Jogi Ramesh: కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
Fake liquor plot: నకిలీ మద్యం కేసులో జోగి రమేష్‌పై సిట్ ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అద్దెపల్లి బ్రదర్స్ నుంచి ఆయనకు నేరుగా డబ్బులు చేరాయి.

SIT links Jogi Ramesh to fake liquor plot: ఆంధ్రప్రదేశ్‌లో ప్రకంపనలు సృష్టించిన నకిలీ మద్యం దందాలో మాజీ మంత్రి జోగి రమేష్ పాత్రపై ప్రత్యేక దర్యాప్తు బృందం కోర్టులో కీలక ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన అద్దేపల్లి జనార్దన్ రావు, జోగి రమేష్ మధ్య 2006 నుంచే సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సిట్ స్పష్టం చేసింది. గతంలో వీరిద్దరూ కలిసి స్వర్ణ బార్ ప్రస్తుతం చెర్రీ బార్ నిర్వహణలో భాగస్వాములుగా ఉండటమే కాకుండా, 2017లో ఇబ్రహీంపట్నం బార్ సిండికేట్‌లోనూ కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ దీర్ఘకాలిక పరిచయమే అక్రమ మద్యం తయారీకి పునాదిగా మారిందని అధికారులు పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడానికి కుట్ర
కేవలం ఆర్థిక లాభం కోసమే కాకుండా, ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తెచ్చేందుకు జోగి రమేష్ ఈ దందాను ప్రోత్సహించారని సిట్ తన నివేదికలో ఆరోపించింది. ఏప్రిల్ 2024 తర్వాత ములకలచెరువు, ఇబ్రహీంపట్నం కేంద్రాలుగా నకిలీ మద్యం ఉత్పత్తిని ముమ్మరం చేయాలని రమేష్ ఒత్తిడి చేసినట్లు నిందితుల వాంగ్మూలం ద్వారా బయటపడింది. రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతోందనే ముద్రను ప్రభుత్వానికి అంటగట్టాలనే రాజకీయ కుట్ర ఇందులో దాగి ఉందని సిట్ ఛార్జిషీట్‌లో వివరించింది.
జోగి రమేష్ కు భారీగా డబ్బులు ఇచ్చిన అద్దేపల్లి బ్రదర్స్
ఈ అక్రమ వ్యాపారం సాఫీగా సాగేందుకు భారీగా నగదు చేతులు మారినట్లు సిట్ ఆధారాలు సేకరించింది. నిందితులు జనార్దన్ రావు, జగన్మోహన్ రావు ప్రతి రెండు మూడు నెలలకొకసారి రూ. 3 లక్షల నుండి రూ. 5 లక్షల వరకు జోగి రమేష్‌కు, ఆయన సోదరుడు జోగి రాముకు అందజేసేవారని ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో ఈ నగదును నేరుగా జోగి రమేష్‌కే హ్యాండోవర్ చేసినట్లు దర్యాప్తు సంస్థ గుర్తించింది. మొత్తం 10 పేజీల ఈ ఛార్జిషీట్‌లో నిందితుల మధ్య జరిగిన కాల్ డేటా , ఆర్థిక లావాదేవీల రికార్డులను ప్రధాన ఆధారాలుగా చేర్చారు.
18వ నిందితుడిగా జోగి రమేష్
ఈ నకిలీ మద్యం తయారీకి అవసరమైన ముడి పదార్థాలను గోవా, బెంగళూరు ,హైదరాబాద్ వంటి నగరాల నుండి సేకరించినట్లు సిట్ వెల్లడించింది. ప్రముఖ బ్రాండ్ల పేర్లతో నకిలీ లేబుళ్లు, హాల్‌మార్క్ సీల్స్ తయారు చేసి సాధారణ మద్యం దుకాణాల ద్వారా విక్రయించేలా వ్యవస్థను రూపొందించారు. జోగి రమేష్ రాజకీయ అండదండలతోనే నిందితులు ఇన్ని రాష్ట్రాల వ్యాప్తంగా తమ నెట్‌వర్క్‌ను విస్తరించగలిగారని, ప్రస్తుతం జోగి రమేష్ ఈ కేసులో 18వ నిందితుడిగా (A18) ఉన్నారని అధికారులు కోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేశారు.




















