Pilot Shortage In India: భారత్ విమానయాన రంగంలో పైలట్ల కొరత- శిక్షణ పొందే వాళ్లకు ఉద్యోగాలు గ్యారంటీ!
Pilot Shortage In India: ఇండిగోలో సంక్షోభం కొత్త దారు చూపిస్తోంది. పైలట్ల అవసరం ఎంత ఉందో చెప్పింది. అందుకే శిక్షణ తీసుకున్న వాళ్లకు ఉద్యోగం గ్యారంటీగా వచ్చే ఛాన్స్ ఉంది.

Pilot Shortage In India: భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్‌గా పేరొందింది. దేశంలో భారీ పెరుగుతున్న విమానాశ్రయాలు, ప్రజల అవసరాలు, ఇతర వ్యాపారాభివృద్ధి కారణంగా ప్రయాణికుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ఇప్పుడు ఉన్న లెక్కల ప్రకారం ఏటా 7-11 శాతం పెరుగుతోంది. అంతర్జాతీయ రూట్లలో 15-20 శాతం వృద్ధి నమోదవుతోంది. ఇండిగో, ఎయిర్ ఇండియా వంటి సంస్థలు భారీ ఎత్తున విమానాలు ఆర్డర్ చేస్తున్నాయి. ఈ వృద్ధి చూసి సంబరపడిపోతున్న టైంలో ఇండిగో సంక్షోభం అనేక అవాంతరాలు సృష్టించింది. గాలి ఓడల వ్యాపార వృద్ధి గాలిబుడగేనా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే డీప్‌గా స్టడీ చేసిన తర్వాత వ్యవస్థలో తప్పిదాల కంటే సంస్థ లోపాలు బయటపడ్డాయి. దీనికి మరో శుభవార్త కూడా సంక్షోభం నుంచి అందుతోంది. అదే ఉద్యోగాల కల్పన.
వేధిస్తున్న పైలట్ల కొరత
భారత దేశంలో విమానయాన రంగం అనుకున్నదాని కంటే వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఈ వృద్ధికి పైలట్ల కొరత అడ్డుపడుతోంది. చాలా కాలంగా ఈ సమస్య విమానయాన రంగాన్ని పట్టి పీడిస్తోంది. అయితే వ్యవస్థలోని లోపాల కారణంగా ఉన్న వారితోనే విమాన సంస్థలు నెట్టుకొచ్చాయి. కానీ ఈ మధ్య కాలంలో ప్రభుత్వం లోపాలను సరి చేసేసరికి ఒక్కసారిగా ఎయిర్‌లైన్స్ సంక్షోభంలోకి జారుకున్నాయి. అరకొర సిబ్బందితో పని సాగదని ఇండిగో వ్యవహారం గుణపాఠం నేర్పింది. ఇండిగోతోపాటు మిగతా విమానయాన సంస్థలకు పైలట్లు, ఇతర సిబ్బంది అవసరాన్ని గుర్తు చేసింది.
పైలట్ల కొరతతో విమానాల ఆలస్యం
దేశంలో పైలట్ల కొరత ఏ స్థాయిలో ఉందో ప్రస్తుతం ఇండిగో సమస్య నొక్కి చెబుతోంది. దేశవ్యాప్తంగా విమానాలు రద్దు, ఆలస్యాలు, ప్రయాణికుల తిప్పలు అన్నీ ఒక్కసారిగా చుట్టుముట్టాయి. రవాణా వ్యవస్థనే గందరగోళానికి గురి చేశాయి. దీంతో కేంద్ర ప్రభుత్వమే తాను ఇచ్చిన ఆదేశాలకు తాత్కాలికంగా బ్రేక్ వేయాల్సి వచ్చింది. పరిస్థితి చక్కబడే వరకు ఈ చర్యలు తీసుకుంది. ఇంతలో వీలైనంత త్వరగా సిబ్బందిని నియమించుకోవాలని ఆదేశించింది. ఇప్పటికిప్పుడు సిబ్బందిని భర్తీ చేయడం అంత సులభం కాదు. పైలట్ల కొరత చాలా ఉన్నందున దీనికి చాలా సమయం పట్టే ఛాన్స్ ఉంది. అందుకే ఈ విభాగంలో భారీగా ఖాళీలు ఉంటున్నాయి.
నాలుగేళ్లలో పాతికవేల మంది అవసరం
ప్రస్తుతం భారత్‌లో పదివేల మందికిపైగా పైలట్లు పని చేస్తున్నారు. కానీ పెరుగుతున్న విమాన సర్వీసులకు, ప్రయాణికుల సంఖ్యకు తగ్గట్టుగా పైలట్లు పెరగడం లేదు. సీఏపీఏ ఇండియా అంచనాల ప్రకారం 20230 నాటికి ఇప్పుడు ఉన్న సంఖ్యకు రెట్టింపు సంఖ్యలో పైలట్లు అవసరం అవుతుంది. అంటే నాలుగేళ్లలో దాదాపు 23వేల వరకు పైలట్లు కావాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఏడాదికి పదిహేను వందల నుంచి రెండువేల వరకు కొత్త పైలట్లు కావాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు శిక్షణ పొందుతున్నది చాలా తక్కువ మంది. అందుకే ఈ కొరత తీర్చడానికి చాలా మంది అవసరం అవుతుంది.
ఏటా కావాల్సింది 1500లపైకు పైమాటే
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న శిక్షణ సంస్థలు ఏటా 800 వందల నుంచి వెయ్యి మందిని మాత్రమే తయారు చేస్తున్నాయి. దాదాపు వెయ్యి మంది వరకు లోటు ఉంటోంది. శిక్షణ పొందుతున్న వారిలో చాలా మంది విదేశాలకు వెళ్లిపోతున్నారు. మరికొందరు రిటైర్ అవుతున్నారు. కొందరికి సీనియార్టీ లేకపోవడం కూడా కొరతకు కారణమవుతోంది. ఆసక్తి ఉన్నప్పటికీ చాలా మంది ఖర్చును భరించలేక ఈ ఫీల్డ్‌లోకి రావడం లేదు. కొత్తగా లైసెన్స్‌పొందిన వారు టైప్ రేటింగ్, సిమ్యులేటర్ అనుభవం లేకపోవడంతో ఎయిర్‌లైన్లు నియమించుకోవడం లేదు. అనుభవజ్ఞులైన కమాండర్ల కొరత భారీగా ఉంటోంది. భారత్‌లో ఇచ్చే జీతాలతో పోల్చుకుంటే విదేశాల్లో ఎక్కువ ఇస్తున్నందున వలస వెళ్లే వారి సంఖ్య కూడా భారీగా ఉంటోంది.
ఇప్పటి వరకు ఎందుకు సమస్య ఎదురు కాలేదు
డీజీసీఏ కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ నిబంధనలు అమలులోకి తీసుకొచ్చింది. ఇది నవంబర్ 1 నుంచి అమలులోకి వచ్చింది. పైలట్లు అలసట తగ్గించేందుకు వీక్లీ రెస్టును 36 గంటల నుంచి 48 గంటలకు పెంచారు. నైట్ ల్యాడింగ్స్‌ను వారానికి ఆరు నుంచి రెండుకు పరిమితం చేశారు. ఈ నిబంధనలు మేలోనే ప్రకటించారు. దీనికి తగ్గట్టుగా ఇండిగో సన్నద్ధం కాలేదు. మార్చి 2025 నాటికి ఐదు వేలకుపైగా పైలట్లు ఉన్నా కొత్త రూల్స్ ప్రకారం కొత్తవారిని రిక్రూట్ చేసుకోలేదు.దీంతో పైలట్ల సర్దుబాటు సమస్య ఏర్పడింది. హైరింగ్‌ను కూడా ఫ్రీజ్ చేసింది. దీంతో భారీగా ఫ్లైట్‌లు క్యాన్సిల్ అయ్యాయి. విమాన ప్రయాణం గందరగోళంలో పడింది. టికెట్ ధరలు భారీగా పెరిగాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు కొత్తగా తీసుకొచ్చిన రూల్స్‌ను డీజీసీఏ తాత్కాలికంగా నిలుపుదల చేసింది. ఒక్క ఇండిగో కోసం ఫిబ్రవరి పది వరకు సమయం ఇచ్చింది.
అందుకే ఇప్పుడు ఎదురైన సంక్షోభం ఉద్యోగాల కల్పనకు మార్గం చూపింది. ఇప్పటి వరకు ఆసక్తి ఉండి కూడా ఉద్యోగాలు వస్తాయో రావో అన్న భయంతో ఉన్న వాళ్లకు ఇదో అవకాశంగా మారనుంది. అందుకే శిక్ష సంస్థలను పెంచడం, ఖర్చు తగ్గించడం, పైలట్ల జీతాలు పెంచి, వర్క్‌లైఫ్ బ్యాలెన్స్ చేస్తే కచ్చితంగా వలసలు తగ్గుతాయని పైలట్ సంఘాలు చెబుతున్నారు. శిక్షణ నిబంధనలు కూడా సడలించాలని డీజీసీఏను కోరుతున్నారు. ఫాస్ట్ ట్రాక్ సర్టిఫికేషన్ తేవాలని సూచిస్తున్నారు. ఇప్పుడు సంక్షోభం కారణంగా ఒక్క ఇండిగో సంస్థే వచ్చే ఏడాదిలో వెయ్యి మందికిపైగా పైలట్లను నియమించుకోవాలని చూస్తోంది. అంటే మిగతా వాళ్లకు అదే స్థాయిలో అవసరాలు ఉన్నాయి. అందుకే కాస్త ఆసక్తి ఉండి డబ్బులు పెట్టగలిగితే మాత్రం పైలట్ ఉద్యోగం మంచి జీతం, హోదా కలిగిన కొలువు అవుతుంది.





















