Amaravati Land Pooling: అమరావతి లో రెండోదశ పూలింగుకు ఏర్పాట్లు- ఏడు గ్రామాల్లో తొమ్మిది యూనిట్లు రెడీ
Andhra Pradesh News | అమరావతి లో రెండోదశ పూలింగుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఏడు గ్రామాల్లో తొమ్మిది యూనిట్లు రెడీ చేస్తున్నారు. ఈ దశలో మొత్తం మొత్తం 16,666.57 ఎకరాలు సమీకరించనున్నారు.

ఏపీ రాజధాని అమరావతిలో రెండోదశ ల్యాండ్ పూలింగు కోసం కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు జెట్ స్పీడ్ తో చేస్తోంది. ఇప్పటికే అన్ని గ్రామాల్లో కార్యాలయ భవనాలను గుర్తించింది. ఇంతకముందు అనుభవం ఉన్న తొమ్మిది మంది కంప్యూటర్ అపరేటర్లను కూడా అన్ని గ్రామాలకు కేటాయించింది. మొత్తం ఏడు గ్రామాల్లో తొమ్మిది యూనిట్లను ల్యాండ్ పూలింగ్ కోసం ఏర్పాటు చేస్తోంది. ఈ నెల మూడో తేదీన అంటే రేపు నోటిఫికేషన్ వచ్చిన వెంటనే రాజధాని కి భూములిచ్చేవారి నుంచి దరఖాస్తులు స్వీకరించడం కోసం డిప్యూటీ కలెక్టర్లను నియమిస్తున్నారు.
ఇప్పటికే నియామక ప్రక్రియ పూర్తయినా ఒకటి అరా ఏవైనా అభ్యంతరాలున్న నేపథ్యంలో వాటిని పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఇప్పటికే తగు సూచనలు చేసింది.. నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సిబ్బంది కార్యకలాపాలు వంటి అంశాలపై సూచనలిచ్చారు. ప్రతి కార్యాలయంలో ఒక స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్, సర్వేయర్, కంప్యూటర్ ఆపరేటర్ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫర్నీచర్ను కూడా ఆయా గ్రామాల్లోని యూనిట్ కార్యాలయాలకు మంగళవారం నాడే తరలించారు.
నోటిఫికేషన్ అనంతరం దరఖాస్తులు తీసుకోవడంతో పాటు వాటిని పాత రికార్డులతో సరిపోలుస్తారు. ప్రతి దరఖాస్తుకూ సంబంధించిన సర్వే నెంబర్లను జిఐఎస్ మ్యావులో ఉన్న సర్వే నెంబర్లు, ఫీల్డ్ సర్వే నెంబర్న్ సరిపోల్చనున్నారు. వాటన్నిటినీ నిర్ధారించాల్సిన బాధ్యతను అధికారులు నిర్వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ల్యాండ్ పూలింగులో వచ్చిన అప్లికేషన్లలో ఉన్న విస్తీర్ణం, అడంగల్ ఉన్న విస్తీర్ణం ఒకటా కాదా అనేది ధ్రువీకరించిన అనంతరం 9.22 ప్రకటన చేయనున్నారు. గతంలో అంటే తొలిదశ ల్యాండ్ పూలింగ్ లో అన్నీ పూర్తయిన తరువాత సర్వే చేయడంతో కొన్ని ఇబ్బందులొచ్చాయి,అందుకే ఈసారి ముందుగానే సర్వే కూడా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని ఫై ఇంతకుముందు సర్వే చేసిన అనుభవం ఉండటంతో ఈసారి ఎటువంటి ఇబ్బందులూ రాకుండా ఉండేలా చూస్తున్నారు.
దరఖాస్తులు తీసుకున్న తరువాత వాటిని సర్వే చేసి ఎప్పటికప్పుడు నివేదికలు తయారు చేయనున్నారు. 9.3 దరఖాస్తులు, 9.14 అగ్రిమెంటు ఫారాలను తీసుకోవాలని నిర్ణయించారు. భూముల అగ్రిమెంట్లు 9.3 తీసుకునే సమయంలో అందరికీ రసీదులు ఇవ్వాలా లేక 9.14 చేసుకున్న తరువాత ఇవ్వాలా అనే అంశంపైనా చర్చ జరిగినట్లు తెలిసింది. వీటితోపాటు పూలింగుకు భూములిచ్చిన రైతుల బ్యాంకు అకౌంట్లు. ఆధార్ లింకు అంశాలను తనిఖీ చేయాలని నిర్ణయించారు. గతంలో జరిగిన పొరపాట్లు వల్ల చాలా వరకూ పదేవదే తనిఖీలు చేయాల్సి వచ్చిందని, ప్రస్తుతం జరగబోయే పూలింగులో ఇటువంటి ఇబ్బందులేవీ తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యతను ఎస్డిసిలకు అప్పగించారు.
రెండో దశ ల్యాండ్ పూలింగ్ కోసం ఏర్పాట్లు జరుగుతున్న గ్రామాలు ఇవే
రెండోదశ వూలింగులో పెదపరిమి రెవెన్యూలో రెండు, వద్దమాను, వైకుంటపురం, హరిశ్చంద్రాపురం, పెదమద్దూరు, యండ్రాయి, కర్ణపూడి- లేమల్లెలో మొత్తం తొమ్మిది యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు.
రెండో దశ పూలింగ్ కోసం ఇప్పటికే అప్రూవల్ ఇచ్చేసిన ఏపీ క్యాబినెట్
2025 నవంబరు 27 న జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశంలో ఏడు గ్రామాల్లో భూ సమీకరణ అధికారాన్ని సిఆర్డిఎ కమిషనర్కు అప్పగించారు. తాజా నోటిషికేషన్ ద్వారా 16,562.56 ఎకరాల పట్టా భూమి, 104.01 ఎకరాలు అసైండ్ భూమి మొత్తం 16,666.57 ఎకరాలు సమీకరించనున్నారు. దీంతోపాటు ప్రభుత్వ భూమి 3828.56 ఎకరాలు తీసుకోనున్నారు. దీనికి సంబంధించి కాంపిటెంట్ అథారిటీకి అవసరమైన అధికారులను ఎంపిక చేసింది. కార్యాలయాలూ తీసుకుంది.మొదట్లో డిసెంబర్లోనే నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించినా వేర్వేరు కారణాలతో ఆలస్యమైంది. తుళ్లూరు మండలంలోని పెదపరిమి, వడ్డమాను, హరిశ్చంద్రాపురం గ్రామాలు, అమరావతి మండలంలోని వైకుంఠపురం, పెదమద్దూరు, యండ్రాయి, కర్లపూడి లేమల్లెలో భూసమీకరణకు సంబంధించిన వివరాలను రెవెన్యూ అధికారులు సేకరించి నివేదికలు తయారుచేసి ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపించారు.
రాజధాని ప్రాంతం లో కొన్ని గ్రామాల్లో రైతులు ఇప్పటికే భూములు ఇస్తామని చెప్పి వారి భూముల పట్టాలను మున్సిపల్ శాఖా మంత్రి నారాయణకు అందజేశారు. వడ్డమానులో రైతులతో సమావేశం సందర్భంగా వచ్చే నాలుగేళ్లలో అభివృద్ధి చేసి ఇవ్వాలని లేనిపక్షంలో రైతుకు ఐదు లక్షలు పరిహారం ఇచ్చేలా ఒప్పంద పత్రంలో చేర్చాలని రైతులు కోరారు. దీనిపై గతంలోనే గ్రామసభలూ నిర్వహించారు. రైతుల నఃండి కూడా సమ్మతి లభించడం తో 2026 జనవరి మూడోతేదీన నోటిఫికేషన్ ఇచ్చి ఫిబ్రవరి 28వతేదీలోపు ప్రక్రియను ముగించేలా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు,





















