IPL 2026 first phase schedule: ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు - తొలి పోరులో బెంగళూరుతో హైదరాబాద్ ఢీ!
TATA IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్‌కు నగారా మోగింది. టాటా ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్‌ను బీసీసీఐ బుధవారం విడుదల చేసింది.

BCCI announces schedule for first phase of TATA IPL 2026: క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 19వ సీజన్‌కు నగారా మోగింది. టాటా ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్‌ను బీసీసీఐ బుధవారం విడుదల చేసింది. మార్చి 28 నుండి ఏప్రిల్ 12 వరకు జరగనున్న మొదటి దశలో మొత్తం 20 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాతే ఐపీఎల్ పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేస్తామని బోర్డు ప్రకటించింది.
డిఫెండింగ్ ఛాంపియన్‌తోనే ఆరంభం
మార్చి 28న బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న ఆరంభ వేడుకల అనంతరం తొలి పోరు ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) , మాజీ ఛాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు తొలి మ్యాచ్‌లో తలపడనున్నాయి. సొంత గడ్డపై ఆర్‌సీబీ బోణీ కొట్టాలని చూస్తుండగా, హైదరాబాద్ తమ సత్తా చాటేందుకు సిద్ధమైంది. మరుసటి రోజు ఆదివారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు ఢీకొంటాయి.
🚨 News 🚨
— IndianPremierLeague (@IPL) March 11, 2026
Presenting the schedule for the first 20 matches of #TATAIPL 2026, to be played from March 28 to April 12, 2026 🗓️
Full schedule will be announced once poll dates are announced for three states set to undergo State Assembly elections.
More details ▶️… pic.twitter.com/8Iq492v8TE
డబుల్ హెడర్లు.. కొత్త వేదికలు
తొలి దశలో మొత్తం నాలుగు డబుల్ హెడర్ అంటే రోజుకు రెండు మ్యాచ్‌లు మ్యాచ్‌లు ఉన్నాయి. మధ్యాహ్నం మ్యాచ్‌లు 3:30 గంటలకు, రాత్రి మ్యాచ్‌లు 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 4న సీజన్‌లో తొలి డబుల్ హెడర్ జరగనుంది. ఆ రోజు మధ్యాహ్నం ఢిల్లీ వర్సెస్ ముంబై, రాత్రి గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సీజన్‌లో మ్యాచ్‌లు బెంగళూరు, ముంబై, గౌహతి, న్యూ చండీగఢ్, లక్నో, కోల్‌కతా, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబా, హైదరాబాద్‌లలో జరగనున్నాయి.
హోమ్ గ్రౌండ్ మార్పులు
రాజస్థాన్ రాయల్స్ తమ తొలి హోమ్ మ్యాచ్‌లను గౌహతిలో ఆడనుంది. అక్కడ చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. పంజాబ్ కింగ్స్ తమ హోమ్ మ్యాచ్‌లను న్యూ చండీగఢ్‌లోని పీసీఏ స్టేడియంలో ఆడుతుంది. ఆర్‌సీబీకి బెంగళూరుతో పాటు రాయ్‌పూర్ రెండో హోమ్ గ్రౌండ్‌గా ఉండగా, పంజాబ్ కింగ్స్ ధర్మశాలలో, రాజస్థాన్ రాయల్స్ జైపూర్‌లో కూడా తమ హోమ్ మ్యాచ్‌లను ఆడనున్నాయి.
బెంగళూరు వేదికపై సస్పెన్స్
అయితే బెంగళూరులో జరగాల్సిన మ్యాచ్‌లు కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ క్లియరెన్స్‌పై ఆధారపడి ఉన్నాయి. మార్చి 13న ఈ కమిటీ చిన్నస్వామి స్టేడియాన్ని సందర్శించి, మ్యాచ్ నిర్వహణకు ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలిస్తుంది. పూర్తిస్థాయి మాక్ డెమాన్స్‌ట్రేషన్ తర్వాతే బెంగళూరు వేదికపై తుది నిర్ణయం వెలువడనుంది.
ట్రెండింగ్ వార్తలు



















