GV Reddy Effect: జీవీ రెడ్డి రాజీనామా ఎఫెక్ట్- ఏపీ ఫైబర్ నెట్ ఎండీ దినేష్ బదిలీ
Andhra Pradesh News: ఫైబర్ నెట్‌లో చెలరేగిన వివాదం మరో మలుపు తిరిగింది. జీవీ రెడ్డి రాజీనామాతో స్పందించిన ప్రభుత్వం ఎండీని బదిలీ చేసింది.

GV Reddy Effect: టీడీపీకి జీవీ రెడ్డి రాజీనామా చేయడంతో ప్రభుత్వం స్పందించింది. వెంటనే ఏపీ ఫైబర్ నెట్ ఎండీని దినేష్‌ను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు ఐఏఎస్ దినేష్ ఫైబర్ నెంట్ ఎండీతో పాటు ఆర్టీజీఎస్, గ్యాస్, డ్రోన్ కార్పొరేషన్ల బాధ్యతలు కూడా చూస్తున్నారు. అన్ని బాధ్యతల నుంచి ఆయనను ప్రభుత్వం తప్పించింది. జీఏడీకి రిపోర్టు చేయమని ఆదేశించింది. అంటే ఆయనకు పోస్టింగ్ లేదని అర్థం . .
గ్రూప్2 వివాదం తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో మరో వివాదం చెలరేగింది. ఫైబర్ నెట్‌లో జరుగుతున్న లుకలుకలు తారా స్థాయికి చేరాయి. ఏపీ ఫైబర్ నెట్‌లో ఉన్న ఉన్నతాధికారులు మాట వినడం లేదని ఆ సంస్థ ఛైర్మన్ జీవీ రెడ్డి ఆరోపించారు. నాడు టీడీపీని, కూటమి పార్టీలను తిట్టిన వారందరికీ నేడు కూడా జీతాలు ఇస్తున్నారని వాపోయారు. అలాంటి వారిని కొనసాగించడం వెనుక ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు. నాడు వైసీపీలో పెత్తనం చెలాయించిన వారే ఇప్పుడు కూడా సంస్థలో ఉన్నత స్థాయిలో ఉన్నందునే ఇలాంటివి జరుగుతున్నాయని ఆయన ఓపెన్ గాని చెప్పారు. ప్రెస్‌మీట్ పెట్టి ఇలా ఓపెన్‌గా అధికారులను తిట్టడం వైరల్‌గా మారింది. దీనికి టీడీపీ కార్యకర్తలు కూడా వంత పాడారు. అయితే ప్రభుత్వ పెద్దలు దీని కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు.
ఈ వివాదంలో అసలేం జరిగిందో కానీ.. మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. జీవీరెడ్డితో రాజీనామా చేయించడంతో ఆయన పార్టీ కి కూడా రాజీనామా చేశారు. ఫైబర్ నెట్ వ్యవహారం మొదటి నుంచి వివాదాస్పదంగా ఉంది. జీవీ రెడ్డి చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత పలు అక్రమాలను వెలుగులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నించారు. వైసీపీ హయాంలో చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టించేందుకు చేసిన ప్రయత్నాలకు సంబంధించి ఫైళ్లను కూడా బయటకు తీసి.. పలు ఆరోపణలు చేశారు. అయితే ఎక్కడ గ్యాప్ వచ్చిందో కానీ.. దినేష్ కుమార్ తో ఆయనకు సరిపడలేదు. దాంతో వివాదం ప్రారంభమయింది.
అధికారుల తీరుపై ఫైబర్ నెట్ చైర్మన్ .. ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లయితే బాగుండేదన్న అభిప్రాయం ఉంది. ఐఏఎస్ అధికారులు సహజంగానే తమదే పైచేయి కావాలని అనుకుంటారని.. వారితో పని చేయించుకోవాలంటే కాస్త క్లిష్టమేనని అయితే నేరుగా ఆరోపణలు చేయడం కూడా మంచిది కాదన్న అభిప్రాయాలు వినిపించాయి. చివరికి అటు ఎండీతో పాటు ఇటు చైర్మన్ కూడా రాజీనామా చేయడంతో ఇప్పుడు పైబర్ నెట్ ఖాళీ అయింది.
ఫైబర్ నెట్ చైర్మన్ పదవి నామినేటెడ్ పోస్టు కావడంతో.. దాన్ని రాజకీయంగా భర్తీ చేసే అవకాశం ఉంది. మరో వైపు ఎండీ పోస్టును తరుపరి బదిలీల్లో భర్తీ చేయనున్నారు. అయితే ఫైబర్ నెట్ అంతర్గతంగా ఏమి జరిగిందన్నది అధికార వర్గాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది.





















