Indian Currency: డాలర్‌తో రూపాయి మారకం విలువ అంటే ఏంటి, విలువను ఎలా నిర్ణయిస్తారు?
Exchange Rate: రూపాయి విలువ పడిపోవడం ఆర్థికంగానే కాకుండా సామాజికంగా, రాజకీయంగా కూడా తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. ప్రభుత్వం సరైన విధానాలను అమలు చేయకపోతే దేశ ఆర్థిక పరిస్థితిని బలహీనపరుస్తుంది.
USD To INR Exchange Rate: ప్రస్తుతం, అమెరికన్ డాలర్ భారీగా బలపడింది, భారతదేశ రూపాయి మారకం విలువ జీవిత కాల కనిష్టానికి పతనమైంది. రూపాయి నాణేనికి బొమ్మ-బొరుసు లాగా, కరెన్సీ విలువ పతనాన్ని ప్రతికూలాంశంగానూ చూడొచ్చు, లేదా సానుకూల పరిణామంగానూ భావించొచ్చు. రూపాయి విలువ పడిపోయినప్పుడు, దిగుమతి చేసుకున్న వస్తువులు మరింత ఖరీదుగా మారతాయి. అదే సమయంలో ఎగుమతిదారులకు అవకాశాలు పెరుగుతాయి. అధిక మార్కెట్ హెచ్చుతగ్గులను నివారించడానికి రిజర్వ్ బ్యాంక్ (RBI) జోక్యం అవసరం. అయితే, కేంద్ర బ్యాంక్ జోక్యం వల్ల ప్రయోజనాలతో పాటు దీర్ఘకాలిక చిక్కులు కూడా ఉంటాయి.
రూపాయి మారకం విలువ పడిపోవడం అనేది ఒక సంక్లిష్ట సమస్య. ఇది ఆర్థికపరంగా మాత్రమే ముఖ్యం కాదు, ప్రపంచ మార్కెట్‌లో దేశం ప్రతిష్ట & స్థానంపైనా ప్రభావం చూపుతుంది. భారతదేశం బలమైన, స్థిరమైన ఆర్థిక భవిష్యత్తు వైపు పయనించడానికి రూపాయి బలోపేతం చాలా ముఖ్యం.
మారకం రేటు/మారకం విలువ అంటే ఏమిటి?
మారకపు రేటు అంటే ఒక దేశం కరెన్సీని మరొక దేశ కరెన్సీలోకి మార్చగల ధర. ఉదాహరణకు, 1 US డాలర్ ధర 84 రూపాయలు అయితే, భారతీయులు ఒక డాలర్ కొనడానికి 84 రూపాయలు ఖర్చు చేయాలి. ఇలా.. ప్రపంచ దేశాల కరెన్సీలన్నింటికీ వివిధ రకాల మార్పిడి రేట్లు ఉంటాయి.
మారకం రేటు విధానాలు:
స్థిర మారకం రేటు: ఈ వ్యవస్థలో మారకం రేటును ప్రభుత్వం లేదా సెంట్రల్ బ్యాంక్ స్థిరంగా ఉంచుతుంది.
స్వేచ్ఛా మారకపు రేటు: ఈ వ్యవస్థలో మార్కెట్ బలాల ఆధారంగా మారకపు రేటు నిర్ణయమవుతుంది.
భారతదేశం స్వేచ్ఛా మార్కెట్ వ్యవస్థను ఉపయోగిస్తుంది. అయితే, అధిక హెచ్చుతగ్గులను నియంత్రించడానికి అవసరమైన విధంగా RBI జోక్యం చేసుకుంటుంది.
రూపాయి డిమాండ్ - సరఫరా
రూపాయి డిమాండ్ - సరఫరా అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. రూపాయిని ప్రధానంగా విదేశీ పెట్టుబడిదారులు డిమాండ్ చేస్తారు. భారతీయులు, విదేశీ దిగుమతులకు చెల్లింపుల కోసం డాలర్లను డిమాండ్ చేస్తారు. భారతీయ ఎగుమతులు రూపాయి సరఫరాను పెంచుతాయి. దిగుమతులు & విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ వంటివి రూపాయికి డిమాండ్ పెంచుతాయి.
మారకపు రేటులో హెచ్చుతగ్గులకు అనేక కారణాలు:
చమురు ధరలు: భారతదేశం దాదాపు 80% ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది. చమురు ధరలు పెరిగినప్పుడు భారతదేశానికి ఎక్కువ డాలర్లు అవసరమవుతాయి, ఇది రూపాయికి డిమాండ్‌ను తగ్గిస్తుంది. ఫలితంగా మారకపు రేటు పడిపోతుంది.
వడ్డీ రేట్లు: US ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచినప్పుడు ప్రపంచ పెట్టుబడిదారులు భారతదేశం నుంచి తమ పెట్టుబడులను ఉపసంహరించుకుని అమెరికాలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభిస్తారు. ఇది కూడా రూపాయి విలువను బలహీనపరుస్తుంది.
వాణిజ్య లోటు: ఎగుమతుల కంటే దిగుమతులు పెరిగినప్పుడు అది వాణిజ్య లోటును సృష్టిస్తుంది, రూపాయిపై ఒత్తిడి తెస్తుంది.
ఫ్లెక్సిబుల్ ఎక్స్ఛేంజ్ రేట్ పాలసీ:
ఫ్లెక్సిబుల్ ఎక్స్ఛేంజ్ రేట్ పాలసీలో, మార్కెట్ డిమాండ్ - సరఫరాపై ఆధారపడి కరెన్సీ రేటు హెచ్చుతగ్గులకు లోనవుతుంది. ఇది కరెన్సీ నిజమైన విలువను వెల్లడిస్తుంది, మార్కెట్లో పారదర్శకత తెస్తుంది. ఈ విధానం ఆర్థిక స్థిరత్వాన్ని కూడా కొనసాగిస్తుంది.
RBI జోక్యం:
రూపాయి విలువలో అస్థిరతను తగ్గించడం RBI ప్రధాన లక్ష్యం. 1991 నుంచి RBI జోక్యం స్థాయి మితిమీరింది. 2022 చివరి నుంచి, కరెన్సీ విలువ తగ్గింపు & రీవాల్యుయేషన్‌ను నియంత్రించడానికి RBI డాలర్ల విక్రయం & కొనుగోలు విధానాన్ని అవలంబించింది. అయితే, RBI తన విధానాలను బయటకు చెప్పదు. దీనివల్ల ఫారిన్ ఎక్సేంజ్ మార్కెట్లో గందరగోళం ఏర్పడుతోంది, ఎక్సేంజ్ రేట్ ఎప్పుడు, ఎందుకు మారుతుందనే విషయాలను మార్కెట్ పసిగట్టలేకపోతోంది.
ప్రస్తుత పరిణామాలు:
ప్రస్తుతం, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ జీవిత కాల కనిష్ట స్థాయికి చేరుకుంది. RBI జోక్యం చేసుకున్నప్పటికీ క్షీణత కొనసాగుతోంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ (US FED) వడ్డీ రేట్లను పెంచడంతో రూపాయి పతనం తీవ్రమైంది. ముఖ్యంగా, డొనాల్డ్ ట్రంప్ విజయం తర్వాత అమెరికన్ డాలర్ బలపడి రూపాయి బలహీనపడింది. ఇటీవలే, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 25 bps తగ్గిస్తూ ప్రకటన చేసింది.
రూపాయి మారకం విలువలో పతనం లేదా స్థిరత్వం ఆర్థిక వ్యవస్థకే కాకుండా "మేక్ ఇన్ ఇండియా" వంటి పథకాలకు కూడా ముఖ్యం. RBI జోక్యం తాత్కాలిక స్థిరత్వాన్ని తీసుకురావచ్చు, కానీ దీర్ఘకాలిక ఆర్థిక విధానాలకు స్వతంత్ర మారకపు రేటు విధానాన్ని అవలంబించడమే తెలివైన పని అని నిపుణులు చెబుతున్నారు. అవసరం.
మరో ఆసక్తికర కథనం: నెల క్రితం రేటుతో ఇప్పుడు గోల్డ్ కొనొచ్చు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ