GV Reddy Resign: టీడీపీకి షాకిచ్చిన జీవీ రెడ్డి - పార్టీకి, పదవికి రాజీనామా - ఫైబర్ నెట్ వివాదంలో ఏం జరిగింది
AP Fiber net: ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీరెడ్డి తన పదవితో పాటు టీడీపీకి కూడా రాజీనామా చేశారు. ఇటీవల ఆయన ప్రెస్ మీట్ కారణంగా ఈ రాజీనామా చేయాల్సి వచ్చిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

AP Fiber Net Chairman GV Reddy resign: తెలుగుదేశం పార్టీ యువనేత, ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా హ్యండిల్ లో ప్రకటించారు. తాను ఇక ఏ రాజకీయ పార్టీలో చేరబోనని లాయర్ గా తన వృత్తిని కొనసాగిస్తానని ఆయన ప్రకటించారు.
— G V Reddy (@gvreddy0406) February 24, 2025
ఫైబర్ నెట్ చైర్మన్ గా ఆయన కొద్ది కాలం కిందటే బాధ్యతలు తీసుకున్నారు. అప్పటి నుంచి ఆయన ఫైబర్ నెట్ లో గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను బయటకు తీసేందుకు ప్రయత్నించారు. రామ్ గోపాల్ వర్మకు పెద్ద ఎత్తున డబ్బులు చెల్లించిన వైనాన్ని జీవీ రెడ్డి బయట పెట్టి ఆయనకు నోటీసులు జారీ చేశారు. పదిహేను రోజుల్లోగా డబ్బులు చెల్లించకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఆ మధ్య 410 మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లుగా కూడా ప్రకటించారు.
వారం రోజుల కిందట ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేరుగా ఫైబర్‌నెట్ ఎండీ, ఐఏఎస్ దినేష్ పై ఆరోపణలు చేశారు. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలను బయటకు రాకుండా కాపాడుతున్నారని మండిపడ్డారు. 410 మంది ఉద్యోగుల్ని తీసేయమని చెప్పినా ఇంకా జీతాలిస్తున్నారని.. ఆ డబ్బుల్ని దినేష్ దగ్గర నుంచి వసూలు చేయాలన్నారు. దినేష్ పేషీలో పని చేస్తున్న ముగ్గురు అధికారుల్ని విధుల్నించి తొలగిస్తున్నట్లుగా ప్రకటించారు. ఫైబర్ నెట్ ను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు.
జీవీ రెడ్డి చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ఆయన చేసిన ఆరోపణలపై ఐఏఎస్ అధికారుల సంఘం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లింది. దీంతో సంబంధిత శాఖకు మంత్రి అయిన బీసీ జనార్ధన్ రెడ్డి ఈ వ్యవహారంపై ఆటు ఫైబర్ నెట్ ఎండీ దినేష్ తో పాటు ఇటు ఆరోపణలు చేసిన ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డిని పిలిచి మాట్లాడారు. జీవీ రెడ్డి చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలని అడిగినట్లుగా తెలుస్తోంది. ఆయన తన వద్ద ఉన్న సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఇంతలో ఏమయిందో కానీ.. జీవీ రెడ్డి హఠాత్తుగా రాజీనామా చేశారు.
గతంలో వైసీపీలో పని చేసిన జీవీరెడ్డి అక్కడ సరైన గౌరవం లభించకపోవడంతో టీడీపీలో చేరారు. ఆయనకు మంచి వాగ్దాటి ఉండటంతో అధికార ప్రతినిది హోదా ఇచ్చారు. టీవీ చర్చల్లో ధాటిగా టీడీపీని సమర్థించేవారు. వైసీపీ తీరును ఎండగట్టే వారు. జీవీ రెడ్డి వ్యవహారంపై టీడీపీ క్యాడర్ లో సానుభూతి ఉంది. ఆయనకు మద్దతుగా టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

