Trump Tariffs on India: భారత్‌పై మరో టారిఫ్ పిడుగు! ట్రేడ్ డీల్ వేళ మరో రంగాన్ని టార్గెట్ చేసిన డొనాల్డ్ ట్రంప్
Trump Tariffs on India Rice | భారతీయ ఉత్పత్తులపై అమెరికా ఇదివరకే 50% సుంకం విధించింది. ఈ క్రమంలో భారత్ నుంచి అమెరికాకు దిగుమతి చేసుకునే బియ్యం, వ్యవసాయ ఉత్పత్తులపై టారిఫ్ లు వేస్తామని ట్రంప్ అన్నారు.

US Tariffs on India | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ వ్యవసాయ ఉత్పత్తులపై కొత్త సుంకాలు విధించే యోచనలో ఉన్నారు. ముఖ్యమంగా ఆయన టార్గెట్ భారత్ అని నేరుగా సంకేతాలు ఇచ్చారు. కొత్తగా అదనంగా విధించాలనుకున్న టారిఫ్ అంశాలలో భారత బియ్యం, కెనడా ఎరువులు కూడా ఉన్నాయి. శ్వేతసౌధం(White House)లో తాజాగా జరిగిన సమావేశంలో ట్రంప్ కొత్త టారిఫ్ అంశాలపై కీలక ప్రకటన చేశారు. చౌకైన విదేశీ ఉత్పత్తుల కారణంగా అమెరికా మార్కెట్‌పై పడుతున్న ప్రభావాన్ని గురించి అక్కడి రైతులు ఫిర్యాదు చేశారు. ఈ సమావేశం అమెరికా రైతులకు ప్రకటించిన 12 బిలియన్ డాలర్ల సహాయ ప్యాకేజీ సమయంలో జరిగింది.
విదేశీ చౌక బియ్యంతో అమెరికా రైతులు ఆందోళన
సమావేశంలో ఉన్న రైతులు కొన్ని దేశాలు అమెరికా మార్కెట్‌లో తక్కువ ధరకు బియ్యం అమ్ముతున్నాయని ట్రంప్ సమక్షంలో ఆరోపించారు. దీనివల్ల అమెరికా రైతులకు భారీ నష్టం వాటిల్లుతోందన్నారు. దీనిపై ట్రంప్ మాట్లాడుతూ, 'విదేశీయులు మనల్ని మోసం చేస్తున్నారు. మాకు న్యాయం జరిగేలా చూడండి' అని అన్నారు. రైతుల ఆరోపణలపై విచారణ జరుపుతామని, అవసరమైతే భారత్, కెనడాల మరికొన్ని ఉత్పత్తులపై సుంకాలు విధిస్తామని సూచించారు.
లూసియానాలోని కెన్నెడీ రైస్ మిల్స్ CEO మెరిల్ కెన్నెడీ, భారతదేశం, థాయిలాండ్, చైనాలు అమెరికాలోకి ఆ ఉత్పత్తుల ప్రధాన డంపింగ్ దేశాలని పేర్కొన్నారు. చైనా ముఖ్యంగా ప్యూర్టో రికోకు పెద్ద మొత్తంలో బియ్యాన్ని పంపుతోందని, అక్కడ అమెరికా బియ్యం సరఫరా దాదాపుగా నిలిచిపోయిందన్నారు. కెన్నెడీ మాట్లాడుతూ, 'మేము ఏళ్ల తరబడి అక్కడ బియ్యాన్ని పంపలేదు. దక్షిణ రాష్ట్రాల్లోని రైతులు తీవ్రంగా ప్రభావితం అవుతున్నారు' అని అన్నారు.
#WATCH | US President Donald Trump asks the United States Secretary of the Treasury, Scott Bessent, "Why is India allowed to do that ("dumping rice into the US")? They have to pay tariffs. Do they have an exemption on rice?"
— ANI (@ANI) December 8, 2025
United States Secretary of the Treasury, Scott Bessent… pic.twitter.com/75tKFYt37G
సుంకాలు పనిచేస్తున్నాయి, కానీ...
సుంకాలు ప్రభావవంతంగా ఉన్నాయని, అయితే వాటిని మరింత కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని మెరిల్ కెన్నెడీ అన్నారు. దీనిపై ట్రంప్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, 'మీకు ఇంకా కావాలా?' అని అడిగారు. అయితే, ఏదైనా దేశం డంపింగ్ చేస్తే, దానిపై చర్యలు తీసుకుంటామని రైతులకు, మిల్లర్లకు హామీ ఇచ్చారు. సమావేశంలో ఉన్న అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బేసెంట్ రైతుల ద్వారా పేర్కొన్న దేశాల జాబితాను నమోదు చేయాలని ట్రంప్ ఆదేశించారు. రైతులు భారత సబ్సిడీ విధానం గురించి సమాచారం ఇవ్వడం ప్రారంభించగా, ట్రంప్ మధ్యలో మాట్లాడుతూ, 'ముందుగా నాకు దేశాల పేర్లు చెప్పండి... ఇండియా, ఇంకా ఎవరున్నారు?' అని అడిగారు.
భారతదేశం, థాయిలాండ్, చైనా అమెరికాకు దిగుమతుల్లో ప్రధాన వనరులని స్కాట్ బెసెంట్ పేర్కొన్నారు. జాబితాలో మరిన్ని దేశాలు ఉండవచ్చని, దీని వివరాలు తరువాత ఇస్తామన్నారు. త్వరలో దీనిపై చర్యలు తీసుకుంటామని ట్రంప్ హామీ ఇచ్చారు.
కెనడా ఎరువులు కూడా టార్గెట్
చర్చల సందర్భంగా, కెనడా నుండి వచ్చే ఎరువులపై కూడా భారీ సుంకాలు విధించవచ్చని ట్రంప్ సూచించారు. తద్వారా దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించవచ్చు అన్నారు. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, భారతదేశం, కెనడా రెండూ అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే ఇటీవలి ఈ చర్చల్లో పెద్దగా పురోగతి లేదు. ఆగస్టులో ట్రంప్ ప్రభుత్వం భారత ఉత్పత్తులపై 50 శాతం సుంకం విధించింది. భారతదేశం అమెరికా మార్కెట్‌కు అడ్డంకులు కలిగిస్తోందని, రష్యా నుండి చమురు కొనసాగిస్తోందని పేర్కొంది.
డిసెంబర్ 10–11 తేదీలలో భారత్-అమెరికా వాణిజ్య చర్చలు
అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం (USTR) డిప్యూటీ హెడ్ రిక్ స్విట్జర్ నేతృత్వంలోని ఒక సీనియర్ అమెరికా ప్రతినిధి బృందం ఈ వారం భారత్‌లో వాణిజ్య చర్చలను తిరిగి ప్రారంభిస్తుంది. డిసెంబర్ 10, 11 తేదీలలో అనేక ముఖ్యమైన అంశాలపై చర్చించి, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA)ను ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాయి.
భారత్ తరపున వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ చర్చలకు నాయకత్వం వహిస్తారు. ఈ ఏడాది చివరి నాటికి ఒప్పందం మొదటి దశను ఖరారు చేయడానికి భారతదేశం ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు. నవంబర్ 28న FICCI వార్షిక సమావేశంలో అగర్వాల్ మాట్లాడుతూ, 'ఈ క్యాలెండర్ సంవత్సరం చివరి నాటికి అమెరికాతో మేం ఒప్పందాన్ని పూర్తి చేస్తామని నాకు నమ్మకం ఉంది' అని అన్నారు.






















