Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Andhra Pradesh Farmers : ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాతను వానలు నిండా ముంచేశాయి. పంట చేతికి వచ్చేసరికి బందిపోటు దొంగల్లా వస్తున్న అల్పపీడనాలు బతకనీయడం లేదు.
Andhra Pradesh News: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రజల్లో భాయాందోళనలు కలిగిస్తోంది. ముఖ్యంగా రైతులను మరింత టెన్షన్ పెడుతోంది. ఇప్పటికే రెండు రోజుల నుంచి తేలికపాటి జల్లులు పడుతున్నాయి. రేపు ఎల్లుండి బారీ వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ అంచనాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.
ఈ ఏడాది పంట బాగా పండిందని మురిసిపోతున్న ఆంధ్రప్రదేశ్ అన్నదాత ఆనందంపై నీళ్లు చల్లుతున్నాయి వరుస అల్పపీడనాలు. ప్రకృతి పగబట్టిందా అన్నట్టు రైతును నట్టేటముంచుతున్నాయి. నెల రోజుల్లోనే మూడు వాయుగుండాలు బతుకుల్లో సునామీ సృష్టిస్తున్నాయి. అటు శ్రీకాకుళం జిల్లా నుంచి ఇటు చిత్తూరు జిల్లా వరకు అదే పరిస్థితి కనిపిస్తోంది.
సంక్రాంతి నాటికి సిరుల పంటను ఇంటికి తీసుకెళ్దామని ఆనందపడుతున్న రైతులకు నిరాశ మిగిలింది. మూడు రోజుల నుంచి అల్ప పీడనం కారణంగా కురుస్తున్న చిరు జల్లులు నిండా ముంచేశాయి. కోతకు సిద్ధంగా ఉన్న పంటను పడుకోబెట్టేశాయి. కొన్ని ప్రాంతాల్లో కోసిన పంట ఎందుకూ పనికి రాకుండా పోతోంది. వరి పనులు నీటిలోనే నానుతున్నాయి. వాటిని ఏం చేయాలో అర్థంకాక ఆకాశం వంక చూస్తున్నారు రైతులు, వారం పది రోజులు గ్యాప్ ఇస్తే కాస్త కూస్తైనా పంట చేతికి వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. లేకుంటే మొత్తానికే పంటను వదులుకోవాల్సి వస్తుందని వాపోతున్నారు.
ఒకట్రెండు రోజులు కాదు నెల రోజుల నుంచి ఎండ మొహం చూసింది లేదని రైతులు అంటున్నారు. ఆకాశం మేఘావృతమై ఉంటోందని దీని వల్ల పొలం పనులు ముందుకు సాగడం లేదని వాపోతున్నారు. కొందరు రైతులు ధైర్యం చేసి కోత కోసినప్పటికీనూర్పిడి చేసే టైం వర్షాలు ఇవ్వలేదు. పంటలు కుప్ప వేసే లోపు వర్షాలు దంచి కొడుతున్నాయి. మరికొందరు ఏదైతే అది కానీ అని పొలాల్లోనే పంటను వదివలేస్తున్నారు.
వరి పంట పరిస్థితి ఇలా ఉంటే పత్తి, మొక్కజొన్న, మిగతా పంటలు మరింత దారుణంగా ఉన్నాయి. కంది, శనగ పూత దశలో ఉందని ఇప్పుడు వర్షాలు పడుతున్నందున ఆ పంట చేతికి అందే పరిస్థితి లేదని వాపోతున్నారు. ఇప్పటికే పత్తి యాభై శాతానికిపైగా ఇటీవల కురిసిన వర్షాలకు పాడైపోయిందని అంటున్నారు. తీత దశలో ఉన్న టైంలో మళ్లీ వర్షాలు అంటే పూర్తిగా ఆ పంట వదులుకోవాల్సిందేనంటున్నారు. ఇప్పటికే దెబ్బతిన్న పొగాకు ఇంకా వర్షాలు పడితే ఆకు రంగు మారిపోతుందని అంటున్నారు.
కళ్లముందే పంటలు నీళ్లపాలువుతుంటే ఏం చేయలేక అల్లాడిపోతున్నారు రైతులు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో హడావిడిగా పంట నూర్పిడిలు చేసి కోత కోసి సురక్షిత ప్రాంతాలకు తరలించేస్తున్నారు. ఉత్తరాంధ్రలో ఆ పరిస్థితి లేకుండా పోయింది. రైతులకు సరైన వసతులు లేకపోవడం కూడా ఆందోళన కలిగిస్తోంది.
రైతులకు అండగా ఉంటామని టీడీపీ నేతలు ధైర్యం చెబుతున్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు పంట నీట మునిగి ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, ఇతర టీడీపీ నేతలు పర్యటిస్తున్నారు. పొలాల్లో తిరుగుతూ రైతులకు భరోసా ఇస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అధైర్య పడొద్దని చెబుతున్నారు. పంట నష్టపోయిన వారికి పరిహారం ఇప్పించే ప్రయత్నాలు కూడా చేస్తామని అంటున్నారు. నీటిలో తడిసిన ధాన్యం మొలకలు రాకుండా ఉండేందుకు ఉప్పు నీటిని పిచికారి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.