Forgotten UAN Number: యూఏఎన్ నెంబర్ మరిచిపోయారా.. అయితే పీఎఫ్ ఖాతాదారులు ఇలా తిరిగి పొందండి
How To Recover UAN for PF Account | యూఏఎన్ నంబర్ తిరిగి పొందడం పెద్ద కష్టమేమీ కాదు. ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో ఇందుకోసం ప్రత్యేక సదుపాయం కల్పించారు. మీ మొబైల్ నంబర్, ప్రాథమిక సమాచారం ఉంటే సరిపోతుంది.

మీరు ఉద్యోగం చేస్తున్నారా, మీ జీతం నుండి ప్రతి నెలా PF కట్ అవుతుంటే మీకు ఖచ్చితంగా UAN నంబర్ ఉంటుంది.ఈ 12 అంకెల యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) మీ PF ఖాతాకు సంబంధించిన ప్రతి సౌకర్యం కోసం అవసరం. కానీ చాలా సార్లు ఉద్యోగులు యూఏఎన్ నెంబర్ మరిచిపోతుంటారు. రెగ్యూలర్ గా ఈపీఎఫ్ సైట్ లాగిన్ చేయకపోవడం సహా పలు కారణాలు ఉంటాయి. ప్రతి ఉద్యోగికి కెరీర్ మొత్తం ఒక్కటే యూఏఎన్ ఉంటుంది. అది మరిచిపోయినా టెన్షన్ అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు నిమిషాల్లో మీ UANని తిరిగి పొందవచ్చు. మీరు కూడా మీ UAN నంబర్‌ను మర్చిపోతే, దాన్ని ఎలా తిరిగి పొందవచ్చో ఇక్కడ వివరంగా అందిస్తున్నాం.
మీ UAN నంబర్‌ను తిరిగి ఎలా పొందాలి?
- UAN నంబర్‌ను తిరిగి పొందడం చాలా ఈజీ. దీని కోసం EPFO తన వెబ్సైట్లో ప్రత్యేక సౌకర్యం ఇచ్చింది. దీని కోసం మీకు మొబైల్ నంబర్, కొంత ప్రాథమిక సమాచారం మాత్రమే అవసరం.
- UAN నంబర్‌ను తిరిగి పొందడానికి, ముందుగా EPFO వెబ్సైట్ unifiedportal-mem.epfindia.gov.in ని సందర్శించండి.
- దీని తరువాత Know Your UAN ఆప్షన్‌పై మీరు క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి OTPని వెరిఫై చేయండి.
- ఆ తరువాత, మీ పేరు, పుట్టిన తేదీ, ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ (PAN) వంటి ప్రాథమిక సమాచారాన్ని ఇవ్వాలి.
- ఇప్పుడు ఫారమ్‌ను సమర్పించిన వెంటనే, UAN నంబర్ మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
PF ఖాతాకు UAN ఎందుకు అవసరం?
UAN నంబర్ లేకుండా, మీరు మీ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలోకి లాగిన్ అవ్వలేరు. మీ EPF బ్యాలెన్స్‌ను చెక్ చేయలేరు. PF విత్‌డ్రా వంటి ప్రక్రియలను పూర్తి చేయలేరు. అదే సమయంలో ఉద్యోగం మారినప్పుడు పాత PFని కొత్త కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయవలసి వస్తే, UAN అవసరం. మీ PF ఖాతాకు సంబంధించిన ప్రతి చిన్న పనిలోనూ ఉద్యోగికి UAN నంబర్ చాలా ముఖ్యం.
SMS ద్వారా కూడా UAN నంబర్
SMS ద్వారా మీరు UAN నంబర్‌ను తెలుసుకునే అవకాశం ఉంది. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి EPFOHO UAN ENG అనే సందేశాన్ని 7738299899 నంబర్‌కు పంపాలి. సందేశాన్ని పంపిన కొద్దిసేపటికే మీ మొబైల్‌కు UAN నంబర్ వస్తుంది.
UAN నంబర్‌ను ఎందుకు గుర్తుంచుకోవాలి?
UAN అనేది మీ PF ఖాతా లింక్ చేయబడిన నంబర్. ప్రభుత్వ లేక ప్రైవేట్ ఉద్యోగి ఎవరైనా సరే పీఎఫ్ మొత్తం ప్రతినెలా జమ అవుతుందంటే మీకు ఈ నెంబర్ అవసరం పడుతుంది. మీరు PF బ్యాలెన్స్‌ను తనిఖీ చేయాలనుకున్నా, KYCని అప్డేట్ చేయాలన్నా లేదా మొబైల్ నంబర్‌ను మార్చాలనుకున్నా, ఈపీఎఫ్‌వో వెబ్సైట్లో ప్రతి పనిలో UAN నంబర్ అవసరం. అదే విధంగా PFలో జమ చేసిన మొత్తం సాధారణంగా పదవీ విరమణ తర్వాత 60 సంవత్సరాలు పూర్తయిన తర్వాత లభిస్తుంది. UAN నంబర్ ఎక్కడైనా సేవ్ చేసుకుంటే అత్యవసర సమయాల్లో మీకు ఏ ఇబ్బంది ఉండదు.






















