Droupadi Murmu Arrives In Hyderabad: శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
Indian President Droupadi Murmu Arrives Winter Sojourn | భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు విచ్చేశారు. ముర్ము పర్యటన షెడ్యూల్ వివరాలిలా ఉన్నాయి.

Droupadi Murmu Hyderabad Schedule | హైదరాబాద్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది నిమిత్తం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ప్రత్యేక విమానం ద్వారా రాష్ట్రపతి ముర్ము హకీంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. రాష్ట్రపతి ముర్ముకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, సీతక్క ఘనస్వాగతం పలికారు. ముర్ము అక్కడి నుండి నేరుగా సికింద్రాబాద్‌లోని బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. ఈ విడిదిలో భాగంగా ఆమె మొత్తం ఐదు రోజుల పాటు ఇక్కడే బస చేస్తారు. రాష్ట్రపతి పర్యటనలో భాగంగా అల్వాల్, బొల్లారం ప్రాంతాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
రాష్ట్రపతి ముర్ము పర్యటనలోని కార్యక్రమాలు
రాష్ట్రపతి తన 5 రోజుల పర్యటనలో పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొంటారు. డిసెంబర్ 19న రాష్ట్రపతి ముర్ము రామోజీ ఫిల్మ్‌సిటీని సందర్శించనున్నారు. అక్కడ జరగనున్న ఆలిండియా పబ్లిక్ సర్వీస్ కమిషనర్ల జాతీయ సదస్సును ఆమె ప్రారంభించనున్నారు. అనంతరం డిసెంబర్ 20వ తేదీన గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ సంస్థ నిర్వహించే సదస్సులో పాల్గొంటారు. డిసెంబర్ 21న రాష్ట్రపతి నిలయంలో సాధారణ పౌరులతో ఆమె భేటీ, తరువాత ఎట్ హోం కార్యక్రమంలో పాల్గొనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది పర్యటనను పురస్కరించుకుని ఈ నెల 22వ తేదీ వరకు అల్వాల్, గచ్చిబౌలి పరిధిలో డ్రోన్లు, పారా గ్లైడర్లు, మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల ఎగురవేయడంపై పోలీసులు నిషేధం విధించారు. అదేరోజు సాయంత్రం ప్రత్యేకవిమానంలో ఆమె ఢిల్లీకి బయలుదేరనున్నారు.
రాష్ట్రపతి నిలయం: చారిత్రక నేపథ్యం, విశేషాలు
హైదరాబాద్‌లోని బొల్లారం ప్రాంతంలో ఉన్న రాష్ట్రపతి నిలయం దేశంలోని 3 అధికారిక రాష్ట్రపతి నివాసాలలో ఒకటి. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్, సిమ్లాలోని 'ది రిట్రీట్' తర్వాత దక్షిణాదిలో రాష్ట్రపతి బస చేసే ఏకైక ప్రాంతం ఇదే.
చరిత్ర: బొల్లారంలోని రాష్ట్రపతి శీతాకాల విడిది భవనాన్ని 1860లో అప్పటి హైదరాబాద్ నిజాం నిర్మించారు. ఆ తర్వాత ఇది బ్రిటిష్ రెసిడెంట్ నివాసంగా ఉంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దీనిని ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ భారత ప్రభుత్వానికి అప్పగించారు.
నిర్మాణం: సుమారు 90 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనం ప్రాంగణంలో అందమైన ఉద్యానవనాలు, హెర్బల్ గార్డెన్స్ ఉన్నాయి.
ప్రజా సందర్శన: రాష్ట్రపతి భవన్ సంప్రదాయం ప్రకారం, ప్రతి ఏడాది జనవరి నెలలో రాష్ట్రపత నిలయాన్ని సామాన్య ప్రజల సందర్శనార్థం తెరిచి ఉంచుతారు. అయితే ప్రస్తుతం రాష్ట్రపతి బస చేస్తున్నందున భద్రతా కారణాల దృష్ట్యా అక్కడ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.






















