Deputy CM Pawan Kalyan: ప్రతిపక్ష హోదా కావాలంటే జగన్ జర్మనీకి వెళ్లాలి - డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Andhra Pradesh Politics | ప్రతిపక్ష హోదా కావాలంటే వైసీపీ అధ్యక్షుడడు వైఎస్ జగన్ జర్మనీకి వెళ్లాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Deputy CM Pawan Kalyan about YS Jagan | అమరావతి: వైసీపీ సభ్యులు డిమాండ్ చేస్తున్న వైఎస్ జగన్‌కు ప్రతిపక్షనేత హోదాపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఎక్కువ శాతం ఓట్లు వస్తే వాళ్లకు ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం జర్మనీలో ఉంటుంది. కావాలంటే వైఎస్ జగన్, వైఎస్ఆర్సీపీ నేతలు జర్మనీకి వెళ్లవచ్చు అని ఎద్దేవా చేశారు. జనసేనకు 21 సీట్లు రాగా, 11 సీట్లు వచ్చిన వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఏపీ ప్రజలు గట్టిగా తీర్పిచ్చారు. మీ స్థాయికి తగ్గట్లుగా సభలో మమ్మల్ని ప్రశ్నించాలని సూచించారు. 11 సీట్లు వచ్చినా వైసీపీ సభ్యులను స్పీకర్ మర్యాదపూర్వకంగా చూసినా, లోపాలు ఎత్తి చూపడం సరికాదన్నారు. అసెంబ్లీకి రాగానే గొడవ పెట్టుకోవాలి, రాద్దాంతం చేయాలనే తీరు మార్చుకోవాలని హితవు పలికారు.
ఐదేళ్లు ప్రతిపక్ష హోదా వచ్చే ఛాన్స్ లేదు
‘వైసీపీకి ఐదేళ్లు ప్రతిపక్ష హోదా రాదని, దీన్ని సీఎం చంద్రబాబు గానీ, జనసేన గానీ, స్పీకర్ గానీ ఫిక్స్ చేయలేదు. ప్రజలు ఎన్నికల్లో సభ్యులను గెలిపిస్తే మాత్రమే మీకు ప్రతిపక్ష హోదా వస్తుంది. తాను డిప్యూటీ సీఎం కనుక ప్రధాని మోదీ పక్కన కూర్చోబెట్టారు కానీ ప్రత్యేక హోదాతో కాదు. డిప్యూటీ సీఎంకే ప్రొటోకాల్ ఉండదు. కేవలం సీఎం చంద్రబాబుకు మాత్రమే ప్రొటోకాల్ ఉంటుంది. అందుకు మాకు కూడా ప్రొటోకాల్ కావాలని వైసీపీ నేతల తరహాలో డిప్యూటీ సీఎంగా నేను అడగటం లేదు.
జర్మనీకి వెళ్లండి జగన్..
నిజంగా ప్రతిపక్ష హోదా కావాలంటే వైఎస్ జగన్ జర్మనీకి వెళ్లాల్సి ఉంటుంది. జర్మనీలో ఓ పార్టీకి అత్యధికంగా వచ్చిన 25 శాతం ఓట్లు. 5 శాతం కంటే తక్కువ సీట్లు వచ్చిన వారిని ఇతర పార్టీలు పంచుకుంటాయి. కానీ మన వద్ద అలాంటి అవకాశం లేదు. నిజంగానే ప్రతిపక్ష హోదా కావాలంటే వైసీపీ నేతలు, జగన్ జర్మనీకి వెళ్లడమే మేలు’ అని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సభలో వైసీపీ నినాదాలు, వాకౌట్.. పవన్ కళ్యాణ్ చురకలు
అనారోగ్యంతో ఉన్నా గవర్నర్ సభకు వచ్చి ప్రసంగించారు. కానీ వైసీపీ నేతలు హద్దులు మీరి, హుందాతనం లేకుండా ప్రవర్తించారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. అంతకుముందు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన వెంటనే గవర్నర్ ప్రసంగిస్తుంటే వైసీపీ సభ్యులు నినాదాలు చేస్తూ అడ్డు తగిలే ప్రయత్నం చేశారు. ప్రజాస్వామ్యాన్ని బతికించాలని, వైఎస్సార్ సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని నినాదాలు చేస్తూ పోడియం వద్దకు వెళ్లారు. దాదాపు 10 నిమిషాల పాటు నిరసన తెలిపిన వైసీపీ సభ్యులు పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ తో కలిసి సభ నుంచి వాకౌట్ చేయడం తెలిసిందే. దీనిపై అసెంబ్లీ మీడియాతో పాయింట్లో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. వైసీపీకి ఈ ఐదేళ్లు ప్రతిపక్ష హోదా ఇచ్చేది లేదని, అధికార పార్టీ తరువాత ఎక్కువ సీట్లు అది కూడా పది శాతం స్థానాలు గెలిస్తేనే ప్రతిపక్ష హోదా సాధ్యమని స్పష్టం చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

