జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?
ఐపీఎల్ 2026 మినీ వేలంలో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చాలా తెలివిగా ఆటగాళ్లను కొనుగోలు చేసింది. మంగళవారం అబుదాబి వేదికగా జరిగిన ఈ మినీ ఆక్షన్‌లో కేవలం రూ.16.4 కోట్లు పర్స్‌మనీతోనే బరిలోకి దిగిన ఆర్‌సీబీ.. కత్తిలాంటి ఆటగాళ్లను చాలా చీప్‌గా పట్టేసింది. మొత్తంగా 8 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసిన ఆర్సీబీ.. వెంకటేష్ అయ్యర్ లాంటి కత్తి లాంటి ఇండియన్ ఆల్‌రౌండర్‌ని చాలా చీప్‌గా కొట్టేసింది. నిజానికి వెంకటేష్ అయ్యర్ కోసం లాస్ట్ సీజన్ వేలంలోనే ఆర్సీబీ చివరి వరకు పోరాడింది.
అయితే 23.75 కోట్ల దగ్గర చేతులెత్తేసిన ఆర్సీబీ.. ఈ ఏడాది కేవలం 7 కోట్లకే కొనుగోలు చేసి జాక్‌పాట్ కొట్టేసింది. దీంతో టీమ్‌లో కరువైన ఇండియన్ ఆల్‌రౌండర్ ప్లేస్‌ను వెంకటేష్ అయ్యర్‌తో ఫిల్ అయిపోయినట్లైంది. అయితే మరో వైపు అనామక ప్లేయర్ అయిన.. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ మంగేష్ యాదవ్ కోసం ఏకంగా 5.20 కోట్లు పే చేసి అందరికీ షాకిచ్చింది. డెత్ ఓవర్ స్పెషలిస్ట్ కావడంతో పాటు చివర్లో బ్యాటంగ్ చేసే సత్తా ఉన్న ఆటగాడు కావడంతోనే ఆర్సీబీ ఈ రిస్క్ తీసుకుంది. బ్యాకప్ పేసర్‌గా న్యూజిలాండ్ పేసర్ జాకోబ్ డఫ్ఫీని రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది.
అలాగే దేశవాళీ క్రికెటర్లు సత్విక్ దేస్వాల్, జోర్డాన్ కాక్స్, విక్కీ ఓస్ట్‌వాల్, విహాన్ మల్హోత్రా, కాన్షిక్ చౌహన్‌లను వాళ్ల కనీస ధర రూ.30 లక్షలకే కొనుగోలు చేసింది. అయితే ఈ పర్చేజ్‌తో పేపర్‌పై ఆర్‌సీబీ కట్టుదిట్టంగా ఉంది. సీనియర్, జూనియర్ ఆటగాళ్లతో పాటు బ్యాటర్లు, ఆల్‌రౌండర్లు, పేసర్లతో సమతూకంగా కనిపిస్తోంది. 8వ స్థానం వరకు బ్యాటింగ్ డెప్త్ ఉంది. బ్యాకప్ ప్లేయర్లు బాగున్నారు. మరి ఈ సీజన్లో ఆర్సీబీ ఏ రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇస్తుందో చూడాలి.





















