Amaravati News: అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
Amaravati Development | అమరావతి అభివృద్ధిలో భాగంగా ఉండవల్లి పంపింగ్ స్టేషన్ ఏర్పాటుతో పాటు, 4 గ్రామాల్లో మౌలిక వసతుల పనులకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు ఖరారు చేసింది.

Andhra Pradesh Capital News | అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగంగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉండవల్లి వద్ద పంపింగ్ స్టేషన్-2 నిర్మాణానికి సంబంధించిన టెండర్లను అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ADCL) ఖరారు చేసింది. సుమారు రూ. 443.76 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు కాంట్రాక్టును మేఘా ఇంజినీరింగ్ సంస్థ దక్కించుకుంది. ఈ పంపింగ్ స్టేషన్ ద్వారా 8400 క్యూసెక్కుల వరద నీటిని కృష్ణా నదిలోకి తరలించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టు కింద సర్వే, డిజైన్, నిర్మాణంతో పాటు తదుపరి 15 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యతలను కూడా సదరు సంస్థే చూసుకోనుంది. ప్రపంచ బ్యాంక్ మరియు ఆసియా అభివృద్ధి బ్యాంకుల నిధుల సహాయంతో సిఆర్డిఏ (CRDA) ఈ పనులను పర్యవేక్షించనుంది.
రాజధాని గ్రామాల అభివృద్ధిపై సర్కార్ ఫోకస్
మరోవైపు, రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన ల్యాండ్ పూలింగ్ గ్రామాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాజధాని జోన్-8 పరిధిలోని కృష్ణాయపాలెం, వెంకటపాలెం, పెనుమాక మరియు ఉండవల్లి గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు రూ. 1358 కోట్లతో పనులను చేపట్టనుంది. ఈ బృహత్తర పనుల కోసం మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రా సంస్థ ఎల్ 1 బిడ్డర్‌గా నిలవడంతో ప్రభుత్వం ఆ సంస్థకు కాంట్రాక్టును ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
రోడ్లు, మెరుగైన మౌలిక వసతుల కల్పన
ఈ అభివృద్ధి పనుల్లో భాగంగా సంబంధిత గ్రామాల్లోని లేఅవుట్లలో అత్యాధునిక రోడ్లు, డ్రెయిన్లు, నీటి సరఫరా వ్యవస్థ, మురుగునీటి పారుదల నిర్మాణ పనులు చేపట్టనున్నారు. వీటితో పాటు విద్యుత్, ఐసీటీ (ICT) కోసం ప్రత్యేక యుటిలిటీ డక్ట్‌లు, పునర్వినియోగ వాటర్ లైన్లు, ఎస్టీపీ, అవెన్యూ ప్లాంటేషన్ వంటి పనులను కూడా పూర్తి చేయనున్నారు. సిఆర్డిఏ ద్వారా నిధులను సమకూర్చుతూ, అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.






















