Telangana Assembly Speaker: ఆ ఐదుగురు ఎమ్మెల్యేలకు రిలీఫ్ - పార్టీ మారినట్లు ఆధారాల్లేవ్ - బీఆర్ఎస్ పిటిషన్లు కొట్టేసిన స్పీకర్
Disqualification petitions: పార్టీ ఫిరాయించిన ఐదుగురు ఎమ్మెల్యేలపై అనర్హతా పిటిషన్లను స్పీకర్ తిరస్కరించారు. చట్టం ప్రకారం వారు పార్టీ మారినట్లుగా ఆధారాల్లేవన్నారు.

Telangana Assembly Speaker disqualification petitions against five MLAs: తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పార్టీ ఫిరాయించిన ఐదుగురు ఎమ్మెల్యేల విషయంలో సంచలన నిర్ణయం ప్రకటించారు. ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు నిరూపితమైన ఆధారాలు లేవని స్పీకర్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో చేరారని అనర్హతా వేటు వేయాలని బీఆర్ఎస్ ఇచ్చిన పిటిషన్లను స్పీకర్ తిరస్కరించారు.
1. తెల్లం వెంకట్రావు
2. అరికెపూడి గాంధీ
3. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
4. టి. ప్రకాశ్ గౌడ్
5. గూడెం మహిపాల్ రెడ్డి
ఈ ఐదుగురిపై అనర్హతా పిటిషన్లును తిరస్కరించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు 2024లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ నాయకులు ఈ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ స్పీకర్‌కు పిటిషన్లు దాఖలు చేశారు. ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం, పార్టీ మారితే అనర్హత వేటు పడుతుంది. కానీ అధికారికంగా పార్టీ మారితే లేకపోతే పార్టీ విప్ ధిక్కరించాల్సి ఉంటుంది. ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని మర్యాదపూర్వకంగా సీఎంను కలిశామని చెబుతున్నారు. తము కాంగ్రెస్ పార్టీ కండువాను ధరించలేదని చెబుతున్నారు.
మిగిలినవారు దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య, సంజయ్ కుమార్ ఉన్నారు. వీరిపై కూడా విచారణలు జరిగాయి. వీరిలో కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఇంకా స్పీకర్ కు నిర్ణయం చెప్పలేదు. మిగతా ముగ్గురి విచారణ పూర్తయింది. వారి పై నిర్ణయం కూడా త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.
గతంలో స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడంతో స్పీకర్ జాప్యం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జులై 2025లో సుప్రీంకోర్టు 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అక్టోబర్ 31, 2025 గడువు ముగిసినా నిర్ణయం తీసుకోకపోవడంతో 17న సుప్రీంకోర్టు "గ్రాస్ కంటెంప్ట్" అంటూ హెచ్చరించి, 4 వారాల్లో అంటే డిసెంబర్ 18లోపు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఈ ఒత్తిడి కారణంగా స్పీకర్ విచారణలు వేగవంతం చేసి, ఐదుగురిపై తొలి దశ తీర్పు ఇచ్చారు.
ఈ ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లుగా ఆధారాలు ఉన్నాయని బీఆర్ఎస్ లాయర్లు స్పీకర్ ఎదుట వాదించారు. కాంగ్రెస్ సమావేశాలకు హాజరై, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని, ప్రసంగాలు చేశారు. వీడియోలు, ఫోటోలు, ప్రకటనలు ఆధారాలుగా సమర్పించారు. ఇది స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వం వదులుకున్నట్లఅని వారన్నారు. అయితే పార్టీలో అధికారికంగా చేరలేదు. సీఎం రేవంత్ రెడ్డితో భేటీలు కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే. పార్టీ మారినట్లు స్పష్టమైన ఆధారాలు లేవన్నారు. వీరి వాదనకే స్పీకర్ మొగ్గు చూపారు.
అయితే స్పీకర్ నిర్ణయంపై భారత రాష్ట్ర సమితి న్యాయపోరాటం చేసే అవకాశం ఉంది. మగిలిన వారిపై నిర్ణయం ప్రకటించే వరకూ ఎదురు చూస్తారా.. లేదా వెంటనే వెళ్తారా అన్నది బీఆర్ఎస్ సహైకమాండ్ నిర్ణయం తీసుకోనుంది.





















