BRS Latest News:కేటీఆర్ రాష్ట్రవ్యాప్త టూర్ ప్రారంభం-మరి ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పేదెవరు?
BRS Latest News:బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ టూర్ ప్రారంభించేశారు. ఇదే టైంలో అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వీటికి ఎప్పుడు సమాధానాలు దొరుకుతాయో అన్న చర్చ గులాబీ శ్రేణుల్లో జరుగుతోంది.

BRS Latest News: భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రవ్యాప్త టూర్ ఇవాళ(20 మార్చి 2025) ప్రారంభమైంది. తెలంగాణ జిల్లాల్లోని పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశమవుతున్నారు. సూర్యపేట జిల్లా బీఆర్ఎస్ కార్యకర్తలతో కేటీఆర్ భేటీ అయ్యారు. సడెన్‌గా ఇలా కార్యకర్తల వద్దకు వెళ్లాలనే నిర్ణయం వెనుక చాలా పెద్ద కారణమే ఉంది.
ఏప్రిల్ 27వ తేదీన బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం. 25 సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది గులాబీ పార్టీ. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున సంబరాలు తెలంగాణ వ్యాప్తంగా జరుపుకోవాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. పార్టీ ప్లీనరీ సభ, ఏప్రిల్ 10 నుంచి 27వ తేదీ వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం, ఏప్రిల్ 27వ తేదీన వరంగల్‌లో జరిగే భారీ బహిరంగ సభ ఏర్పాట్లపై కేటీఆర్ ఈ భేటీల్లో చర్చిస్తారు. దీని కోసం అన్ని జిల్లాల్లో సన్నాహక సభలు నిర్వహించనున్నారు.
కేటీఆర్ ఒక్కడేనా... ?
తెలంగాణ వ్యాప్తపర్యటన ఇప్పుడు పార్టీ వర్గాల్లోను, రాజకీయంగాను చర్చ సాగుతోంది. పార్టీకి కేటీఆర్ అండ్ హరీశ్‌రావు రెండు కళ్లు. 2018 ఎన్నికల తర్వాత కేటీఆర్‌కు వర్కింగ్ ప్రసిడెంట్‌గా కేసీఆర్ ప్రమోషన్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేసీఆర్ కేబినెట్‌లో కేటీఆర్‌తోపాటు హరీశ్‌రావుకు చోటు కల్పించలేదు. పార్టీలో కేటీఆర్‌కు ప్రమోషన్ ఇచ్చిన కేసీఆర్ హరీశ్‌కు ఏడాది తర్వాత ఆర్థికమంత్రిగా ఛాన్స్ ఇచ్చారు. గత శాసనసభ ఎన్నికల్లోను కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తే హరీశ్‌రావు మాత్రం మెదక్ జిల్లాకే పరిమితమయ్యారు. హరీశ్‌రావును కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేలా చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్న వాదన హరీశ్ అభిమానులు, పార్టీ నేతలు ప్రస్తావిస్తుంటారు.
గతంలో ఇలా లీడ్ తీసుకొని పార్టీ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్న సందర్భాలు చాలా తక్కువ. ప్రత్యేక కార్యక్రమాలకే వెళ్లారు తప్ప ఇలా ఎప్పుడూ వెళ్లలేదు. ఇప్పుడు మాత్రం రాష్ట్రవ్యాప్తంగా టూర్ పెట్టుకున్నారు. ఈ మధ్య కాలంలోనే కేటీఆర్ మనసులో మాట చెప్పారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. అప్పట్లో ఇదో పెద్ద చర్చకు దారి తీసింది. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సూచనతోనే ఈ ప్రకటన చేశారా లేక కేటీఆర్ తనకు తానుగానే కార్యాచరణ ప్రకటించారా అన్న డిస్కషన్ పార్టీ వర్గాల్లో నడిచింది.
ఇప్పుడు పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తోంది. దీన్ని విజయవంతం చేసే బాధ్యతను వర్కింగ్ ప్రసిడెంట్‌గా ఉన్న కేటీఆర్‌కు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అప్పగించారు. అందుకే కేటీఆర్ రాష్ట్ర టూర్ చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో సన్నాహక సభలు నిర్వహించి పార్టీ నేతలతో మాట్లాడతారు.
ఇది కేవలం సిల్వర్ జూబ్లీ వేడుకల కోసం చేస్తున్న సన్నాహకం మాత్రమే కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇది ఓ రకంగా పార్టీ అంతా కేటీఆర్ కనుసన్నల్లోకి తీసుకొచ్చే ఎత్తుగడగా చెబుతున్నారు. కేటీఆర్‌కు కీలక బాధ్యతలు అప్పగిస్తారని ఎప్పటి నుంచో చర్చ నడుస్తున్నా అదే టైంలో సీనియర్ అయిన హరీశ్ పరిస్థితి ఏంటీ ఏ బాధ్యతలు అప్పగిస్తారనే మాట కూడా వినిపిస్తోంది.
హరీశ్ అప్పగించే బాధ్యతలేంటీ?
గులాబీ పార్టీలో సీనియర్ లీడర్లలో హరీశ్ రావు ఒకరు. పార్టీ ట్రబుల్ షూటర్‌గా ఆయనకు పేరు ఉంది. కేసీఆర్ పార్టీపరంగా అప్పగించే ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహించడంలో దిట్ట. పార్టీలో ఏ సంక్షోభం వచ్చినా దాన్ని చల్చార్చేది హరీశ్ రావేనని పార్టీ నేతలు చెబుతారు. అటు పార్టీ సీనియర్లను, జూనియర్లను సమన్వయం చేస్తూ పార్టీకి అనుసంధానకర్త పాత్ర పోషిస్తారని టాక్. పార్టీలో కేటీఆర్ కన్నా హరీశ్‌రావే సీనియర్. అయితే కేటీఆర్‌కు ప్రమోషన్ ఇచ్చిన కేసీఆర్ హరీశ్ రావు పాత్ర మాత్రం తేల్చలేదు.
మరి ఇప్పుడు గులాబీ సంబరాల సన్నాహక సభలకు కేవలం కేటీఆర్ ఒక్కరే వెళ్తారా... లేక హరీశ్ రావు కూడా జిల్లాలు పర్యటిస్తారా అన్న స్పష్టత ఇంకా లేదు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సంబరాలు, పార్టీ సభ్యత్వ నమోదు, ఏప్రిల్ 27 నాటి బహిరంగ సభ నిర్వహణకు టైం లేదు. దీంతో జిల్లాల పర్యటన బాధ్యతలు హరీశ్‌రావుకు కూడా అప్పగిస్తారా అప్పగించరా అన్న ఉత్కంఠ నెలకొంది.
సాధారణంగా భారీ బహిరంగ సభలను విజయవంతం చేసే బాధ్యతలను హరీశ్ రావుకే ఎక్కువగా కేసీఆర్ అప్పగించిన సందర్భాలు ఉన్నాయి. వాటిని విజయవంతం చేసిన చరిత్ర హరీశ్ రావుకు ఉంది. ఏప్రిల్ 27వ తేదీ భారీ బహిరంగ సభ బాధ్యతలు హరీశ్ రావుకే అప్పగించవచ్చన్న వార్తలు వస్తున్నాయి.
మరో ముఖ్య నేత కవిత పాత్ర ఏంటీ?
పార్టీలో ఉద్యమం నాటి నుంచి తనకుంటూ ప్రత్యేక పాత్ర పోషిస్తున్న ఎమ్మెల్సీ కవితకు అప్పగించే బాధ్యతలు ఏంటనే మరో చర్చ నలుగుతోంది. మద్యం కేసులో జైలుకు వెళ్లి వచ్చినప్పటి నుంచి కవిత దూకుడుగా రాజకీయాల్లో పాల్గొంటున్నారు. ఎస్సీ, బీసీ వర్గాల సమస్యలు, డిమాండ్లపై సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీకి కౌంటర్లు ఇస్తూ పార్టీని బలోపేతం చేసే విషయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమెకు కూడా ఎలాంటి పార్టీ పదవి ఇవ్వలేదు.
కేటీఆర్‌కు పార్టీలో లీడింగ్ పోజిషన్ ఇచ్చిన కేసీఆర్, హరీష్ అండ్ కవితకు అప్పగించే బాధ్యతలు ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. వీరంతా కేసీఆర్ కుటుంబ సభ్యులే. అయినా ఉద్యమాలు చేశారు. రాజకీయాల్లో కూడా ప్రూవ్ చేసుకున్నారు. పార్టీ క్యాడర్‌పై ఈ ముగ్గురి ప్రభావం చాలా ఉంటుంది. అందుకే హరీశ్రావు, కవితకు భవిష్యత్ ఏంటని పార్టీలో వారి పాత్ర గురించే అందరూ ఎదురు చూస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

