Telangana Latest News: ప్లేటు మార్చిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు, పార్టీ మారలేదంటూ సుప్రీంకోర్టులో వరుస అఫిడవిట్లు..!
Telangana Latest news:తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. పార్టీ మారలేదు, రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశామంతేనంటూ సుప్రీంకోర్టుకు అఫిడవిట్లు సమర్పిస్తున్నారు.

Telangana Latest news: తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికెరుక అనేలా పరిస్దితులు రోజురోజుకూ మారడంతోపాటు, ఊహించని ట్విస్ట్‌లు, టివి సీరియల్స్‌ను తలదన్నేలా సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి. తాజాగా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలోనూ అదే జరిగింది. బిఆర్‌ఎస్ గుర్తుపై ఎమ్మెల్యేలుగా గెలిచిన పది మంది బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రేవంత్ రెడ్డిని కలసి పార్టీ కండువా మార్చేశారు. బిఆర్‌ఎస్‌తో రామ్ రామ్ అంటూ విడాకులు తీసుకున్న విషయం అందిరికీ తెలిసిందే. అలా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్‌ను కోరినా ప్రయోజనం లేకపోవడంతో చివరికి సుప్రీంకోర్టు మెట్లెక్కడం, అలా చివరిసారి ఈనెల 4వ తేదీ సుప్రీంకోర్టులో బిఆర్‌ఎస్ దాఖలు చేసిన పిటీషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈనెల 25వ తేది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు, స్పీకర్ కార్యాలయంతోపాటు శాసనసభ కార్యదర్మితో సహా వివరణ ఇవ్వాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. స్పీకర్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడంతో నిర్లక్ష్యం వ్యవహరించడం సరికాదంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.
ఈ నేపథ్యంలో మనం తక్కువ తినలేదంటూ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు వ్యూహం మార్చి, యూటర్న్ తీసుకున్నారు. అంటే తిరిగి బిఆర్‌ఎస్‌లోకి వెళ్లడం కాదండోయ్. సుప్రీంకోర్టుకు మాత్రం అంతా తూచ్, మేము పార్టీ మారలేదు. బిఆర్‌ఎస్ పార్టీ వీడలేదు. మేము అభిమానించే పార్టీ బిఆర్‌ఎస్ అంటూ పాతగొంతులో కొత్త స్వరం వినిపిస్తున్నారు. గెలిచిన సంతోషంలో రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసొచ్చాము అంతేనంటూ వ్యూహాత్మకంగా ప్లేట్ తిప్పేశారు.
అలా మేము రేవంత్ రెడ్డిని కలవగానే, ఇలా మీడియాలో మేము పార్టీ మారినట్లు, బిఆర్‌ఎస్ వీడి కాంగ్రెస్‌లో చేరినట్లు వక్రీకరించారు. ఇందులో మా తప్పులేదంటూ నాలుక మడతపెట్టేశారు. ఇలా ఒక్కొక్కరుగా పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తున్నారు. సుప్రీం కోర్టులో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై ఇప్పటి వరకు జరిగిన వాదనలు చూస్తే పార్టీ ఫిరాయించిన వారికి గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ముందుగానే మేల్కొన్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్‌ను కలసిన నాటి నుంచి బిఆర్‌ఎస్‌కు దూరంగా ఉంటూ కాంగ్రెస్‌తో సన్నిహితంగా మెలుగుతున్న ఆ పదిమంది ఎమ్మెల్యేలు రూట్ మార్చి మేము పార్టీ ఫిరాయించలేదు, కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ లు దాఖలు చేస్తున్నారు.
ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు అఫిడవిట్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ ఫిరాయించిన విషయం తెలిసిందే, అయితే సుప్రీంకోర్టులో మాత్రం పార్టీ ఫిరాయించలేదు, కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు వచ్చిన వార్తలు అవాస్తవం, బీఆర్ఎస్ పార్టీతో మంచి అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని తాజాగా సుప్రీంకు సమర్పించిన అఫిడవిట్‌తో తెలిపారు. శాసనసభకు మూడోసారి ఎన్నికయ్యాక, వ్యక్తిగత స్థాయిలో ముఖ్యమంత్రిని కలిశానని, పార్టీ మారలేదని, సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాకి చెందిన ఎమ్మెల్యేలు సైతం ఈ విధంగానే సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. ఇన్నాళ్లు వేచిచూసి ఇప్పుడు మొత్తానికే ఎమ్మెల్యే పదవి పోతుందనే భయంతోనే ఇలా స్వరం మార్చారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అఫిడవిట్లపై మార్చి 25వ తేదీ సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

