Kalvakuntla Kavitha: కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై సమాధానం చెప్పాలి - బబుల్ షూటర్ల వల్ల ఏం కాదు - కవిత కీలక వ్యాఖ్యలు
Kavitha: కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై మాట్లాడాలని కవిత పిలుపునిచ్చారు. హరీష్ రావే తప్పు చేశారని .. ఆయనేం మాట్లాడతారని ప్రశ్నించారు.

Kavitha on KCR : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసిన ఆమె, తన ఎమ్మెల్సీ పదవి రాజీనామాను ఆమోదించాలని కోరారు. రాజీనామా ఆమోదానికి ముందు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేయగా, ఈ నెల 5వ తేదీన అందుకు ఛైర్మన్ అంగీకరించారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వంపై , ముఖ్యమంత్రి వైఖరిపై నిప్పులు చెరిగారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన తండ్రి కేసీఆర్‌ను కసబ్ వంటి టెర్రరిస్టుతో పోల్చడంపై కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమ నాయకుడిని ఉగ్రవాదితో పోల్చడం దేశద్రోహమే అవుతుంది. కేసీఆర్ కూతురిగా ముఖ్యమంత్రి మాటలకు నా రక్తం మరుగుతోంది అని ఆమె హెచ్చరించారు. ముఖ్యమంత్రి తన స్థాయిని మర్చిపోయి రాళ్లతో కొట్టాలని, ఉరి తీయాలని మాట్లాడటం సరికాదని, వెంటనే తన మాట తీరు మార్చుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ గారి కృషితో సిద్ధించిన రాష్ట్రంలోనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని కవిత ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా గత పదేళ్లలో ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదన్నది వాస్తవమని, అయితే గత ప్రభుత్వంపై బురద చల్లడం మానుకోవాలని సూచించారు. జూరాల నుంచి శ్రీశైలానికి ఇన్-టేక్ పాయింట్ ఎందుకు మార్చారో కేసీఆర్ గారే వివరించాలని కోరుతూనే, సభలో బబుల్ షూటర్ లాంటి వ్యక్తులకు పెత్తనం ఇచ్చి జవాబులు చెప్పించడం వల్ల ఉపయోగం లేదన్నారు. వారి కారణంగానే ప్రాజెక్టులు ఇబ్బందుల్లో పడ్డాయని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ నాయకులు రాజకీయాలకు అతీతంగా తమ ప్రాంత ప్రయోజనాల కోసం నీటిని దోచుకుంటుంటే, తెలంగాణ నాయకుల్లో ఆ చిత్తశుద్ధి లోపించిందని కవిత ధ్వజమెత్తారు. మేడిగడ్డ ప్రాజెక్టును రెండేళ్ల పాటు ఎండబెట్టి రైతుల కడుపు కొట్టారని, ఇప్పుడు రిపేర్ల పేరుతో కాంట్రాక్టులు ఇవ్వడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. పోతిరెడ్డిపాడు వంటి ప్రాజెక్టులపై స్టే ఉన్నా ఏపీ నేతలు పనులు చేసుకుపోతున్నారని, మన ప్రభుత్వం మాత్రం కేవలం ప్రతిపక్షాలను తిట్టడానికే అసెంబ్లీని వాడుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.
“I strongly condemn Revanth Reddy’s remarks comparing KCR gaaru to terrorist Kasab. As KCR’s daughter, my blood boils when I hear such gross and irresponsible comments against the leader of the Telangana movement. Revanth Reddy remarks are unbecoming of a chief minister” said K… pic.twitter.com/OFo8mO91kp
— Kalvakuntla Kavitha Office (@OfficeOfKavitha) January 2, 2026
బీఆర్ఎస్ పార్టీ మనుగడ కోసం కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలని కవిత విజ్ఞప్తి చేశారు. ఆయన రాకపోతే పార్టీని దేవుడు కూడా కాపాడలేడని వ్యాఖ్యానించారు. ఈ నెల 5వ తేదీన మండలిలో తన రాజీనామాకు గల కారణాలను ప్రజలకు వివరిస్తానని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రీల్స్ చేస్తూ, టైమ్ పాస్ చేస్తూ ప్రజా ప్రయోజనాలను గాలికి వదిలేస్తోందని, ఇకపై వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు జాగృతి సిద్ధంగా ఉందని ఆమె స్పష్టం చేశారు.





















