Next Successor of Ratan Tata: రతన్ టాటా వారసుల రేస్‌లో మాయా, నెవిల్లే , లియా- ఎవరు ఎందులో గొప్ప!
Ratan Tata Passed Away: పద్మవిభూషణ్ గౌరవ గ్రహీత రతన్ టాటా ముంబైలోని ఒక ఆసుపత్రిలో మరణించారు. ఆయన జీవితం, వృత్తిపరమైన రచనలు అసంఖ్యాక ప్రజలకు స్ఫూర్తిమంత్రంగా మారాయి.
Ratan Tata Death News: దేశంలోని అత్యంత గౌరవనీయమైన వ్యాపారవేత్తల్లో ఒకరు, దేశంలో అతి పెద్ద బిజినెస్ గ్రూప్ అయిన టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా బుధవారం (09 అక్టోబర్ 2024) అర్ధరాత్రి సమయంలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 86 సంవత్సరాలు. రతన్ టాటా నిష్క్రమణం తర్వాత, టాటా సన్స్ భారీ సామ్రాజ్యానికి ఇకపై ఎవరు నిర్వహిస్తారు, ఎవరు దిశానిర్దేశం చేస్తారన్న విషయంపై చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
రతన్ టాటా, తన వ్యాపార దక్షతతోనే కాదు, దాతృత్వంతోనూ ప్రసిద్ది చెందారు. టాటా ట్రస్ట్ ద్వారా విద్య, ఆరోగ్య సంరక్షణ, గ్రామీణాభివృద్ధి, విపత్తుల నివారణకు చాలా సాయం అందించారు. రతన్ టాటాకు వివాహం కాలేదు కాబట్టి ఆయనకు సంతానం లేదు. అందుకే, రతన్ టాటా మరణానంతరం ఆయన ఆస్తికి వారసులు ఎవరు అన్న ప్రశ్న కూడా అందరి మదిలో ఉంది.
రతన్ టాటా నిష్క్రమణ తర్వాత అతని వ్యాపార పగ్గాలను ఎవరు చేపడతారో తెలియాలంటే, ముందుగా ఆయన కుటుంబం గురించి తెలుసుకోవాలి. రతన్ టాటా తల్లిదండ్రుల పేర్లు నావల్ టాటా - సోనీ. వీళ్లిద్దరూ 1940ల్లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత, నావల్ టాటా 1955లో స్విస్ మహిళ సిమోన్‌ను వివాహం చేసుకున్నారు. ఆమె ద్వారా కలిగిన కుమారుల్లో ఒకరి పేరు నోయెల్ టాటా (Noel Tata). రతన్ టాటాకు పిల్లలు లేనందున, బిలియన్ల విలువైన ఈ ఆస్తి అతని సవతి సోదరుడు నోయెల్ టాటా సంతానానికి చేరే అవకాశం ఉంది. నోయెల్ టాటాకు ముగ్గురు పిల్లలు. వారి పేర్లు - మాయా టాటా (Maya Tata), నెలిల్లే టాటా (Neville Tata), లియా టాటా (Leah Tata).
మాయా టాటా(Maya Tata:)
మాయ వయస్సు 34 సంవత్సరాలు. బేయెస్ బిజినెస్ స్కూల్, వార్విక్ విశ్వవిద్యాలయం నుండి డిగ్రీలు పొందారు. ఆమె తన కెరీర్‌ను టాటా ఆపర్చునిటీ ఫండ్‌తో ప్రారంభించారు. ఆ తర్వాత ఆమె టాటా డిజిటల్‌లోకి మారారు. అక్కడ, టాటా న్యూ యాప్‌ను అభివృద్ధి చేయడంలో, లాంచ్ చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆమె ప్రస్తుతం తన తోబుట్టువులతో కలిసి టాటా మెడికల్ సెంటర్ ట్రస్ట్ బోర్డులో పని చేస్తున్నారు. మాయా టాటా తల్లి దివంగత టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ సోదరి & దివంగత బిలియనీర్ పల్లోంజీ మిస్త్రీ కుమార్తె.
నెవిల్లే టాటా(Neville Tata)
మాయా టాటా సోదరుడు నెవిల్లే టాటా. అతని వయస్సు 32 సంవత్సరాలు. రతన్ టాటా సామ్రాజ్యానికి వారసుడిగా ఇతను కూడా రేస్‌లో ఉన్నారు. టయోటా కిర్లోస్కర్ గ్రూప్ వారసురాలు మాన్సీ కిర్లోస్కర్‌ను వివాహం చేసుకున్నాడు. అతనికి జంషెడ్ టాటా అనే కుమారుడు ఉన్నాడు. ట్రెంట్ లిమిటెడ్ కింద టాటా స్టార్ బజార్ అనే హైపర్ మార్కెట్ చైన్‌కు నెవిల్లే నాయకత్వం వహిస్తున్నారు. దీనికిముందు, అతనికి ప్యాకేజ్డ్ ఫుడ్ అండ్ బెవరేజ్ విభాగం నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. అందులో తన సామర్థ్యాన్ని నిరూపించుకున్న తర్వాత, జూడియో, వెస్ట్‌సైడ్ బాధ్యతలు కూడా తీసుకున్నారు. టాటా గ్రూప్ వారసుడు ఇతనేనని చాలామంది నమ్ముతున్నారు.
లియా టాటా (Leah Tata)
లియా టాటా వయస్సు 39 సంవత్సరాలు. టాటా గ్రూప్‌లోని హోటల్ వ్యాపారంలోస ఆమె పని చేస్తున్నారు. స్పెయిన్‌లోని IE బిజినెస్ స్కూల్‌లో చదువుకున్నారు. గతంలో, తాజ్ హోటల్స్ బిజినెస్ చూసుకున్న లియా, ఇప్పుడు ఇండియన్ హోటల్ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. 2010లో కొంతకాలం లూయిస్ విట్టన్‌లో ఇంటర్న్‌షిప్ కూడా చేసారు. అయితే ఆమె దృష్టి మొత్తం హోటల్ పరిశ్రమపైనే ఉంది.
మరో ఆసక్తికర కథనం: రతన్ టాటా మృతిపై రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖుల సంతాపం- ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు