Traffic challan cyber scam: సైబర్ ఫ్రాడ్ అలర్ట్ - ట్రాఫిక్ చలాన్ అని మెసెజ్, క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ !
Cyber Fraud: సైబర్ నేరగాళ్లు ట్రాఫిక్ చలాన్ పేరుతో కొత్త స్కామ్ కు తెర తీశారు. టార్గెటెడ్‌గా సమాచారం సేకరించి ఫోన్‌లోకి చొరబడి ఖాతాలు ఖాళీ చేస్తున్నారు.

Traffic challan Cyber Fraud: మీ ఫోన్ నుంచి ఫోన్ పే ఓపెన్ చేయాల్సిన పని లేదు. గూగుల్ పే కోడ్ క్లిక్ చేయాల్సిన పని లేదు. కానీ మీ అకౌంట్ నుంచి అదే పనిగా డబ్బులు తరలించుకుపోయే మార్గాన్ని సైబర్ ఫ్రాడ్ స్టర్లు కనిపెట్టారు. దానికి వారు చాలా చిన్న టెక్నిక్ ఫాలో అవుతున్నారు. అదేమిటంటే ట్రాఫిక్ చలాన్.
మొదట ట్రాఫిక్ చలాన్ పడిందన్న మెసెజ్
మీరు కారులోనే లేకపోతే బైక్ మీదనే ఎక్కడికైనా వెళ్తూంటారు. కొంత దూరం వెళ్లిన తర్వాత మీకో మెసెజ్ వస్తుంది. మీరు ఫలానా దారి నుంచి వచ్చారు. అక్కడ సిగ్నల్ జంపింగ్ చేశారు. అందుకే ఫైన్ పడింది. అని ఆ మెసెజ్ సారాంశం. చూడటానికి ట్రాఫిక్ పోలీసుల ఒరిజినల్ మెసెజ్ లాగే ఉంటుంది. ఆ మెసెజ్ లో డీటైల్స్ చూడాలంటే క్లిక్ చేయమని ఉంటుంది. చలాన్ పడిందన్న కంగారులో దాన్ని క్లిక్ చేస్తే అసలు కథ ప్రారంభిస్తారు సైబర్ క్రిమినల్స్.
దాన్ని క్లిక్ చేస్తే ఫోన్ లో గుర్తు తెలియని యాప్ డౌన్ లోడ్
ఆ మెసెజ్ పై క్లిక్ చేయగానే వెంటనే మీకు తెలియకుండానే ఓ యాప్ ఫోన్ లో ఇన్ స్టాల్ అయిపోతుంది. తర్వాత వరుసగా బ్యాంక్ అకౌంట్లలో ఉన్న డబ్బులన్నీ గుర్తు తెలియని ఖాతాలకు వెళ్లిపోతూ ఉంటాయి. వాటిని ఎవరు చేస్తున్నారో తెలియదు. అంటే.. ఆ మెసెజ్ ద్వారా ఇన్ స్టాల్ చేసిన యాప్ ద్వారా ఫోన్ ను నియంత్రణలోకి తీసుకుని డబ్బులన్నీ తరలించుకుపోతున్నారు.
ఫోన్ నియంత్రణలోకి తీసుకుని డబ్బులు తరలించుకుంటున్న ఫ్రాడ్ స్టర్లు
విజయవాడలో ఓ వ్యక్తి బెంజ్ సర్కిల్ మీదుగా తన కార్యాలయానికి వెళ్తున్న సమయంలో.. మెసెజ్ వచ్చింది. అప్పుడే తాను బెంజ్ సర్కిల్ దాటి రావడంతో నిజంగానే చలాన్ పడిందేమో అనుకుని క్లిక్ చేశాడు. అక్కడ ఏమీ లేదు. హడావుడిలో పట్టించుకోలేదు. కానీ కాసేపటికి అతని అకౌంట్ నుంచి డబ్బులు మాయం కావడం ప్రారంభించాయి. చూస్తే.. ఓ గుర్తు తెలియని యాప్ డౌన్ లోడ్ అయి ఉంది. వెంటనే ఆ యాప్ తొలగించాడు. దీంతో డబ్బులు తరలించడం ఆగిపోయింది. కానీ అప్పటికే నిలువు దోపిడీకి గురయ్యాడు.
ఏపీకే ఫైల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసుల సూచన
ఇలాంటివి సైబర్ క్రిమినల్స్ చాలా పక్కాగా చేస్తున్నారు. మోసాలపై ఎంత అవగాహన ఉన్నప్పటికీ.. అనుకోకుండా చేసే ఒక్క క్లిక్ వల్ల మొత్తం ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఏపీకే ఫైల్స్ రూపంలో వచ్చే ఇలాంటి మెసెజ్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ కిక్ చేయవద్దని నిపుణులు సలహాలు ఇస్తున్నారు.





















