Crime News: ఎంతకు తెగించార్రా..! ఇన్సూరెన్స్ చేపించి మరీ అన్నను హత్య చేసిన తమ్ముడు.. ఇంత దారుణమా!
Karimnagar Crime News | ఇన్సూరెన్స్ చేపించి మరీ ఓ వ్యక్తి తన సోదరుడ్ని హత్య చేశాడు. అందుకు ఇద్దరు వ్యక్తుల సాయం తీసుకున్నాడు. కరీంనగర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది.

రామడుగు: ప్రస్తుతం మానవ సంబంధాలు ఎటు పోతున్నాయో అర్థం కావడం లేదు. అన్నీ ఆర్థిక సంబంధాలుగా మారుతున్నాయి. ఆస్తి కోసం రక్త సంబంధం ఉన్న వారిని, తల్లిదండ్రులను, పిల్లలను హత్య చేస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఓ దారుణ ఘటన వెలుగుచూసింది. అప్పులు పెరిగాయని, స్టాక్ మార్కెట్లోనూ భారీ నష్టాలతో ఏకంగా తన సోదరుడిపై ఇన్సూరెన్స్ చేపించి, ఆ డబ్బు కోసం హత్య చేసి ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయాడు ఓ తమ్ముడు.
ఓవైపు అప్పులు, స్టాక్ మార్కెట్లో నష్టాలు..
కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సొంత అన్నను తమ్ముడే దారుణంగా హత్య చేసిన సంఘటన వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామడుగులో నివసించే మామిడి నరేష్ (30), సుమారు మూడేళ్ల క్రితం రెండు టిప్పర్ లారీలను కొనుగోలు చేసి వాటిని అద్దెకు ఇస్తున్నాడు. ఇటీవల వ్యాపారం సరిగా నడవక నరేష్ అప్పుల పాలయ్యాడు. స్టాక్ మార్కెట్లోనూ భారీగా నష్టాలు వచ్చాయి. దాదాపు రూ.1.5 కోట్ల వరకు అప్పులు ఉండటంతో వాటి నుంచి బయట పడేందుకు దారుణమైన మర్డర్ స్కెచ్ వేశాడు.
అప్పుల నుంచి బయటపడేందుకు నరేష్ తన అన్న వెంటటేష్(37)ను హత్య చేయాలని ప్లాన్ చేశాడు. మానసిక పరిపక్వత లేని అన్న వెంకటేష్ పేరిట ఇన్సూరెన్స్ పాలసీ చేయించాడు. కొన్ని రోజుల తరువాత అన్నను హత్య చేసి, ఆ ఇన్సూరెన్స్ డబ్బులతో అప్పులు తీర్చుకోవాలని నరేశ్ నిర్ణయించుకున్నాడు. తన ప్లాన్ ప్రకారం.. 2 నెలల కాలంలో నరేష్ తన అన్న వెంకటేష్ పేరు మీద వేర్వేరు సంస్థల నుండి సుమారు రూ.4.14 కోట్ల విలువైన ఇన్సూరెన్స్ పాలసీలు చేయించాడు.
హత్యకు సహకరించిన అప్పు ఇచ్చిన వ్యక్తి
తనకు నరేష్ ఇవ్వాల్సిన రూ.7 లక్షలు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్న రాకేష్ అనే వ్యక్తికి విషయం చెప్పి తన కుట్రకు సహకరించాలని కోరాడు. అప్పుతో పాటు మరో రూ.13 లక్షలు కలిపి మొత్తం 20 లక్షలు ఇస్తానని ఒప్పించాడు. ఈ హత్యకు సహకరిస్తే రూ.2 లక్షలు ఇస్తానని టిప్పర్ డ్రైవర్ ప్రదీప్‌కు చెప్పాడు. నవంబర్ 29న గ్రామ శివారులో టిప్పర్ లారీ ఆగిపోయిందని ప్రదీప్ ఫోన్ చేసి వెంకటేష్‌ను పిలిపించాడు. అక్కడకు వచ్చిన వెంకటేష్‌ను టిప్పర్ కింద జాకీ పెట్టాలని నరేష్ చెప్పాడు. వెంకటేష్ కింద పడుకోగానే, నరేష్ టిప్పర్‌ను ముందుకు నడిపాడు. దీంతో టిప్పర్ టైర్లు వెంకటేష్ తల మీదుగా వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. తమ్ముడు నరేశ్ ఇచ్చిన వివరాలతో ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనగా పోలీసులు కేసు నమోదు చేశారు.
నిందితుడ్ని పట్టించిన ఇన్సూరెన్స్ ఎంక్వైరీ
ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లించేందుకు వచ్చిన బీమా కంపెనీ ప్రతినిధులు ఎంక్వైరీ చేయగా నరేష్ చెప్పిన సమాధానాలు అనుమానాస్పదంగా కనిపించాయి. వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి మరింత లోతుగా దర్యాప్తు చేశారు. రాకేష్, ప్రదీప్‌ల సహకారంతో వెంకటేష్‌ను తన తమ్ముడు నరేష్ హత్య చేసినట్లు విచారణలో నిర్ధారించారు. అమాయకుడ్ని హత్య చేసిన కేసులో నిందితులు నరేష్, రాకేష్, ప్రదీప్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.






















