Telangana Assembly Sessions | హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుపై బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ నేతల తీరు అపరిచితుడు సినిమాలా కనిపిస్తుందని సెటైర్లు వేశారు. ఉదయం రాము.. రాత్రి రేమోగా మారినట్లుగా బీఆర్ఎస్ నేతల వ్యవహార శైలి ఉందన్నారు. ఉదయం పూట రిజర్వేషన్ల పెంపు బిల్లుకు సంపూర్ణ మద్దతూ ప్రకటించిన బిఆర్ఎస్ సాయంత్రం కాగానే సన్నాయి నొక్కులు నొక్కుతోందన్నారు.
ఈటలపై కోపంతో ముదిరాజ్ లకు టికెట్ ఇవ్వని బీఆర్ఎస్
ఈటెల రాజేందర్ పైన కోపంతో ముదిరాజులకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణనకి బీఆర్ఎస్ మొదటి నుండి వ్యతిరేకమే. పదేళ్లు అధికారంలో ఉండి మైనార్టీ, ఎస్టీ రిజర్వేషన్లను పెంచలేదు. ఎన్నికల సమయంలో అధికారం కోల్పోయే ముందు ఎస్టీ రిజర్వేషన్లను పెంచినట్లు డ్రామా చేశారు. దివంగత ప్రధానులు రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేశారు. కానీ అలాంటి నేతలు రిజర్వేషన్లకు వ్యతిరేకమని బీఆర్ఎస్ అవాస్తవాలు ప్రచారం చేస్తోంది. రాహుల్ గాంధీ ఆలోచన విధానంతో కులగణన చేపట్టాం. దానిపై ముందుకు సాగుతున్నాం. అన్ని రకాల న్యాయ నిపుణులు సలహాలు సూచనలు తీసుకున్న అనంతరం తెలంగాణలో కులగణన చేశాం’ అని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
బిజెపి బీసీ వ్యతిరేకి
బీఆర్ఎస్ తో పాటు బిజెపి వాళ్ళు ఇది సాధ్యం కాదని అంటున్నారు. బీసీ రిజర్వేషన్ సాధ్యం కాదని మొన్న ఈటెల రాజేందర్ మాట్లాడుతూ అన్నారు. అంటే బీజేపీ నేతలు ముందే ప్రిపేర్ అవుతున్నారు. జనాభా ప్రాతిపదికన బడుగు బలహీనర్గాలకు అవకాశం కల్పించాలని రాహుల్ గాంధీ చెప్పారు. బీసీ కుల గణన చేపట్టిన కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఎన్డీయే ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని మోదీకి రేవంత్ లేఖ
తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ పెంపు బిల్లును కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. తెలంగాణ శాసనసభ సోమవారం నాడు బీసీ రిజర్వేషన్ పెంపు బిల్లును ఆమోదించింది. ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని, కానీ అది కేంద్రం పరిధిలో ఉందని.. చట్ట సవరణ బాధ్యత కేంద్రానిదే అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. బీసీలకు విద్య, ఉద్యో, రాజకీయ అంశాల్లో 42శాతం రిజర్వేషన్ కల్పించాలన్నది తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశం అని చెబుతున్నారు. దీనిపై ప్రధాని మోదీని కలిసి బీసీలకు న్యాయం చేయాలని రేవంత్ రెడ్డి కోరనున్నారు. ఈ మేరకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని కోరుతూ ప్రధానికి రేవంత్ లేఖ రాశారు. రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఆమోదముద్ర వేయాలి. లేకపోతే రిజర్వేషన్ అమలు చేయడం వీలుకాదు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

